తెలుగు లిపిలో రాదగిన మార్పులు- ఆవశ్యకత అన్న అంశం మీద హైదరాబాద్ లో ఒక చర్చా గోష్ఠి జరిగింది. అంతరించబోయే తెలుగు లిపి గురించి కాబట్టి- సహజంగా మీడియాలో ఈ సమావేశానికి తగిన చోటు దొరకలేదు. దొరికినా టాబ్లాయిడ్ లో జోనల్ పేజీ ఇరుకు కాలమ్స్ మధ్య భూతద్దం వేసి చూస్తే తప్ప కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
తెలుగు లిపిలో మార్పుల ఆవశ్యకత గురించి ఈ సమావేశం చర్చించింది.
“దీర్ఘాలు, ఒత్తులు విడిగా రాయాల్సిన అవసరం లేకుండా- దీర్ఘానికయితే ఆ అక్షరం మీద గీత, ఒత్తుకయితే ఆ అక్షరం కింద గీత పెడితే చాలు- దాంతో కొత్తగా తెలుగు లిపి నేర్చుకునే పిల్లల మీద డెబ్బయ్ శాతం భారం తగ్గిపోతుంది. చాలా సులభంగా, వేగంగా నేర్చుకోగలుగుతారు”
అన్నది ఈ సమావేశంలో ఒక ప్రతిపాదన.
Ads
ఉదాహరణకు కా దీర్ఘం రాయాలంటే క రాసి ఆ అక్షరం మీద నిలువు గీత పెడితే చాలు. అలాగే క్క ద్విత్వాక్షరం రాయాలంటే క రాసి ఆ అక్షరం కింద అడ్డ గీత పెడితే చాలు. వినడానికి ఇది బాగానే ఉన్నా ప్రాక్టికల్ గా ఇందులో ఇబ్బందులున్నాయి. తెలుగు మనం ఎలా మాట్లాడతామో దాదాపుగా అలాగే రాస్తాం. రాసింది దాదాపుగా అలాగే పలుకుతాం. ఇంగ్లీషులోలా సైలెంట్ లెటర్స్ లేవు. నిజానికి ఇప్పుడు ఇంగ్లీషులో సైలెంట్ లెటర్స్ కూడా ఒకప్పుడు సైలెంట్ అయి ఉండవు. అలా పలికి ఉండకపోతే స్పెల్లింగ్ అలా రానే రాదు. శబ్దానికి లిఖితరూపంగా ఏర్పడ్డ లిపిలో మొదట్లో ప్రతి శబ్దాన్ని పలికి ఉంటారు. తరువాత పలకడం నాజూకు అయి, అక్షరం మూగబోయినా- లిపి సంప్రదాయం మాత్రం పాత పద్ధతిలోనే ఉండిపోతుంది.
తెలుగులో మధ్యాన్నం అని అనకుండా మధ్యాహ్నం అని మధ్యలో హ స్పష్టంగా వినిపించేలా పలుకుతుంటాం. లిపిలో ఉన్న ప్రతి అక్షరం పలికితేనే మనకు ప్రామాణికం. తృప్తి. దీర్ఘక్షారాలు, ద్విత్వాక్షరాల స్థానంలో పైన గీత, కింద గీతలు పెట్టినా- ఆ అక్షరం కనిపించగానే దీర్ఘం, ఒత్తుకు పెట్టబోయే గుర్తును వదిలేసి, కనిపించే అక్షరాన్ని యథాతథంగా చదివే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది.
ఒకప్పటి బండి ర అయిన ఱ బండబారి పోయింది. అలు, అలూ అని చెప్పించే అక్షరాలు ఇప్పుడెక్కడున్నాయో తెలియదు. చేప, చాప, చాచిన మాటల్లో చ వర్ణాన్ని ప్రత్యేకంగా సూచించడానికి ఇదివరకు ఉన్న అక్షరం ఇప్పుడు లేదు. శ ష స మధ్య ఉచ్చారణ భేదం పాటించడానికి ఆధునిక తరానికి కష్టంగా ఉంది. ల ళ ; న ణ ఎలా పడితే అలా పలుకుతున్నా చెల్లుబాటు అవుతోంది.
యాభై ఏళ్ల కిందట తెలుగు వర్ణమాలకు ఇంకొన్ని అక్షరాలు తోడు కావాలని భాషాశాస్త్రవేత్తలు, పండితులు ప్రతిపాదించారు. ప్రత్యేకించి –
మేక
పంపారు
చేశారు
అన్న చోట్ల మే… పా…శా ఉచ్చారణలో యా యే కలిసిన ధ్వని రావాలి.
మ్యేక
పంప్యారు
పంప్యేరు
చూశ్యారు
చూశ్యేరు – అని రాయడానికి వీల్లేదు. రాయకూడదు. కాబట్టి ఇలాంటి చోట్ల యా యే కలిసిన ధ్వని రావాలని సూచిస్తూ ఆ అక్షరం కింద గీత పెట్టడమో లేక కొత్తగా ఒక అక్షరాన్ని ఆవిష్కరించడమో అవసరమని అప్పుడు అనుకున్నారు. ఇలాగే సంస్కృత ఉచ్చారణను సూచించే మరికొన్ని అక్షరాలు అవసరమని అప్పట్లో చర్చ జరిగింది. యాభై ఏళ్లు గిర్రున తిరిగి …ఇంగ్లీషు మీడియం చదువులు, లిపి లేని డిజిటల్ ఇమోజి 😃🙏👌👍✍️👎✌️💪😜 విశ్వ భాష అక్షరాలు వచ్చిన తరువాత- తెలుగు అక్షరాల గుణింతాలను సగానికి సగం తగ్గించాలనుకోవడం సహజమే.
తెలుగు సినిమా పాట లిరికల్ రిలీజ్ ప్రాణం పోయినా సరే- ఇంగ్లీషు లిపిలోనే విడుదల చేయాలని తెలుగు సినీ కళామతల్లి చేసిన అనుల్లంఘనీయ శాసనమేదో ఉన్నట్లుంది. పొరపాటున కూడా తెలుగు పాట తెలుగు లిపిలో విడుదల కాదు. ఇలాంటి వేళ తెలుగు లిపిని కూడా పెట్టుబడుల ఉపసంహరణ పద్దులో పెట్టేసి పట్టుమని పది అక్షరాలను మొక్కుబడిగా మిగుల్చుకుని- మిగతా నలభై అక్షరాలను ఉపసంహరించుకోవడమే ఉత్తమం. దీర్ఘానికి, ఒత్తుకు మాత్రమే గీతలెందుకు? అన్ని గుణింతాలకు ఏవో ఒక గీతలు కనుక్కుంటే- డెబ్బయ్ శాతమేమి ఖర్మ? వందకు వంద శాతం అక్షరాభ్యాసాన్ని సులభతరం చేయవచ్చు.
తల్లీ నిన్ను తలంచి గీతలు నేర్చుకుంటిమి. నీవు మా ఉల్లంబందున నిల్చి జృంభణముగా గీతల్ నేర్పుము!
రండి!
తలా ఒక చెయ్యి వేసి
తెలుగు అక్షరాలకు తలదీపం పెడదాం!
తెలుగు అక్షరాలకు సమాధి కడతాం! చందాలివ్వండి!
మనమెంతగా కష్టపడి ప్రయత్నించినా తెలుగు భాషను శాశ్వతంగా రూపు మాపలేము కానీ- తెలుగు లిపిని మాత్రం ఏదో ఒకనాటికి దిగ్విజయంగా రూపు మాపగలం. తిలా పాపం తలా పిడికెడు!………….. By…. పమిడికాల్వ మధుసూదన్ …… #Teluguscript, #Teluguletters, #Telugulanguage
Share this Article