ఛస్.., వార్తలు ఎవరైనా రాయగలరు..? ఎలాగైనా రాయగలరు..? మన గొప్పదనం ఏముంది..? రాస్తే ఓ రేంజ్లో ఉండాలి… అదేదో సినిమాలో అన్నట్టు… గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొడితేనే ఒక రేంజ్… ఈ వార్త చూడండి… స్థానిక ఎన్నికలపై జగన్ వర్సెస్ నిమ్మగడ్డ డిష్యూం డిష్యూం నడుస్తూ… ఇష్యూ ఇప్పుడు కోర్టులో ఉంది కదా… అంతటి డప్పు మాస్టర్ ఆంధ్రజ్యోతే జస్ట్, హైటెన్షన్ అనే హెడింగు పెట్టుకుని, తనే బోలెడంత టెన్షన్ పడిపోయింది తప్ప… ఇదుగో ఇలా తీర్పు వచ్చేస్తుంది… ఇక జగన్ సర్కారులో ఒక్కొక్కరి పనీ దబిడిదిబిడే అని రాయడానికి సాహసించలేదు… కానీ..?
ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందనీ… చీఫ్ సెక్రెటరీని, డీజీపీలను తాత్కాలికంగా తప్పించే అవకాశం ఉందనీ… కొత్త చీఫ్ సెక్రెటరీగా బీహార్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించబోతున్నారనీ… అంతేకాదు.., ఎన్నికల విధులు బహిష్కరిస్తామని ప్రకటించిన ఉద్యోగులపై చర్యలు తీసుకోబోతున్నారనీ రాసేసింది ఈ పత్రిక… ప్రభాతవార్త అంటే బహుశా వార్త దినపత్రిక అయి ఉంటుంది…
Ads
ఇదీ పత్రికరచన రేంజ్ అంటే..! హహహ… రేపటిరోజున జరగబోయే విచారణ, వచ్చే తీర్పు గురించి కూడా ముందురోజే స్కూప్ రాయడంకన్నా థ్రిల్ ఏముంటుంది..? పైగా సీఎస్, డీజీపీలను తప్పించడం… ఫలానా బీహార్ సీనియర్ ఐఏఎస్ కొత్త సీఎస్‌గా వచ్చే అవకాశాల్ని గుర్తించడం… వావ్… నిజానికి అక్కడ ఆగిపోయి బతికించింది పత్రిక…
లేకపోతే… తక్షణం రాష్ట్రపతిపాలనకు సిఫారసు చేస్తుందనో… రాజ్యాంగ సంక్షోభం నెలకొన్నందున వెంటనే మోడీ, అమిత్ షా రంగంలోకి దిగి… గవర్నర్‌కు పాలనబాధ్యతలు అప్పగించాలని ఆదేశిస్తుందనో రాయలేదు… అఫ్కోర్స్, ఇంత రాసినప్పుడు అది రాసినా తప్పులేదు… నిజానికి అలా జరగకూడదని కూడా ఏమీలేదు… రాసిన పత్రిక అలా జరగాలని ఆశించడంలోనూ తప్పులేకపోవచ్చు… కానీ జడ్జిలు ఇలా తీర్పు చెప్పబోతున్నారు అని ముందస్తుగా రాయడం ఏదయితే ఉందో… అదరగొట్టేశారుపో…
అవునూ… ఏదో రాశారులే… దాన్నలా వదిలేస్తే… ఈ వార్త చూశారుగా… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగ ఆందోళన పడిపోతున్నాడు… హైరానా… టెన్షన్… అయ్యో, ఏమయిపోతుందో… అసలు షెడ్యూల్ విడుదలయ్యాక కోర్టులు ఇంతవరకూ జోక్యం చేసుకున్న చరిత్రే లేదు అంటున్నాడు… అంటే, ఖచ్చితంగా మా నిమ్మగడ్డదే విజయం అన్నట్టుగా ప్రకటించేస్తున్నాడు పరోక్షంగా… వాయిదా వేయాలని చెప్పినా సంచలనమేనట… జెర సైసు సారూ… అంటే కాస్త ఆగు ఆగు అని అర్థం… ఏమీకాదు, చాలాచాలా రాజ్యాంగసంక్షోభాల్నిచూసింది చరిత్ర… నువ్వు బెంబేలెత్తిపోవడం దేనికి సార్..? వ్యవస్థల నడుమ ఘర్షణ అనేకసార్లు సహజం… మరీ ఇదేమైనా ట్రంపు వర్సెస్ జోబైడెన్, కేపిటోల్ ఆక్రమణ లెవల్ టెన్షన్ ఏమీకాదులే గానీ… ఆందోళన వలదు… వలదు… మరీ అసాధారణంగా జగన్ ప్రభుత్వం రద్దు దాకా పరిస్థితి ఏమీ దిగజారదు… అన్నింటికన్నా ముఖ్యంగా… ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబును నియమించే అవకాశం అసలే ఉండదు… ప్లీజ్, కూల్… కూల్…!!
Share this Article