చాన్నాళ్ల తరువాత సాక్షి ఫన్ డే అనబడే సండే మ్యాగజైన్ తిరగేస్తుంటే… ఓచోట కర్సర్, కళ్లు ఆగిపోయాయి… ఫాఫం జగన్ అనుకుని ఓసారి బలంగా నిట్టూర్చాల్సి వచ్చింది… ఈనాడును కొట్టేస్తాననే గప్పాలతో ప్రారంభమైన ఈ పత్రిక చివరకు ప్రభుత్వ నిధులతో నాలుగు కాపీలు కొనుగోలు చేయించే దయనీయ పత్రికగా మారిపోయింది… పోనీ, ఏమైనా ఎడిటోరియల్ క్వాలిటీస్ ఉన్నాయా అంటే అదీ దిక్కులేదు… అంతకుముందు ఆదివారం నాటి మ్యాగజైన్‌లో ఓ కవర్ పేజీ సుదీర్ఘకథనం చేయించారు…
దాని శీర్షిక పేరు ‘‘కల్యాణ వైభోగం, కనువిందు వైవిధ్యం…’’ మన పెళ్లిళ్ల తంతులో వస్తున్న మార్పుల మీద వ్యాసం… మనవి కాని వెడ్, ప్రివెడ్ పద్ధతుల్ని తీసుకొచ్చి రుద్దుతున్న ధనిక పోకడల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉందే తప్ప వ్యాసంలో మరే మంచి మెసేజ్ లేదు… పైగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర సంస్కృతుల కలయిక అట… గత ఏడాది ఒకే నెలలో (నవంబరు- డిసెంబరు) 32 లక్షల పెళ్లిళ్లు జరిగాయి, మస్తు జరుగుతున్నయ్ అంటారు గానీ పెళ్లీడుకొచ్చిన వాళ్లు పెళ్లి చేసుకోరా మరి…
మెయిన్ పేజీల్లో రాసే కథనాల్లో అటూఇటూ గాని వ్యాసాలు ఉంటాయి సహజం… కానీ మ్యాగజైన్ స్టోరీలు వార్తల్లా ఉండకూడదు… ఏదో ఓ విషయాన్ని కన్వే చేయాలి… ఈ ఫ్యాటీ పెళ్లిళ్లు, డెస్టినేషన్ పెళ్లిళ్లు, సంగీత్‌లు, ఆ రికార్డింగ్ డాన్సులకు శిక్షణలు గట్రా ఏవేవో రాసుకుంటూ పోయారే గానీ… అవి సగటు అమ్మాయి తల్లిదండ్రులను అప్పుల పాలు చేస్తున్న దురాచారమనే సోయి కనిపించలేదు కథనంలో… అన్నింటికన్నా ఘోరం ఏమిటంటే… హల్దీ అంటే గోరింటముద్ద అట…
Ads
ఈ క్లిప్పింగ్ చదవండి… గోరింటాకు పొడిని రోజ్ వాటర్ లేదా పాలతో కలిపి ముద్ద తయారు చేస్తారట… వధూవరులకు పూస్తారట, ఔషధమట… చర్మం నిగారించి మెరుస్తుందట… ఆ గోరింటాకు పొడి పూసుకునే వేడుకే హల్దీ అంట… మేమింగా హల్దీ అంటే పసుపు అనే భ్రమల్లోనే బతుకుతున్నాం… ఇన్ని రాసిన సాక్షికి మంగళస్నానాలు, బ్యాచిలర్ పార్టీలు ఎందుకు గుర్తురాలేదో… సరే, సరే, స్టోరీ ఫైల్ చేసే మిత్రుడు ఫ్లోలో ఏదో రాసేశాడు, తప్పుపట్టే పనిలేదు అనుకుందాం…
ఆ మ్యాగజైన్‌కు కూడా ఓ సంపాదకుడు ఉంటాడుగా… సబ్‌ఎడిటర్లు ఉంటారుగా… మరి కవర్ పేజీ కథనం కూడా చదివే తీరిక లేదా పెద్దలకు… ఈ జగన్ పత్రికలో ఏది తోస్తే అది తోసేయడమేనా..? అడ్మినిస్ట్రేషన్‌లో అడ్డగోలు మార్పులు సరే, అసలు కంటెంట్ సంగతి చూసుకునేవారే లేరా..? ఓనర్లకు తెలుగే సరిగ్గా చదవరాదు… ఇక స్టోరీలు ఏం చదువుతారు ఫాఫం… మొత్తం సాక్షి వ్యవస్థకు హల్దీ అనే గోరింటపొడిని రుద్దితే ఏమైనా బాగుపడుతుందేమో…!! అవును బ్రో… ఈ హల్దీ అనే పెళ్లి తంతు ఏ ప్రాంతం నుంచి వచ్చింది..? ఉత్తరమా, తూర్పా, పడమరా, లేక ఎక్స్‌ట్రీమ్ దక్షిణమా… మన తెలుగు పెళ్లితంతులో పసుపులు కొట్టడం లేదా పసుపులు పట్టడం అనే తంతు ఉంది, ఎప్పుడైనా వింటివా..? కంటివా..? పేరే ఫన్ డే కదా, ఫన్నీ…!!
ఆల్‌రెడీ సాక్షి సండే మ్యాగజైన్‌లో వచ్చాక మళ్లీ జిల్లా పేజీల్లో ఎందుకీ అదనపు తంతు..? అడిగేవాడు ఎవడు..? చూసేవాడు ఎవడు..? ఐనా మన వివాహ పద్ధతులపై మోతకోలు యవ్వారంగా మారుతున్న ఈ అదనపు ఇతర ప్రాంతాల పద్ధతులను ఎందుకు నెత్తిన మోస్తున్నట్టు…!!
Share this Article