‘‘ఫలానా హోటల్ మూసేస్తారట కదా… అరెరె… అందులో బటన్ ఇడ్లీ బాగుండేది… మసాలా చాయ్ అదిరిపోయేది… శుభ్రంగా ఉండేవి పరిసరాలు… ధరలు కూడా రీజనబుల్… ప్చ్, ఆ హోటల్‌కు బైబై చెప్పాల్సిందేనా..?’’ అని ఎవరైనా ట్వీట్ చేస్తే ఏమిటి అర్థం..? ఛిఛీ, ఇదేం హోటల్‌ర భయ్, గుడ్‌బై అని చెప్పినట్టు కాదు కదా… అసలే కాదు… పైగా సదరు హోటల్‌తో అనుబంధాన్ని చెప్పుకున్నట్టు…!
ఉదయమే కొన్ని వార్తలు చదవగానే ఇదే స్ఫరించింది… ముందుగా ఆ వార్తల సారాంశం ఏమిటో చదవండి… ‘‘ట్విట్టర్‌కు స్మితా సబర్వాల్ గుడ్ బై… ఐఏఎస్ ఆఫీసర్ సెన్సేషనల్ డెసిషన్… సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్మిత సబర్వాల్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు… ట్విట్టర్‌కు గుడ్ బై చెప్పనున్నారు… దీని వెనుక అసలు రీజన్ ఏమిటో అంతుపట్టడం లేదు…’’ ఇలా సాగిపోయాయి వార్తలు… కాస్త ఆసక్తిగా అనిపించింది…
ఎందుకంటే..? అప్పట్లో దిక్కుమాలిన ఔట్‌లుక్ పత్రిక ఆమె ఫ్యాషన్ పరేడ్ మీద నెత్తిమాశిన ఓ కార్టూన్ వేసిన తీరును అందరమూ ఖండించాం… ఆమెకు సపోర్టుగా నిలబడ్డవాళ్లమే… ఎప్పుడైతే ఆమె ఆ పత్రికపై న్యాయపోరాటం చేయడానికి సర్కారు ఖజానా నుంచి డబ్బులు తీసుకుందో దాంతో కాస్త ఆ సపోర్టు తగ్గిపోయింది… ఆమె హోదా రీత్యా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి… తను మెయిన్ స్ట్రీమ్‌లో మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా అవి ఆమె వ్యక్తిగతమని ఎవరూ భావించరు…
Ads
వ్యక్తిగతం వేరు, ఓ ఇంపార్టెంట్ పోస్టులో ఉన్నప్పుడు బహిరంగంగా వ్యక్తీకరించే అభిప్రాయాలకు ఓ పరిమితి, ఓ లక్ష్మణరేఖ ఉంటాయి… మొన్న ఏదో ఇష్యూలో ఆమె ‘‘ఇక మహిళలు ఆయుధాలు పట్టకతప్పదు’’ అని ఏదో ట్వీట్ చేసింది… వ్యక్తిగా ఆమె బాధ, స్పందన వోకే… కానీ ఓ సీఎం ఆఫీసులో కార్యదర్శి అందరూ ఆయుధాలు అందుకొండహో అన్నట్టు ట్వీటడం నవ్వు పుట్టించింది… అప్పటికే ప్రొబీజేపీ సోషల్ మీడియా ఆమె మీద కొన్ని నెగెటివ్ వ్యాఖ్యలు చేస్తోంది…
గుజరాత్ ప్రభుత్వం ఏదో రేప్ కేసులో నేరస్థులను విడుదల చేయడంపై ఆమె వ్యతిరేకంగా స్పందించింది… ఏదో పోస్ట్ చేసింది… సహజంగానే బీజేపీ వాళ్లకు అది నచ్చలేదు… తెలంగాణలో జరిగేవి కనిపించడం లేదా..? బీజేపీ రాష్ట్రాల్లో జరిగేవి మాత్రమే కనిపిస్తున్నాయా..? అంటూ ఏవేవో వ్యాఖ్యలు చేశారు… ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్‌ను వదిలేసింది అనే హెడింగ్ చూడగానే… ఆయుధాల ట్వీట్, సర్వీస్ రూల్స్ గట్రా ఏమైనా ఈమెకు అడ్డుతగిలాయా అనిపించింది… తీరా తరచి చూస్తే… తూచ్, ఇది మీడియా ప్రజెంట్ అర్ధజ్ఞానమే అని అర్థమైపోయింది… ఆమె ట్వీట్‌ను అర్థం చేసుకోవడంలో వైఫల్యం అని అర్థమైంది…
ఈమధ్య ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కొన్నాడు కదా… ఎడాపెడా కొలువుల్ని పీకేస్తున్నాడు… మెయిళ్లు పెడుతున్నాడు… సంస్థ మొత్తం ఓ గందరగోళంలో పడిపోయింది… పలుచోట్ల ఉద్యోగులు రాజీనామాలు చేస్తున్నారు… ఆఫీసులు మూతపడే పరిస్థితి… అసలు ట్విట్టర్ మనుగడే అతలాకుతలం అవుతోంది… #GoodByeTwitter అనే హ్యాష్‌ట్యాగ్ అదే ట్విట్టర్‌లో హోరెత్తుతోంది… కాలవైచిత్రి… ఈ స్థితిలో అదే హ్యాష్‌ట్యాగ్ కోట్ చేస్తూ… ఒకవేళ అదే నిజమైతే, అందరికీ కృతజ్ఞతలు, ఇన్నాళ్లూ ఈ ప్లాట్‌ఫామ్ సరదాగా భలే ఉపయోగపడింది అంటూ స్మిత ఓ ట్వీట్ కొట్టింది…
అంటే ట్విట్టర్‌ను వదిలేస్తున్నట్టు కాదు కదా..? ఒక పోస్టును అర్థం చేసుకోవడంలో మీడియా వైఫల్యం… ఐనా మీడియాకు సరిగ్గా అర్థమయ్యేలా శ్లేషలు, నర్మార్థాలు ప్రయోగిస్తే ఎలా..? ఆమెదే తప్పు అంటారా..? సర్లెండి… గట్టిగా అనకండి… ‘‘హతియార్ ఉఠావో’’ అంటుంది మరి…!!
Share this Article