మీ నోట్లో పళ్లు నోట్లో మిగలాలంటే కోల్గేట్ ఉప్పు జ్ఞానమే శరణ్యం!
————————
త్రేతాయుగంలో హనుమంతుడు వంద యోజనాల లవణ సముద్రాన్ని అవలీలగా దాటగలిగాడు… ఒక యోజనం అంటే ఎనిమిదిన్నర మైళ్లు అని ఒక ప్రమాణం; పదిన్నర మైళ్లు అని మరొక ప్రమాణం. ఆ గొడవ ఇక్కడ అప్రస్తుతం… అంతటి ఉప్పు సముద్రాన్ని దాటినప్పుడు హనుమ కానీ, వాల్మీకి కానీ మనకు ఉప్పు జ్ఞానాన్ని బోధించలేదు… ఆ లోటును ఇప్పుడు కోల్గేట్ వాడు పూడుస్తున్నాడు… అక్కినేని సమంత ఈ ఉప్పు జ్ఞానానికి బ్రాండ్ అంబాసిడర్… తమిళ, తెలుగు కోల్గెట్ ప్రకటనల్లో కర్ణ కఠోరమయిన అనువాదం ప్రకారం సమంత ఏమి చెబుతోందంటే-
“మీ పళ్లల్లో దాగి ఉన్న క్రిములతో కోల్గెట్లో దాగి ఉన్న ఉప్పు పోరాడి నోటిని శుభ్రపరుస్తుంది. పళ్లు మిల మిల మెరుస్తాయి. మొత్తం ఈ కోల్గెట్ దంత ధావన ప్రక్రియను ఉప్పు జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం ఉంటే మీ పళ్లు నిలబడతాయి. ఈ జ్ఞానం లేకపోతే మీ పళ్లు ఊడి బోసి నోటితో మిగులుతారు.”
ఈ ఉప్పు జ్ఞానం ప్రకటనలు చూసిన సామాన్యుల సందేహాలు, ప్రశ్నలివి.
Ads
1 . ఇన్నాళ్లుగా నానా యాసిడ్లు నోట్లో పోసి, ఇప్పుడు ఉప్పో ఉప్పు అని పలవరిస్తే- మొన్నటివరకు ఉప్పులేని టూత్ పేస్ట్ చేసిన డ్యామేజికి ఎవరు బాధ్యులు?
2. దంతధావనానికి బూడిద- ఉప్పు; బొగ్గు- ఉప్పు; వేప పుల్ల వాడే భారతీయ విధానాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి, ఎగతాళి చేసి, పనికిరానిదిగా చేసిందెవరు?
3. మన బొగ్గు గనుల కోల్ గేట్ స్కామ్ జగమెరిగినదే. ఆ కోల్గెట్ స్కామ్ కంటే ఈ కోల్గెట్ ఉప్పు జ్ఞానం స్కామ్ చిన్నదా? పెద్దదా?

4 . సృజనాత్మక దృశ్యీకరణ…. నిరంతరం బ్రషింగ్‌తో ప్లాక్, దుర్వాసన వంటి సాధారణ దంత సమస్యలు ఎదుర్కుంటుంది అని డిస్ క్లెయిమర్ స్పష్టంగా ఇచ్చినప్పుడు కోల్గెట్ ఉప్పు జ్ఞానం కూడా పనికిరానిదనే కదా అర్థం?
5. పనికిరాని ఉప్పు మా నోట్లో కుక్కడమే కాకుండా పరమ చెత్త అనువాదంతో ఆ ఉప్పుజ్ఞాన ప్రకటనలు మా మీద దాడిచేస్తుంటే మాకు కలిగే మానసిక వికారానికి ఎవరు బాధ్యులు? ఆ భాష వినలేని మా చెవులు పడే సంఘర్షణకు ఎవరిది జవాబుదారి? ఆ సృజనాత్మక దృశ్యీకరణ వ్యక్తీకరణ నటనీకరణ గ్రాఫికీకరణ చూడలేని మా కళ్లను ఓదార్చేవారెవరు?
6. ప్రస్తుతానికి ఉప్పు దాకా వచ్చారు. అసలే కోల్గెట్ పేరులో కోల్ – బొగ్గు ఉంది. ఉప్పు అంతా అయిపోయాక బొగ్గు జ్ఞాన పాఠాలు మొదలుపెడతారా?
7 . పళ్లూడగొట్టుకోవడానికి ఏ రాయయితే ఏమి? అన్న సామెత కోల్గెట్ వాడికి బాగా అర్థమయినట్లుంది. వినేవాళ్లు ఎర్రోళ్లయితే చెప్పేవాడు కోల్గెట్ అన్నట్లు ఉప్పు జ్ఞాన ప్రవాహంలో మనల్ను ముంచేస్తున్నాడు…
8. ముందు రోగం పుట్టిస్తే తరువాత మందులు మన దగ్గరే కొంటారు- అని ఒక దుర్మార్గమయిన ఫార్మా వ్యాపార సూత్రం. బహుశా కోల్గెట్ కూడా అలా ఇన్నాళ్లు ఉప్పు లేని పేస్ట్ తో మన పళ్లను చెడగొట్టి- ఇప్పుడు దానికి మా ఉప్పే వైద్యం అని పేస్టులు అమ్ముకుంటోందని ఎవరయినా అనుకుంటే కాదనే ధైర్యం కోల్గెట్ కు ఉండదు.
ఇంత చదివిన తరువాత కూడా మీ జ్ఞానంలో ఉప్పు లోపించిందని అనిపిస్తే- సంతోషంగా నాగసమంత చెప్పిన తెలుగు, తమిళ ఉప్పు జ్ఞానదంతాల సృజనాత్మక దృశ్యీకరణలను చూడవచ్చు…
ఇవన్నీ చదివాక మనకు… ‘‘పళ్లు రాలగొట్టేవాళ్లు లేక ఈ వేషాలన్నీ’’ అని కోపం వస్తే… అది మన తప్పుకాదు… కోల్గేట్ వాడే పెద్దలది… ఆ డబ్బులు పళ్లకు తగలకుండా మింగే నైపుణ్యానిది….
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article