పిల్లలు పుట్టకపోవడం, పిల్లల సంఖ్య తగ్గిపోవడం, ముసలోళ్లే అధికమైపోవడం, జనాభాలో యువత శాతం కుంచించుకుపోవడం… ఇత్యాది లక్షణాలకు అసలు కారణం ఏమై ఉంటుంది..? మన సగటు జ్ఞానపరిధి మేరకు ఆలోచిద్దాం… మీరూ ఆలోచించండి… కుటుంబ నియంత్రణ మీద ప్రజల్లో అవగాహన పెరిగిపోవడం, ఒకరికన్నా ఎక్కువ మందిని ‘అఫర్డ్’ చేయలేమనే రియాలిటీ అర్థం కావడం… అంటే పిల్లలు ఎక్కువగా ఉంటే చదువు, ఆరోగ్యంతోపాటు ప్రేమనూ అందరికీ సరిపోయేలా, సరిగ్గా ఇవ్వలేమనే భావన…
పెరిగిన జీవనవ్యయం, చంచలమైన కొలువులు, ఒక అభద్రత చుట్టూ ఆవరించినప్పుడు… ఒక్కరు చాలు అనే ఓ భావన బలంగా ఫిక్సయిపోతుంది… చదువుకున్న యువత కొలువుల కోసం దేశాలు దాటిపోతారు… అక్కడే ఉండిపోతారు… దాంతో ఇక్కడ జననాల రేటు పడిపోతుంది… వృద్దుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది… ఇది ఒక రియాలిటీ… అంతే కదా… కాదు, మనం పిచ్చోళ్లం… అసలు కారణం అది కాదు… పిల్లల శాతం తగ్గిపోవడానికి ప్రధాన కారణం జగన్… ఎస్, సీఎం జగన్… అదేమిటి..? పిల్లలు కనకండి, ఎక్కువగా కంటే మర్యాద దక్కదు అని బెదిరించాడా..? ఏమో మరి… ఈనాడు అయితే మరో ప్రధాన కారణాన్ని వెలుగులోకి తెచ్చింది…
Ads
అప్పుడప్పుడూ ఇలాంటి పిచ్చి విశ్లేషణలు ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంటయ్… ఆంధ్రప్రభ కూడా పెట్టింది పేరు… కానీ చివరకు ఈనాడు కూడా ఈ గతికి చేరుకుంది… ఈనాడు తరం తరిగిపోతోంది అంటూ ఓ పెద్ద స్టోరీ వేసింది… సారాంశం ఏమిటీ అంటే..? వేరే రాష్ట్రాలతో, జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో పిల్లల సంఖ్య దారుణంగా పడిపోతోంది… దానికి మూడు రాజధానులు ప్లస్ అమరావతిని జగన్ ఆపేయడం కూడా ఓ కారణం అట… నమ్మడం లేదా..? దిగువన ఓ క్లిప్పింగ్ ఉంది, చదవండి…
ఒకప్పుడు దినపత్రికల్ని చదివితే జ్ఞాన వృద్ధి… ఇప్పుడు జ్ఞానక్షీణత… ఉదాహరణకు ఇదే స్టోరీ… జగన్ పాలనను విమర్శించాలంటే బోలెడు సహేతుకమైన అంశాలు దొరుకుతాయి… చేతనైతే వాటిని పట్టుకుని, సరిగ్గా విశ్లేషించాలి… ప్రతిదీ తీసుకెళ్లి అమరావతికి ముడిపెట్టి రాసేయడం ఓ దిక్కుమాలిన పాత్రికేయం… పోనీ, పిల్లల సంఖ్యను పోల్చినప్పుడు బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పోలుస్తారా ఎవరైనా..? అవి కుటుంబ నియంత్రణ, అక్షరాస్యత, శిశుమరణాలు, ప్రసూతి మరణాల్లో బీమార్ రాష్ట్రాలు… కేరళ, తెలంగాణ, తమిళనాడు వంటి ‘మెరుగైన జీవన నాణ్యత సూచికలు’ ఉన్న రాష్ట్రాలతో పోల్చుకోవాలి… (కేరళలో గత దశాబ్దంలోనే తొలిసారిగా ఈసారి జననాల రేటు దారుణంగా పడిపోయింది… అక్కడ అమరావతి ఇష్యూ లేకపోయినా సరే…)
అమరావతిని చంద్రబాబు స్టార్ట్ చేయడంతో ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చేశారట… విదేశాల్లో కొలువులు మానుకుని మరీ వచ్చారట, ఇక్కడ చంద్రబాబు ఉద్దరిస్తాడని విశ్వసించారట… అప్పుడు పిల్లల జననాలతో ఏరియా కళకళలాడిందట… కానీ జగన్ వచ్చి, అమరావతి ఆపేయడంతో అందరూ తమ భవిష్యత్తు దెబ్బతింటుందని భయంతో, తట్టాబుట్టా సర్దుకుని వాపస్ వెళ్లిపోయారట… అదట ఏపీలో పిల్లల శాతం తగ్గిపోవడానికి కారణం… ఇవేం రాతలో, ఇవేం కూతలో ఈనాడుకే తెలియాలి… ఇంకా నయం… మొన్న ఓ వార్త వచ్చింది… దేశంలో, ప్రపంచంలో మగాళ్లలో వీర్యం నాణ్యత బాగా పడిపోయిందట… అలాగే ఫర్టిలిటీ రేటు కూడా పడిపోతోందట… మునుపటికన్నా విడాకుల కేసులు విపరీతంగా పెరిగిపోయాయట… వీటికీ అమరావతిని ఆపేయడమే కారణమని రాసిపారేయలేదు… నయమే, బతికించింది ఈనాడు…
ఇలాంటివి రాసుకోవడానికి రాధాకృష్ణ ఉన్నాడు కదా… మళ్లీ దాన్ని కూడా వదిలేయకుండా ఈనాడు హైజాక్ చేయడం దేనికి..? ఇదుగో చదివారు కదా… మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఇక దేవుళ్లందరూ కలిసి వచ్చినా ఏపిని రిపేరు చేయలేరట… అదీ, చంద్రబాబు అంటే అభిమానం అంత బరిబాతల ఉండాలి… ఈ వాక్యం చాలు రాధాకృష్ణ వ్యాసంలోని నాణ్యత ఎంతో చెప్పడానికి… వేరే లోతు విశ్లేషణలు కూడా అక్కర్లేదు… అంతేతప్ప పిల్లల శాతం తగ్గడానికీ, ఫర్టిలిటీ రేటు పడిపోవడానికి కూడా అమరావతే కారణమనే వ్యర్థ, అనర్థ అపార్థ ఆలాపనలు, ప్రేలాపనలు ఏల..?!
Share this Article