బాల్ ఠాక్రే వారసుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు కేంద్ర ఎన్నికల సంఘం మీద మస్తు కోపమొచ్చింది… సహజమే… తమ నుంచి విడిపోయి, సొంత కుంపటి పెట్టుకుని, తన సీఎం కుర్చీ కూడా లాగేసుకున్న ఏకనాథ్ షిండేకు తమ పార్టీ ఎన్నికల గుర్తును ఇవ్వడం, పార్టీని కూడా అప్పగించిన తీరుతో కుతకుత ఉడికిపోతున్నాడు… మహారాష్ట్రలో అంతటి బలమున్న ఆ శివసేన నుంచి ఇప్పుడు తనే విడిపోయి ఓ చీలికవర్గంగా ఏర్పడినట్టుగా తయారైంది పరిస్థితి…
ఖచ్చితంగా ఇది ఉద్ధవ్ ఠాక్రేకు శరాఘాతమే… అయితే ప్రజల్లో మంచి పట్టు ఉంటే, తన పట్ల ప్రజలకు నమ్మకం ఉంటే… కొత్త పార్టీ పేరు, కొత్త ఎన్నికల గుర్తుతో మళ్లీ వెలిగిపోవచ్చు… కానీ ఠాక్రేలో ఆ సామర్థ్యాలు కనిపించడం లేదు సరికదా… సంయమనం కోల్పోతున్నాడు… మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అనే విమర్శ కొంతమేరకు ఆమోదనీయమే… బాధలో ఉన్నాడు కదా అని సరిపెట్టుకోవచ్చు…
కానీ ఠాక్రే వర్గంలోని ఓ కోవర్టు మహాశయుడు సంజయ్ రౌత్ ఏకంగా ఈ ఎన్నికల గుర్తును, పార్టీని తిరుగుబాటు వర్గానికి ధారాదత్తం చేయడానికి 2000 కోట్ల డీల్ నడిచిందని ఆరోపించాడు… ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం మీదే ఆరోపణలు చేస్తున్నాడు… ఇలాంటి సంయమనం కోల్పోయిన వ్యాఖ్యలు దీర్ఘకాలంలో ఆ వర్గానికే చేటు… నాయకత్వంలో పరిపక్వ లేమి ఎప్పుడైనా పార్టీకి నష్టదాయకమే…
Ads
సంజయ్ రౌత్ వ్యాఖ్యలే విపరీతం అనుకుంటే… ఠాక్రే ఏకంగా ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు… అంటే రాజ్యాంగబద్ధంగా ఇన్నేళ్లూ కొనసాగుతున్న వ్యవస్థనే రద్దు చేయాలంటున్నాడు… ఇప్పుడు తనకు బాధ కలిగింది కాబట్టి ఎన్నికల సంఘాన్ని డిలిట్ కొట్టేయాలట… పరిణతి లేని వ్యాఖ్యలు ప్రజల్లో పలుచన చేస్తాయనే సోయి కూడా లేదు ఠాక్రేకు…
అంతేకాదు, ఎన్నికల సంఘం కమిషనర్లను కూడా ప్రజలే ఎన్నుకోవాలట… ఎందుకు పరిణతిలేని వ్యాఖ్యలు అంటున్నానంటే… పర్ సపోజ్, నిజంగానే ప్రజలు ఎన్నుకునే స్థితే వస్తుంది అనుకుందాం, లేదా పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతిని, స్పీకర్‌ను, ఉపరాష్ట్రపతిని ఎన్నుకున్నట్టే ఎన్నికల సంఘం కమిషనర్లనూ ఎన్నుకునే స్థితి వస్తే… అప్పుడైనా బీజేపీ నాయకులే ఎన్నికల సంఘంలో కొలువు తీరతారు కదా… ఇప్పుడు కనీసం మాజీ బ్యూరోక్రాట్లు, రాజకీయేతరులు ఉంటున్నారు కమిషనర్లుగా… ఎన్నికల సంఘం నిర్ణయాల్లో కోర్టులే ఎంటర్ కావు… ఇక దాన్నీ బీజేపీ చేతుల్లో పెట్టాలనేనా ఠాక్రే డిమాండ్ చేస్తోంది..? అది ఠాక్రేకు మరింత నష్టదాయకం కాదా..? ఈ డిమాండ్ ఆత్మహత్యాసదృశం కాదా..?
ఇప్పుడు తనకు ఉన్న సమస్య పార్టీ నిధులు, ఆస్తులు షిండే పాలు గాకుండా కాపాడుకోవడం… సుప్రీం కోర్టు మెట్లు ఎక్కి ఈసీ నిర్ణయంపై పోరాటం చేయనున్నాడు… పార్టీ నిధుల జోలికి వస్తే ఈసి మీద క్రిమినల్ కేసు పెడుతాను అంటున్నాడు… ఆల్ రెడీ పార్టీ నిధుల్ని వేరే ఖాతాలోకి మార్చేశాడట… వీటి కోసం షిండే కూడా సుప్రీం కోర్టు తలుపు తడితే కథనం ఇంకా రక్తి కడుతుంది …
నిజానికి స్వయంప్రతిపత్తి ఉన్న రాజ్యాంగసంస్థ ఎన్నికల సంఘం… దానికి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు..? అధ్యక్ష ఎన్నికల్లాగా ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాలా..? ఇంకా నయం, ఈ ధోరణులే అధికమైతే సుప్రీంకోర్టు జడ్జిలనూ ఇలాగే ప్రజలు నేరుగా ఎన్నుకోవాలని, కీలకమైన సైనిక బలగాల చీఫ్‌లను కూడా ప్రజలే ఎన్నుకోవాలనే పిచ్చి డిమాండ్లు కూడా వస్తాయేమో… దేవుడా, రక్షించు నా దేశాన్ని, ఇలాంటి ఠాక్రేల నుంచి..!!
Share this Article