ముఖ్యమంత్రి కాబోతున్న రేవంత్ రెడ్డి అంటే ఆంధ్రజ్యోతికి మస్తు ఇష్టం… తనే ఇప్పుడు అధికారంలోకి వస్తున్నంత ఆనందం రాధాకృష్ణలో కనిపిస్తోంది… తనలో, తన పత్రికలో, తన టీవీలో… తప్పేమీ లేదు… వోకే… ఎందుకంటే..?
.
ఒకప్పుడు తన చంద్రబాబుకు నమ్మకమైన ఫాలోయరే కదా రేవంత్… ఇప్పటికీ వోటుకునోటు కేసులో, ఆ నేరఘటనలో ఇద్దరూ సహనిందితులే కదా… పైగా రేవంత్‌రెడ్డి చంద్రబాబును ద్వేషించి, విభేదించి బయటికి రాలేదు… అసలు తన మనిషిగానే కాంగ్రెస్‌లోకి వచ్చాడనే ప్రచారం కూడా ఉన్నదే… రాజకీయాల్లో ఇలాంటి ఉపాయాలూ, వ్యూహాలు అసాధారణం ఏమీ కాదు… దాన్నీ తప్పుపట్టలేం…
.
తెలుగుదేశం తెలంగాణ పోరాటబరి నుంచే పూర్తిగా తప్పుకున్నది కాబట్టి, ఏపీలో పోరాటమే కష్టంగా ఉంది కాబట్టి… అక్కడక్కడా తెలంగాణలో ఇంకా మిగిలిఉన్న తెలుగుదేశం జెండాలూ ఇప్పుడు రేవంత్‌కే జై కొడుతున్నాయి… పలుకోట్ల తెలంగాణ ఎన్నికల ప్రచారాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం జెండాలు కలిసే ఎగిరాయి… రేవంత్ తమవాడే అనుకునోవడం దీనికి కారణం…
.
సో, ఆంధ్రజ్యోతి కూడా ఆ జెండాయే, ఆ ఎజెండాయే కాబట్టి సదరు మీడియా అధిపతి ఆర్కే ఆనందాన్ని అర్థం చేసుకోవచ్చు… ఆ పత్రిక పొలిటికల్ లైన్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నదో కూడా తెలుస్తూనే ఉంది… కాకపోతే కొన్ని పదాలు వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలె…
.
ఈరోజు ఫస్ట్ పేజీ బ్యానర్ హెడింగ్… ‘‘హై హై నాయకా…’’! అంటే, సదరు హెడింగ్ పెట్టిన సబ్ ఎడిటర్ దృష్టిలో ‘‘హై కమాండ్ రేవంత్ నాయకత్వానికే వోకే అనేసింది కాబట్టి హై హై నాయకా శీర్షిక ఆప్ట్… సరే అనుకుందాం కాసేపు… కానీ మాయాబజార్ సినిమా గుర్తుందా..?
.
అందులో ఘటోత్కచుడిని తన అనుచరులు హై హై నాయకా అని పిలుస్తుంటారు… తెలుగు కుటుంబాల్లో పాపులర్ ఆ పదాలు… ఐతే ఆంధ్రజ్యోతి రేవంత్‌ను ఏకంగా ఘటోత్కచుడిని చేసేసిందా..? మాయలు చేసే ఓ ఆటవిక, రాక్షస తెగ నాయకుడు అంటోందా..? ఈ హెడింగ్ చూడగానే స్పురించే భావన ఇదే…
.
ఐతే ఇది వితండవాదం కాదు, విమర్శ అసలే కాదు… పదాల వాడకంలో జాగ్రత్త అని చెప్పే ఓ సూచన మాత్రమే… పైగా మీరు కోరుకున్న కొత్త సీఎం కదా… మీ వాడే కదా…!!
Share this Article