బీఆర్ఎస్ విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్‌కు బిడ్ వేయబోతోందట… సరే, కేసీయార్ రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ఉద్దరించనున్నట్టు బిల్డప్ ఇస్తాడు… అది వేరే సంగతి… అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం బిడ్ వేయవచ్చా..? అప్పుల ఊబిలో కూరుకుపోయిన సింగరేణికి అంత సీన్ ఉందా..? అసలు అవి స్టీల్ ప్లాంట్ సేల్ బిడ్లేనా..? ఇవన్నీ జనానికి చెప్పకుండా, అర్జెంటుగా ఆంధ్రుల ఆపద్దర్మ రక్షకుడు అయిపోతున్నాడు కేసీయార్…
సరే, తన బాధ తనది, మరి ఈ సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణకు ఏమైంది..? అసలు తను ఐపీఎస్ చేసి, సీబీఐ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలో పనిచేసి, సోనియా చెప్పినట్టుగా గాలి, జగన్ వంటి కేసుల్ని డీల్ చేసినవాడేనా..? తన ఆలోచన విధానంమీదే డౌట్ వస్తోంది… తను కూడా బిడ్ వేశాడు… అదేమిటయ్యా అనడిగితే… ఓ వింత ప్రతిపాదనను సమాజం మీదకు విసిరేశాడు…
ప్రజలు తలా వంద రూపాయలు కట్టేస్తే 850 కోట్లు వస్తాయట… అలా 4 నెలలు కడితే చాలు, ఈ క్రౌడ్ ఫండింగ్‌తో విశాఖ ఉక్కును గట్టెక్కిస్తాడట… అబ్బో… అయితే కొన్ని సందేహాలు బ్రదర్…
Ads
- ఈ నెలకు వంద రూపాయల స్కీమ్ కేవలం ఆంధ్రులకేనా..? తెలంగాణ వాళ్లు కూడా పాల్గొనవచ్చా..? ఎందుకంటే, అర్జెంటుగా ఆంధ్రుల్ని అక్కున చేర్చుకునే స్కీమ్ మొదలుపెట్టాడు కదా కేసీయార్..? పైగా తమరికి కూడా కేసీయార్ మీద బోలెడు ఆశలున్నాయి కదా…
- అవునూ, ఈ 4 నెలలు డబ్బులు కడతారు సరే, విశాఖ ఉక్కు అంటే అదొక దైవస్వరూపం కాబట్టి భక్తితో ప్రజలు తమ అవసరాల్ని కత్తిరించుకుని సైతం దాన్ని రక్షించుకుంటారు సరే… కానీ దాని పనితీరు మారదు కదా, మరో ఏడాదికి ఈ మొత్తం నాకేస్తే, మళ్లీ ఏం చేయాలి..? అసలు జనానికి జగన్ బటన్ నొక్కగానే డబ్బు తీసుకోవడం అలవాటై, లక్ష్మినారాయణ పిలుపునివ్వగానే ఉవ్వెత్తున తరంగంలా ఎగిసిపడి, ఆ 400 కట్టేస్తారా..?
- అసలు కేంద్రం ఈ స్టీల్ ప్లాంటును డబ్బుల్లేక ప్రైవేటువాడికి అమ్మే ఆలోచనలో ఉందా..? లేక ప్రభుత్వ రంగ సంస్థల డిజిన్వెస్ట్‌మెంట్ భావజాలంతో ఈ నిర్ణయం తీసుకుందా..? మోడీయేనా..? ప్రభుత్వరంగసంస్థల అమ్మకాలు మన్మోహనుడు చేయలేదా..?
- ఐనా ప్రైవేటీకరణ అంటే మూసివేత ఎలా అవుతుంది..? సంస్కరణ అవుతుంది..? ఎవరి ఉద్యోగాలూ పోవు… కాకపోతే ప్రైవేటువాడు వంగబెట్టి పనిచేయిస్తాడు… అంతేకదా తేడా..? ఎందుకు జనాన్ని సెంటిమెంట్‌తో మభ్యపెడుతున్నారు..?
కానీ ఏమాటకామాట… జేడీ లక్ష్మినారాయణ కూడా బీఆర్ఎస్‌లో చేరతాడో లేదో వేచిచూద్దాంలే గానీ… తనకు రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు మాత్రం వేగంగా వచ్చేస్తున్నయ్… అబద్ధాలు, ప్రజల కళ్లకు గంతలు కట్టడం, అనాలోచిత విధానాలు ఎట్సెట్రా… అప్పుడెప్పుడో 2018లో నాకు వ్యవసాయ శాఖ అంటే ఇష్టం, కేంద్రంలో మంత్రిగా ఏ పార్టీ అవకాశం ఇస్తానని ప్రామిస్ చేస్తే ఆ పార్టీలో చేరుతా అన్నట్టు గుర్తు… తెలుగుదేశం వ్యాసకర్త Neelayapalem Vijay Kumar కూడా అదే గుర్తుచేశాడు…
Share this Article