మోకాలికీ బోడిగుండుకూ ముడిపెట్టడం అనేక వార్తల్లో, విశ్లేషణల్లో, ప్రత్యేక కథనాల్లో, టీవీ డిబేట్లలో చూస్తూనే ఉంటాం… అవి చూసీ, చదివీ, జుత్తు పీక్కుని మన బోడి గుండ్లు కావాలే తప్ప వాళ్లు మారరు… అయితే ఒక స్టోరీ చదవగానే దీన్ని మించిపోయినట్టు అనిపించింది… మొన్న సీఎం పదవి ఊడిన ఉత్తరాఖండ్ తీర్థసింగుడికీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీ రాజకీయాలకూ మూడివేసి, భలే వండారు… చాలా జాతీయ పత్రికల్లో, సైట్లలో సుదీర్ఘకథనాలు రాశారు… అదేమిటి..? ఉత్తరాఖండ్కూ బెంగాల్ పాలిటిక్సుకూ లింకేమిటి అని అప్పుడే హాహాకారాలు చేయకండి… ముందుగా ఆ కథేమిటో చదవండి… ‘‘మోడీ, అమిత్ షా ఉత్తరాఖండ్ సీఎంను అల్లాటప్పాగా ఏమీ మార్చలేదు, దాని వెనుక బీభత్సమైన గొప్ప స్ట్రాటజీ ఉంది… అదేమిటో తెలుసా..? ఈ తీర్థసింగుడు ఎంపీ, కానీ లోకల్ పాలిటిక్సు నేపథ్యంలో పాత సీఎంను దింపేసి, ఈయన్ని కుర్చీ ఎక్కించారు… కావాలనే… ఆరు నెలల్లో అసెంబ్లీకి ఎన్నిక కావాలి… ఎమ్మెల్సీ కావొచ్చు గానీ అక్కడేమో మండలి లేదు… అందుకని ఏదో ఓ అసెంబ్లీ సీటు నుంచి ఉపఎన్నికలో గెలవాలి… కానీ కరోనా పేరుతో ఎన్నికను పెట్టించలేదు… దాంతో తీర్థసింగుడి పదవి ఊడబీకి, ఇంకో నాయకుడికి కట్టబెట్టారు… తీర్థసింగుడిని పీకేయడం వెనుక కారణమేమిటంటే… మేం ఇలాంటి రాజ్యాంగబద్ధమైన అంశాల్లో మహాకఠినంగా ఉంటాం తెలుసా అని ప్రజలకు చెప్పడానికి… మరిప్పుడు ప్రజలకు అంత అర్జెంటుగా ఈ నీతిపాఠం ఎందుకు చెప్పాలీ అంటారా..? దానికీ రీజన్ ఉంది…
బెంగాల్లో మమత కొరకరాని కొయ్య అయిపోయింది కదా… ఆమెను ఏమీ చేయలేకపోతున్నారు కదా… ఆమె పార్టీయేమో గెలిచింది, కానీ ఆమె నందిగ్రాములో ఓడిపోయింది, ఇప్పుడు ఆరు నెలల్లో ఏదో సీటు నుంచి గెలవాలి ఆమె… అక్కడ కూడా ఎమ్మెల్సీ అవుదామంటే మండలి లేదు… సో, ఎవరితోనైనా రిజైన్ చేయించి, నిలబడుతుంది… కానీ ఆరు నెలల్లోపు ఉపఎన్నిక జరగకుండా అడ్డుపడి, ఆమె స్వయంగా రాజీనామా చేసే సీన్ క్రియేట్ చేయడమే అమిత్ షా, మోడీ ప్లాన్… దెబ్బకు మమత పని మటాష్, దిగిపోకుండా ఉండలేదు, అదీ మోడీ షా స్ట్రాటజీ… అప్పుడే ఐపోలేదు… ఆమెను ఏదో ఓ కేసులో జైలుకు పంపించేసి, శశికళ టైపులో తొక్కేయాలి… ఆమె పార్టీలోనే ఓ పన్నీర్ సెల్వాన్ని వెతికి సీఎం కుర్చీ మీద కూర్చోబెడుతుంది కదా… ఇక తమిళనాడు మోడల్ తరహాలో ఈ బెంగాలీ సెల్వాన్ని పట్టేసి, భయపెట్టేసి, ఇక పార్టీని భ్రష్టుపట్టించేస్తారు… మాకు బెంగాల్ సీఎం అయినా, ఉత్తరాఖండ్ సీఎం అయినా ఒకటే… ఆరు నెలల్లోపు ఎన్నిక కాకపోతే దిగిపోవాల్సిందే అని చెప్పడానికి తీర్థసింగుడి పదవి పీకేశారు…’’ హమ్మయ్య, ఇదండీ ఆ కథనం సారాంశం… మైండ్ ఒక్కసారిగా మొద్దుబారిపోయినట్టు అనిపిస్తోందా..? మరంతే… ఈమధ్య మీడియా విశ్లేషణాత్మక ప్రత్యేక కథనాలు ఇలాగే ఉంటున్నాయి… ఇది మెచ్చుతునక అన్నమాట…
Ads
….. ఇంత రాసినోడికి కామన్ సెన్స్ లేదా అని మనం ప్రశ్నించకూడదు… ఇప్పుడసలు ఏ సెన్సులూ అక్కర్లేదు… నిజానికి ఆమె ఆరు నెలల్లోపు ఎన్నిక కాకపోవడమనే చాన్సే లేదు… 1) కరోనా గిరోనా జాన్తానై అనేసి, ఏడెనిమిది దఫాల్లో అసెంబ్లీ ఎన్నికలు పెట్టిన ఎన్నికల సంఘానికి ఒక్క సీటుకు ఉపఎన్నిక ఓ కష్టమా..? ఇప్పటికిప్పుడు ఎన్నిక నిర్వహించలేం అని చెప్పడానికి దానికి కారణాలే లేవు… 2) ఒకవేళ నిజంగానే సీఎం కుర్చీ దిగే పరిస్థితి వస్తే… ఈరోజు రాజీనామా, రేపు మళ్లీ టీఎంసీఎల్పీ ద్వారా తీర్మానం, మళ్లీ సీఎం… ఏముంది అందులో… పైగా నైతికతలూ తొక్కాతోలూ పట్టించుకునే మనిషి కాదు ఆమె… 3) ఒకవేళ జైలుకు వెళ్లాల్సి వస్తే (ఏ శారద కేసో, నారద కేసో ఆమెకు కూడా చుట్టేస్తే…) తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సీఎంగా చేస్తుంది… ఏ సెల్వమూ అక్కర్లేదు ఆమెకు… అభిషేకుడు మమతకు పదిరెట్లు ముదురుకేసు… అసలు బెంగాల్‌ను పాలించేదే తను… 4) అన్నింటికీ మించి తీర్థసింగు అనుభవాన్ని మమతకు కూడా వర్తింపజేస్తారు అనేది పెద్ద అబ్సర్డ్… ఒకవేళ పొరపాటున ఇది ఉద్దేశపూర్వకంగా వేసిన ప్లాన్ అనేదే నిజమైతే మోడీషాలను చూసి ప్రతి బీజేపీ కార్యకర్త కూడా జాలిపడాల్సిందే… మరి మీడియా సంగతి అంటారా..? అదెప్పుడో అన్నాడీఎంకే అయిపోయిందిగా…!!
Share this Article