ఇంగ్లిషు నుంచి తెలుగులోకి ఈనాడు తరహా క్షుద్రానువాదాలను గర్హిస్తున్నాం… భాషను ఖూనీ చేస్తున్న ఈనాడును చూసి ఖండిస్తున్నాం సరే… ఇంగ్లిషును ఇంగ్లిషులాగే ఉంచండిరోయ్, ఈ కాష్మోరా టైపు చేతబడులు వద్దురోయ్ అని మొత్తుకుంటున్నాం… ఈనాడోడు వినడు, అది వేరే సంగతి, వాడిని చూసి సాక్షి, జ్యోతి వంటి తోకపత్రికలు కూడా వాతలు పెట్టుకుంటున్నయ్ అప్పుడప్పుడూ… అదొక విషాదం…
కానీ తెలుగు నుంచి ఇంగ్లిషులోకి కూడా కొన్ని అనువాదాలుంటయ్… అవి చదువుతుంటే, బాబోయ్, ఆ తెలుగు పదాల్ని అలాగే ఉంచండిరోయ్ అనబుద్దేస్తుంది… కాకపోతే ఆ తెలుగు పదాల్నే ఇంగ్లిషు లిపిలో రాసి తగలడండి అని హితవు చెప్పబుద్దవుతుంది… ఓచోట హఠాత్తుగా నేమింగ్ సెరెమనీ అని ఓ ఫ్లెక్సీ కనిపించింది… ఇందులో నేమింగ్ అంటే నామకరణం… ఇది కరెక్టేనా..? అసెంబ్లీలో, పార్లమెంటులో స్పీకర్లు అప్పుడప్పుడూ ‘‘అదర్ వైజ్ ఐ షల్ నేమ్ యూ’’ అని హెచ్చరించడం గుర్తొచ్చింది… సో, నేమింగ్ అనగా ప్యూర్‌గా నామకరణం అనే అర్థం రాదేమో…
మరి నామకరణాన్ని ఇంగ్లిషులో ఏమందురు..? ఏదోలే, ఏదో ఒకటి అనుకుని నేమింగ్ అని పెట్టేసుకున్నాం… నేమ్ పెట్టడం కాబట్టి నేమింగ్… అంతే… నవ్వకండి… కోబ్రదర్ సంగతీ ఇంతే కదా… షడ్డకుడు అంటే సొంత భార్య అక్కాచెల్లెళ్ల భర్తలు… దానికి ఇంగ్లిషులో ఏమందురు..? ఏమో, తెలియదు… అందుకని కోబ్రదర్ అని నేమింగ్ చేసేసుకున్నాం, అనగా పేరు పెట్టేసుకున్నాం… తోడికోడళ్లను కోసిస్టర్ అనాలా..? ఏమో, అదంత పాపులర్ కాలేదు… అంతెందుకు… మన సొంత తమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు, అన్నలను గాకుండా… పెద్దమ్మ, చిన్నమ్మ, పెద్దనాయన, చిన్నాయన పిల్లలందరినీ కజిన్స్ అనేస్తున్నాం… మళ్లీ క్లారిటీ కోసం కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ అంటుంటాం… తప్పయినా సరే… బామ్మయినా, మామ్మయినా గ్రాండ్‌మా… అంతే… అఫ్‌కోర్స్, తాత అంటే ఏ తరఫు అయినా తాతే… అనగా గ్రాండ్ పా… ఇలా ఎన్నెన్నో ఆంగ్ల చుట్టరికాల పేర్లు నవ్వొస్తుంటయ్…
Ads
సేమ్, హౌజ్ వార్మింగ్… అంటే ఇల్లు వేడి చేయడం అనే అర్థం వస్తుంది కదా… కానీ కాదు, గృహప్రవేశానికి మనం పెట్టుకున్న ఇంగ్లిష్ పేరు అది… వేడి చేయడం అంటే ఏమిటి..? ఏముందీ, పాలు పొంగించడం లేదా గృహప్రవేశ తంతులో చిన్న హోమం చేసి, నిప్పు రాజేయడం… వేడి మస్ట్… ఎందుకోగానీ, బేబీ షవర్ పదం కూడా అంతే అనిపిస్తుంది… అనగా సీమంతానికి (కొందరు శ్రీమంతం అని రాస్తున్నారు, అదేమిటో) ఇంగ్లిష్ పేరు… అసలు బేబీ పుట్టనే లేదు, షవర్ స్నానం ఎక్కడిది అంటారా..? అలాంటి పిచ్చి ప్రశ్నలు అడక్కూడదు… బేబీ షవర్ అంటే బేబీ షవర్ అంతే…
ఇలా మన ప్రతి తెలుగు పదానికీ ఏదో ఒక విపరీతార్థమో, దురర్థమో, అపార్థమో, అనర్థమో ఇంగ్లిషు పదాన్ని కనిపెట్టేసి, ఎంచక్కా వాడేసుకుంటున్నాం కదా… పుట్టువెంట్రుకలు అనే పదానికి ఇంగ్లిష్ నేమింగ్ ఏమైనా జరిగిందా..? విన్నట్టు గుర్తులేదు… మన పద్ధతుల్లో చాలా విశేష, విశిష్ట తెలుగు పదాలు ఉంటయ్… పనిలోపనిగా వెంటనే ఇంగ్లిషీకరిస్తే బెటరేమో… మరీ బర్త్ హెయిర్ కట్ అని పేరుపెడితే బాగుండదేమో… అలాగే మన పెళ్లిలోని తంతులు మంగళస్నానాలు (ఆస్పియస్ బాత్), హల్దీ (టర్మరిక్ సెరిమనీ), అప్పగింతలు (గివింగప్) అని పెడితే..? నవ్వొస్తున్నదా..?
ముఖ్యమైన మరో కార్యక్రమం పేరు కార్యం లేదా శోభనం… ఇప్పటికే ఇంగ్లిషులో ఫస్ట్ నైట్ అని పేరు పెట్టేశాం… కొందరు బెడ్ కనెక్షన్ అనీ అంటున్నారు… అవునూ, తొలిచూలు, మలిచూలుకు ఏమైనా పేర్లు పెట్టారా లేదా..? అన్నట్టు… పుస్తెకు కూడా ఓ పేరు పెట్టాలండోయ్… మరిచేపోయాం, మధుపర్కాలకు నేమింగ్ జరగాలి, కాస్త చూడండి…!! మాయాబజార్ సినిమాలో చెప్పినట్టు… ఎవరూ పూనుకోకుండా కొత్త పదాలు ఎలా పుడతాయి మరి… కమాన్… నేమింగుకు నడుం బిగించాల్సిందే… వీరతాళ్లు, పేరుతాళ్లు మెడల్లో పడాల్సిందే…!!
Share this Article