బీజేపీ మీద మీరు ఏ విమర్శ ఐనా చేయండి, వాళ్ల తప్పొప్పుల్ని, వైఫల్యాన్ని ఎండగట్టండి… వాళ్లు సింపుల్‌గా అన్నింటికీ నెహ్రూయే కారణమని తేల్చేస్తారు… ఆయన పాలన వైఫల్యాలు, విధానాల అసమర్థత కారణంగానే ఇప్పుడు దేశం సర్వకష్టాలూ పడుతోందని సూత్రీకరించేస్తారు… సపోజ్, మీరు కేసీయార్ మీద విమర్శలు చేశారనుకొండి… అన్నింటికీ ఉమ్మడి పాలనే కారణమని అలవోకగా చెప్పేస్తాడు… ఇప్పుడైతే బీజేపీ మీదకు తోసేస్తాడు… అచ్చం, వైసీపీ..!
మీరు ఏదైనా ఆరోపించండి… చంద్రబాబే బాధ్యుడు అనేస్తారు… అవాంఛనీయమైంది ఏది జరిగినా సరే, చంద్రబాబు మీదకు తోసేస్తారు… అక్కడ ఎక్కడో ఈక కదిలిందయ్యా అని అంటే చంద్రబాబుదే తప్పు… మీ ఇంట్లోనే ఏదో గొడవ జరుగుతోంది అని చెబితే చంద్రబాబుదే పాపం… చివరకు తాము సమాధానాలు చెప్పుకోవాల్సిన అంశాల మీద కూడా చంద్రబాబు మీదే నిందలు వేయడం అలవాటైపోయింది… దీన్ని బాబోఫోబియా అనాలా..?
Ads
ఇప్పుడు నవ్వు, జాలి అనిపించింది ఎక్కడయ్యా అంటే… జగన్ బాబాయ్ వివేకా హత్యకు గురయ్యాడు కదా అప్పట్లో… రకరకాల కథలు వినిపించినయ్… ఇదే చంద్రబాబు త్వరత్వరగా కేసు తేల్చేసి, జగన్ మెడలో వేస్తే మరోరకంగా ఉండేది… రాజకీయంగా ఏవో విమర్శలు చేశాడు గానీ జనం పెద్దగా పట్టించుకోలేదు… జగన్ కూడా చంద్రబాబు దీన్ని వాడుకుంటాడనే సందేహంతో అప్పట్లో సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేశాడు… తీరా తనే కుర్చీ ఎక్కి, సీబీఐ అవసరం లేదన్నాడు…
సరే, ఎలాగోలా సీబీఐ దర్యాప్తు మెల్లిమెల్లిగా సాగింది… వాళ్లేదో చార్జిషీటు వేశారు, అందులో ఎంపీ అవినాశ్ రెడ్డి మీద కూడా సందేహాలు వ్యక్తం చేశారని యెల్లో మీడియా రాసుకొచ్చింది… ఎంపీ టికెట్టే వివేకాకు, అవినాశ్‌కు నడుమ చిచ్చురేపింది, హత్యకు అదే కారణం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది… సరే, యెల్లో మీడియా బురద సంగతి తెలిసిందే కదా… కానీ అవినాశ్ రెడ్డిని నేరుగా అరెస్టు చేసేంత తీవ్రత చార్జి షీటులో ఉందా అనేది ఓ కీలక ప్రశ్న… కానీ సీబీఐ గనుక అరెస్టు చేస్తే అది జగన్‌కు బాగా మైనస్ అవుతుంది… అందుకే వైసీపీ ఉలిక్కిపడుతోంది… వెంటనే పార్టీ సర్వాధికార ప్రతినిధి సజ్జల మీడియా ముందుకు వచ్చేసి… ఠాట్, అంతా చంద్రబాబు లేదా తన ముఠా లక్ష్యాల మేరకే నడుస్తోంది అనేశాడు…
చంద్రబాబు లేదా ఆయన ముఠా చెబితే సీబీఐ వాళ్లు ఎందుకు వింటారు..? తనేమైనా అధికారంలో ఉన్నాడా..? కనీసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలతో కూడా సరైన సంబంధాలు లేవు కదా… పైగా చంద్రబాబు పార్టీ చెప్పినట్టు ఆడితే సీబీఐ అధికారులకు ఫాయిదా ఏమిటి..? ‘‘సీబీఐ కేసును తప్పుదోవ పట్టిస్తోంది’’ అని చెబితే సరిపోయేది… ‘‘కోర్టుల్లో మా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాం’’ అనే ప్రకటన అవినాశ్‌రెడ్డి నుంచి చాలు… కానీ చివరికి సీఎం సొంత బాబాయ్ మర్డర్ కేసులో బాబోఫోబియాకు గురికావల్సిన అవసరం ఏముంది..? యెల్లో మీడియా దుష్ప్రచారాన్ని ఖండించాల్సిందే కానీ ఏకంగా సీబీఐకీ, చంద్రబాబుకూ ముడిపెట్టడం దేనికి..?
ప్రతి చిన్న విషయాన్నీ బాబు మెడలో వేయాలనే ప్రయత్నం కొన్నిసార్లు బెడిసికొట్టి… జనం పట్టించుకోవడం మానేసి, చివరకు అవి పనిచేయకుండా పోతయ్… యాంటీ బయాటిక్స్ తరహాలో రాజకీయ విమర్శల్ని కూడా జాగ్రత్తగా వాడాలి… పోనీ, ఇన్నిరోజులైంది, చంద్రబాబు మీద విమర్శలే తప్ప, కాంక్రీట్‌గా ఎక్కడైనా ఇరికించగలిగారా..? ఇబ్బంది పెట్టగలిగారా..? ఏదైనా చిన్న కేసులోనైనా తన ప్రమేయాన్ని పట్టుకోగలిగారా..?
Share this Article