ఏదైనా వివాదం తలెత్తితే చాలు… అంటే సందు దొరికితే చాలు… దూరిపోయి, పొక్క పెద్దది చేసి… వీలైతే ట్యాంకర్ పెట్రోల్ పోసి, తమ స్వప్రయోజనాలు చూసుకునే బ్యాచ్ బోలెడు మంది..! అయితే దాన్ని చిల్లర పంచాయితీల్లా చేసేసేవాళ్లూ ఉంటారు… ఇది అలాంటిదే… అప్పట్లో, 14 ఏళ్ల క్రితం ముంబైలోని వానరసేన స్టూడియోస్ అనే సంస్థ రాముడిని విలుకాడిగా చూపిస్తూ ఏదో చిత్రం రూపొందించిందట…
అసలు అలా ఏ ఇతర కామిక్స్‌లో గానీ, చిత్రాలలో గానీ చూపించలేదుట… అసలు ఆ తరహా చిత్రం మరొకటి లేదట… గతంలో ఇదే ప్రభాస్ ఇదే బొమ్మను ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్నాడట… దాన్ని ఇప్పుడు ఆదిపురుష్ కోసం కాపీ కొట్టారు… విడిచిపెట్టం, ధనుస్సును పట్టుకున్నప్పుడు వేళ్లు ఎలా ఉన్నాయనేది ముఖ్యం అని సదరు కంపెనీ వివేక్ రామ్ ఏదేదో చెబుతున్నాడు…
ఛీ, పంచాయితీ మరీ ఎంత చిల్లర అయిపోయింది..? రాముడు విలుకాడు అని వీడెవడో మొదటిసారి కనిపెట్టినట్టు, వీడికే కాపీ రైట్స్ ఉన్నట్టు మాట్లాడితే ఆంధ్రజ్యోతి దాన్ని అచ్చేసి మురిసిపోయింది… ఫాఫం, అంతకుముందు వాల్మీకి సహా అందరూ రాముడిని గదాయుద్ధ నిపుణుడిగానో, కత్తిరాముడిగానో చూపిస్తే, వీళ్లే రాముడిని విలుకాడిగా చూపించి, రాముడిని చరితార్థుడిని చేశారుట… థూ…
Ads
ఐనా బోలెడు ఇంగ్లిష్ సినిమాల్లోని గ్రాఫిక్స్‌ను ఎలా ఎత్తి, యథాతథంగా దింపారో సోషల్ మీడియాలో బోలెడు మీమ్స్, పోస్టులు వచ్చాయి… దర్శకుడికి నిజంగా ఇజ్జత్ పోయి ఉండాలి… ప్రభాస్‌కు మరో రాధేశ్యామ్ రాబోతోంది… అలాంటిది ప్రభాస్ ఓ మీడియా మీట్ పెట్టించాడు… అందులోకి దిల్ రాజు దూరాడు… ‘‘నో, నో, ఇది ఫోన్లలో చూసేది కాదు, త్రీడీలో చూడాలి, జనం మధ్య చూడాలి, థియేటర్ ఎక్స్‌పీరియెన్స్… అదిరిపోతుంది…’’ అంటున్నాడు… కొంపదీసి తెలుగు రాష్ట్రాల బయ్యర్ తనేనా ఏమిటి..? గోవిందా…
నిర్మాత, దర్శకుడు, హీరో అభిప్రాయం కూడా అదే… ప్రభాస్ అయితే త్రీడీ టీజర్ చూసి చిన్న పిల్లాడు అయిపోయాడట… అసలు సినిమా మొత్తం గ్రాఫిక్స్, యానిమేషన్ ఉన్నట్టుగా కనిపిస్తోంది, పైగా అన్నీ కాపీ సీన్లు అని వివాదం నడుస్తుంటే అది మాట్లాడకుండా త్రీడీలో చూడాలి, లేదంటే మూసుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు… అంటే థియేటర్లలో పెట్టేంత ఆర్థిక స్థోమత లేనివాళ్లు అన్నీ మూసుకుని సినిమాకు దూరంగా ఉంటే సరిపోతుందన్నమాట… అంతేనా..? వారెవ్వా ప్రభాస్… ఎవరిని వెనకేసుకొస్తున్నవ్..? ఏం సాధించబోతున్నవ్..?
అసలు ప్రధాన పాత్రల వేషధారణ మీద కూడా బోలెడు విమర్శలు వస్తున్నయ్… అది ప్రయోగమట… ఈ ప్రయోగాలన్నీ హిందూ దేవుళ్ల మీదే ఎందుకురా, అవమానిస్తున్నారు దేనికిరా అని విశ్వహిందూపరిషత్ హెచ్చరిస్తోంది… థియేటర్లలో ప్రదర్శించనివ్వబోమని అంటోంది… మధ్యప్రదేశ్ హోం మంత్రి కత్తి పట్టుకుని రెడీగా ఉన్నాడు… యోగికి కోపం రాలేదు గానీ, లేకపోతే బుల్‌డోజర్లు నాలుగు రెడీగా ఉన్నాయి… ఈ చెత్తా సీన్లను తొలగించాలని సర్వ బ్రాహ్మణ్ మహాసభ సంస్థ లీగల్ నోటీసులు పంపించింది…
అసలైన విశేషం ఏమిటంటే… అయోధ్య దాకా వెళ్లి టీజర్ రిలీజ్ అన్నారు కదా… ఆ ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశాడు… ఆఫ్టరాల్ టీజర్‌లోనే రాముడి మీసం, జంధ్యం, ధనుస్సు, రావణుడి వాహనం, హెయిర్ కట్, గడ్డం, అడ్డదిడ్డం తలలు వంటివే కాదు, సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్ని చెత్త వెగటు ప్రయోగాలు బయటపడనున్నాయో… ఐనా ముందే చెప్పి ఏడవొచ్చు కదా, ఇది యానిమేషన్ బేస్డ్ సినిమా అని…!
Share this Article