చిన్న విషయమే … చాలా చిన్న విషయమే… కానీ మన సినిమా వార్తల కవరేజీ తీరు అర్థం చేసుకోవడానికి ఓ క్లాసిక్ అన్నం మెతుకు ఇది… నవ్వొచ్చింది… తరువాత జాలేసింది… సినిమా కవరేజీ అంటేనే డప్పు… కవర్ బరువును బట్టి కవరేజీ… ప్రెస్ మీట్ అంటేనే తలతిక్క ప్రశ్నలు… సినిమా జర్నలిస్టుల్లో పేరుపొందినవాళ్ల ప్రశ్నల తీరు చూస్తుంటే థూ వీళ్లా ప్రముఖ జర్నలిస్టులు అనిపించేలా ఉంటున్నాయి… చివరకు ఆ డప్పు మోతల్ని కూడా హెడ్ వాయిస్‌లో, హైపిచ్‌లో మోత మోగిస్తున్నారు కొందరు… అందులోనూ మార్క్సిస్టు మహాశయులు…
అనుకోకుండా నవతెలంగాణలో ఓ సినిమా వార్త చదవబడ్డాను… ఆ పత్రికలో సినిమా వార్తల కవరేజీ పెద్ద విశేషంగా ఏమీ ఉండదు, కొత్త పోకడలు కూడా ఏమీ ఉండవు, తెలుగు సినిమాల్లాగే ఫక్తు రొటీన్, మూస… అయితే అందులో హైమోత డప్పు ధ్వనించి ఆశ్చర్యపరిచింది… విషయంలోకి వెళ్తే… ఉగ్రం అనే ఓ సినిమా వస్తోంది… జూనియర్ నరేష్ అందులో హీరో… గతంలో కమెడియన్‌గా బాగానే రాణించినా, ఇప్పుడు ప్రత్యేకంగా కామెడీ సినిమాలు నడవడం లేదు… (జాతిరత్నాలు వంటివి మినహాయింపు)… దాంతో నరేష్ జానర్ మార్చేశాడు… తెలివైన నిర్ణయం…
Ads
జూనియర్ నరేష్ అని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే… ఈమధ్య పవిత్రతో తన యవ్వారానికి సంబంధించి, మూడో పెళ్లాంతో గొడవల గురించి, ఈ పర్సనల్ అంశాల్నే కథగా చేసి మళ్లీ పెళ్లి అనే సినిమా తీస్తున్నాడు కాబట్టి సీనియర్ నరేష్ వార్తల్లో వ్యక్తి… జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ పార్టిసిపెంట్‌గా పొట్టి నరేష్ కూడా పాపులరే ఈమధ్య… ఎటొచ్చీ అల్లరి నరేష్‌గా పిలవబడే ఈ జూనియర్ నరేష్ గ్రహచారం ఈమధ్య అస్సలు బాగోలేదు… పాపులారిటీ లేదు… అల్లరి అనే సినిమా అత్యంత నాసిరకం, దాన్ని ఇంటిపేరుగా మార్చుకోవడం తనకే సిగ్గుచేటు, కాబట్టి మర్యాదగా జూనియర్ నరేష్ అంటే చాలు…
సదరు ఉగ్రం సినిమాలో ఓ టైటిల్ ట్రాక్ ఉంది… దాన్ని రీసెంటుగా లిరికల్ వీడియోగా రిలీజ్ చేశారు… అందులో అసలైన దృశ్యాలు ఏమీ ఉండవు తెలుసు కదా… గాయకులు పాడటం, కొన్ని సినిమా సంబంధ ఫోటోలు, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గట్రా ఒక్కచోట పేర్చి, ఇదే లిరికల్ వీడియో అంటారు… ఈ పాట కంపోజింగ్ శ్రీచరణ్ పాకాల… పాడిందీ తనే… నిజానికి ట్యూన్ బాగుంది… బోలెడు చిన్న చిన్న మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాడుకున్న తీరూ బాగుంది…
కాకపోతే ఇంటెన్స్ ఉండాలంటే మంచి పదాలు పాడాలి… వాటితో పల్లవి, చరణాలు హోరెత్తాలి… అంటే, అందులో భావం పదునుగా ఉండాలి… కానీ తోచిన నాలుగు గొట్టు తెలుగు పదాలు, మరో నాలుగు సంస్కృతపదాలు ట్యూన్‌లో ఒదిగించి, మీ చెవులు మీ ఇష్టం అని ప్రేక్షకుల మీదకు వదలొద్దు… ఉగ్రం పాటలో జరిగింది అదే… మధ్యమధ్యలో అరుపులు కూడా అంతే… సరే, మన కథనం ఆ పాట మీద సమీక్ష కాదుగా, నవతెలంగాణలో వచ్చిన వార్త మీద ఓ లుక్కు… ఇదే అది…
వార్తలోనే ఈ సినిమా ఇంటెన్స్ అని తేల్చిపారేశాడు రచయిత… యూనిక్ అనీ అన్నాడు… ఇది స్పాట్ వార్తా, సమీక్షా, ప్రశంసా, డప్పా ఏమీ అర్థం కాలేదు… హైలీ పవర్ ఫుల్ నెంబర్‌గా పాట కంపోజ్ చేశారట… గూస్ బంప్స్ తెప్పించే ఎమోషన్‌తో పాటను స్కోర్ చేశాడట… వార్తా రచయితే పరవశించి, పులకించి పోతే ఎలా..? పవర్ ఫుల్ లిరిక్స్, పవర్ ఫుల్ సాంగ్, ఉగ్రరూపాన్ని ప్రజెంట్… ఇలా ప్రతీ పదానికీ ఓ విశేషణం… అదీ అతి విశేషణం… అనగా సూపర్ లేటివ్ అని అర్థం… చివరగా మరో వాక్యం చెప్పుకుని ముగిద్దాం… పాటలో కనిపించిన విజువల్స్ ఇంటెన్సివ్, గ్రిప్పింగ్, స్టన్నింగ్‌గా ఉన్నాయి… అవునూ, నవతెలంగాణ అనబడే ఈ మార్క్సిస్టు పత్రికకు వర్తమాన సంపాదకుడు ఎవరో…!!
Share this Article