రాశి ఫలాలను, జాతకాలను మీడియా ఎంత ఫార్స్‌గా మార్చేసిందో చూశాం కదా… ఏవేవో ప్రాతిపదికలతో ఏదేదో రాసేసి జనం మొహాన కొడుతుంటారు… నమ్మినవాడి ఖర్మ… రంగురాళ్లు, జాతకపూజల దందాలకూ మీడియా పోకడలకూ పెద్ద తేడా ఏమీ అనిపించదు… ఆంధ్రజ్యోతి సైటులో ఓ స్టోరీ చదివితే హాశ్చర్యం ఆవరించింది… పెడపోకడలకు పరాకాష్ట అనిపించింది…
ఆ టైటిల్ ఏమిటంటే… Maha Shivratri 2024: శివుడికి ఇష్టమైన రాశిఫలాలివే.. మహాదేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి..! ఇది మహాశివరాత్రి కానుకగా సమర్పించారన్నమాట…
ఇందులో విషయం ఏమిటంటే… పురాణాల ప్రకారం మహదేవుడికి కొన్ని రాశిఫలాలు అంటే చాలా ఇష్టమట, ఆ రాశుల వారికి శివుడి ఆశీస్సులు, అనుగ్రహం ఉంటాయట… లయకారుడు రాశులను బట్టి అనుగ్రహిస్తాడా..? ఆశీర్వదిస్తాడా..? ఎంతటి మూర్ఖబాష్యం… ఎవరికి ఏది తోస్తే అది రాసి పారేయడమే… పైగా రాసిన క్రియేటివ్ రచయితకు రాశికీ, రాశిఫలాలకూ తేడా తెలియనట్టుంది ఫాఫం… (అదేదో జబర్దస్త్ స్కిట్‌లో యాంకరాంటీ రాశిగారి ఫలాలా అనడుగుతుంది… ఇదీ అలాగే ఉంది…)
Ads
ఇంకా ఎంత హాస్యాస్పదంగా మార్చారంటే… వివరాల్లోకి వెళ్దాం… తనకు ఇష్టమైన రాశుల్లో వృషభం ఒకటి… ఎందుకు..? నంది తన వాహనం కాబట్టి అట, తన ద్వారపాలకుడు కాబట్టి అట… వృషభ రాశి నందీశ్వరుడికి సంబంధం ఉన్న రాశి కాబట్టి శివుడికి ఇష్టమట…
మరొకటి మిథున రాశి… ఇది అర్ధనారీశ్వరుడికి సంబంధించినది అట… శివుడు, శక్తి కలిసి అర్ధనారీశ్వర రూపంలో ఉంటారట, స్రీ-పురుష జంటకు ఈ మిథున రాశి సంకేతమట… మిథునం అంటే అర్ధనారీశ్వరుడికి సంకేతం అట… సో, శివుడికి మిథున రాశి అంటే ఇష్టమట…
కర్కాటక రాశి… ఇది మరీ క్రియేటివ్… కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి, చంద్రుడు ఎప్పుడూ శివుడి తలపైనే కొలువై ఉంటాడు కాబట్టి, కర్కాటక రాశి జాతకులు శివుడికి ఇష్టులట… వారినే శివుడు ఎప్పుడూ అనుగ్రహిస్తాడట…
ధనుస్సు రాశి… ధనుస్సు అంటే విల్లు… శివుడికి కూడా ఒక విల్లు ఉంటుంది… దాని పేరు పినాకి… అది వినాశన సమయంలో ఉపయోగించపడిందని పురాణం… సో, విల్లుకు చిహ్నంగా ధనుస్సు రాశిని కూడా శివుడు అమితంగా ఇష్టపడతాడట…
మరో క్రియేటివ్ రచన కుంభం… శివుడి కుంభ వెంట్రుకలలో గంగ నివసిస్తున్నందున ఈ రాశి కూడా శివుడికి అత్యంత ప్రీతిపాత్రం అట… అర్థం కాలేదా..? భగీరథుడు గంగను భూమిపైకి తీసుకువచ్చినప్పుడు శివుడు తన జటాజూటాన్ని కుంభంగా మార్చాడట, అందులో గంగా ప్రవాహాన్ని ఒడిసిపట్టాడట… సో, ఇదీ శివుడికి ఇష్టమైన రాశి అట…
నవ్వు ఆపుకుంటున్నారు కదూ… మీరూ రాసిపారేయండి… సింహరాశి దుర్గామాతకు ఇష్టమైన రాశి, ఎందుకంటే తన వాహనం కాబట్టి… మత్స్స రాశి విష్ణువుకు ఇష్టం, ఎందుకంటే తన అవతారం కాబట్టి… ఇలా… భలేవారే, ఇదే ఆంధ్రజ్యోతి వాళ్లు కళ్లకద్దుకుని ప్రచురిస్తారు… కాదంటే సాక్షి కూడా ఉంది..!!
Share this Article