సరస్వతి శిశుమందిర్ విద్యార్థి… సంచలనం రేపుతున్న హనుమాన్ సినిమాకు దర్శకుడు… పేరు ప్రశాంత్ వర్మ… ఈ విజయంతో ఏకంగా మరో పన్నెండు సూపర్ హీరోల సినిమాల్ని వరుసగా తీస్తానంటున్నాడు… వోకే, గుడ్… ఆమాత్రం విజన్ ఉంటే ప్రయాణంలో క్లారిటీ ఉంటుంది… దానికి ఓ సినిమాటిక్ యూనివర్శిటీ అని పేరు పెట్టుకున్నాడు, గుడ్, ప్రచారానికి పనికొస్తుంది…
తన మొదటి పాన్ ఇండియా సినిమాతో రికార్డులను కొల్లగొడుతున్నాడు, గుడ్, మెరిట్‌తోపాటు కాస్త లక్ కూడా తోడైంది… అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంలోనూ సినిమా రిలీజ్ కావడం కలిసొచ్చింది… గుడ్… ప్రస్తుతం సూపర్ హీరోలు ప్లస్ ఆధ్యాత్మికం అనే ట్రెండ్ బాగా నడుస్తోంది కదా, అదీ ఉపయోగపడింది… గుడ్…
ఎక్కడా ఫ్యామిలీ ప్రేక్షకులు చూడలేని వెగటుతనాన్ని సినిమాలోకి రానివ్వలేదు, గుడ్… చాలా చౌకగా లోకల్ గ్రాఫిక్ టాలెంట్ ఉపయోగించుకుని మంచి ఔట్ పుట్ సాధించాడు, వెరీగుడ్… బాలయ్య సినిమా చేయబోతున్నాడు, రాబోయే సినిమాలో రానా నటిస్తున్నాడు ఎట్సెట్రా పాజిటివ్ అంశాలు వరదలా ముంచెత్తుతున్నాయి, మరీ మరీ గుడ్… ఇన్ని పాజిటివ్ అంశాల నడుమ కొన్ని పిచ్చి వ్యాఖ్యలు ‘అప్పుడే ఈ దర్శకుడి తలకు ఎక్కేసిందిరోయ్’ అనే నెగెటివ్ భావనకు దారితీస్తున్నయ్…
Ads
ఎస్, ఆదిపురుష్ బాగాలేదు… దేశంలో ఎవడికీ నచ్చలేదు… అసలు ఆ సినిమా ఖర్చు, నిర్మాణం, నాణ్యత అన్నీ చెత్తా… రాముడి కోసమైనా సినిమా చూద్దామనుకున్న రామభక్తులు కూడా బూతులు తిట్టారు, అంత దరిద్రంగా తీశాడు… ఆదిపురుష్‌లా హిందూ దేవుళ్లను కించపరిచే సినిమాలు తీయను అన్నాడు ప్రశాంత్ వర్మ… ఇది కాస్త ఓవర్… ఒక సినిమాను టార్గెట్ చేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీ ప్రొటోకాల్, మర్యాదలకు విరుద్ధం,..
ఐనా సరే, సాహసించి ఓ మాటన్నాడు, పర్లేదు, నిజమే చెప్పాడు కదా అనుకుందాం… తాజాగా ఏమన్నాడు..? ‘‘ఆదిపురుష్’’లో కొన్ని సీన్లు అస్సలు నచ్చలేదు, నేనైతే బాగా తీసేవాడిని’’ అంటున్నాడు… ఇది సక్సెస్ బుర్రకెక్కడం… నోట్లో నాలుక అదుపు తప్పిపోవడం… నచ్చలేదు, బాగాలేదు అనే విమర్శ వరకూ వోకే, అది ఒపీనియన్… అదే నేనైతే బాగా తీసేవాడిని అనడాన్ని విజయం తలకెక్కడం అంటారు…
ఎవడి క్రియేటివిటీ వాడిది… అఫ్‌కోర్స్, ఆదిపురుష్ తీసిన ఓంరౌత్ క్రియేటివ్ అనుకున్నది మనకు నచ్చకపోవచ్చు, కొన్నిసార్లు అలా ప్రేక్షకుల తిరస్కరణకు గురవుతుంటాయి ఆ ప్రయత్నాలు… దర్శకుడు, హీరో, నిర్మాతలు అనుకున్నదానికి భిన్నంగా ప్రేక్షకులు స్పందించవచ్చు… సేమ్, హనుమాన్ సక్సెస్‌కు చాలా అనుకూలాంశాలున్నయ్ గానీ… సినిమాలో అంతా బాగుందని చెప్పలేం కదా… పలుచోట్ల ఇదే ప్రశాంత్ వర్మ చిరాకెత్తించాడు…
ఎస్, రేప్పొద్దున ఏ టీవీ సీరియల్ దర్శకుడో తెర మీదకు వచ్చి ‘అబ్బే, ప్రశాంత్ వర్మకు అస్సలు చేతకాలేదు, నేనయితే ఇంకా బాగా తీసేవాడిని’ అంటాడు, వోకేనా..? గొప్పగా ఆడుతాయని అనుకున్న కొన్ని సినిమాలు డిజాస్టర్లు కావడం కూడా సహజమే… కానీ నేనయితే బాగా తీసేవాడిననే వ్యాఖ్య కరెక్టు కాదు… చీప్ టేస్ట్ కామెంట్… రేప్పొద్దున నువ్వు తీయబోయే కొత్త సినిమాలకూ ఓంరౌత్ అనుభవమే ఎదురుకావచ్చు… అమంగళం ప్రతిహతమవుగాక… నిజంగానే అదే ఆదిపురుష్ నీ చేతిలో పడి ఉంటే, ఏమో… అది మరింత డిజాస్టర్ అయి ఉండేదేమో… ఎవరు చెప్పొచ్చారు… సో, ఇదుగో ఇదే కాస్త తగ్గించుకుంటే మంచిది…
చివరగా…. ఒక వెబ్‌సైట్‌లో వచ్చిన ఒక వార్తలో ప్రశాంత్ వర్మ గురించి… యథాతథంగా… ‘‘హను-మాన్ కృతజ్ఞత సభ. ఈ ఈవెంట్ లో అండర్ లైన్ చేసుకొని చెప్పే ఒక విషయం వుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ వేదికపై దాదాపు 52 రెండు నిమిషాలు స్పీచ్ దంచికొట్టాడు. సుత్తివేలు స్టయిల్ లో చెప్పాలంటే.. అదొక ప్రోలాంగ్ హ్యామరింగ్. బహుశా తెలుగు సినిమా చరిత్రలో ఒక దర్శకుడు తన సినిమా గురించి ఇంత సమయం నొక్కి వక్కాణించి వుండడు. ఈ సుదీర్ఘ ప్రవచనానికి మీడియా ప్రతినిధులు త్రివిక్రమ్ స్టయిల్లో.. అలా జేబులో చేయిపెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి. నిజానికి ఈ రేంజ్ లో మీడియా సమయాన్ని తినేయడం అవసరమా? అంటే ఖచ్చితంగా లేదు…’’
టామ్ క్రూజ్ వచ్చినా సరే, మన హీరోలతోనే సినిమా తీస్తాను… స్టార్ హీరోలతో టైమ్ వేస్ట్ అవుతుంది… నన్ను అసిస్టెంట్ డైరెక్టర్‌గా తీసుకోలేదు రాజమౌళి, కష్టపడే తత్వం, మెరిట్ ఉన్నా సరే ఆయన వద్దనడంతో ఆయనపై కోపం వచ్చింది… ఇవన్నీ ప్రశాంత్ వర్మ వ్యాఖ్యలే… చెప్పాను కదా, బాగా తలకెక్కింది అని… కాలం చాలా మందిని నేలమీదకు దింపింది వర్మా… జస్ట్, వెయిట్…
Share this Article