బండి సంజయ్ అర్జెంటుగా తను మాట్లాడే ధోరణి మార్చుకోవాలి… లేకపోతే అది రాను రాను పార్టీకి కూడా నష్టదాయకమే…! పార్టీ కేడర్‌నో, అభిమానులనో ఉత్తేజపరిచేందుకు రాజకీయ నాయకులు ఏదేదో మాట్లాడుతుంటారు, పలుసార్లు హాస్యాస్పదం అవుతుంటాయి కూడా కొన్ని వ్యాఖ్యలు… అందుకే బహిరంగ ప్రసంగాలు, వ్యాఖ్యలకు వచ్చేసరికి ఆచితూచి మాట్లాడాలి… ఓ స్ట్రాటజీ ఉండాలి… ఇది చూడండి… బండి సంజయ్ ఇందిరాపార్కు దగ్గర ఏదో దీక్ష దగ్గర ప్రసంగించాడు… తనదైన స్టయిల్‌లో ఆవేశంగా కేసీయార్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశాడుట… నిప్పులురిమాడుట… అందులో కొన్ని నవ్వు పుట్టించేవి ఉన్నయ్… 1) అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను కూలుస్తాం అంటున్నాడు… అదేమైనా కేసీయార్ సొంత భవనమా..? తెలంగాణ సీఎం అధికారిక నివాసం అది… రేప్పొద్దున ఇదే బండి సంజయ్ సీఎం అయితే తనకూ నివాసమే అవుతుంది అది… మీరు ముందు కేసీయార్‌ను గద్దెదింపండి… ఆయనే తట్టాబుట్టా సర్దుకుని ఖాళీ చేస్తాడు… 2) అదే ప్లేసులో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతాను అంటున్నాడు… ఆల్‌రెడీ కేసీయార్ తలపెట్టి వదిలేశాడు ఇలాంటిదే ఓ విగ్రహ ప్రాజెక్టు… అది పూర్తి చేస్తే చాలు కదా, మళ్లీ ప్రగతిభవన్ స్థలం దేనికి..? ప్రగతి భవన్ పేరు మార్చి అంబేడ్కర్ భవన్ అని పేరు పెడతాం, లేదా దాన్ని అంబేడ్కర్ మల్టీ హాస్పిటల్ గా మారుస్తామన్నా బాగుండేది…
2) ఫామ్ హౌజు లక్ష నాగళ్లతో దున్నుతాం, బడుగులకు పంచుతాం అనేది మరో వ్యాఖ్య… ఎందుకు..? అది కేసీయార్ సొంత ఆస్తి… ఒకవేళ అవినీతి సంపాదన అనేది నీ ఆరోపణ అయితే ముందుగా దాన్ని నిరూపించు, జైలుకు పంపించు, రికవరీ చేయించు… ఎన్నాళ్లుగానో చెబుతున్నారు, కేసీయార్ అవినీతిని బయటపెడతాం, ఆధారాలున్నాయి అంటూ… ఏమైంది..? పైగా అధికారంలోకి రాగానే ప్రతిపక్ష నాయకుల ఆస్తుల మీదకు నాగళ్లు నడిపిస్తాం, అందరికీ పంచేస్తాం, కూల్చేస్తాం అంటే ఎలా..? ఇప్పుడు కేసీయార్ అదే పని చేస్తే వోకే అన్నట్టేనా మరి..?! 3) కేసీయార్ ప్రణాళికబద్ధంగా దళిత కార్డు ప్రయోగిస్తున్నాడు… తనకు తెలుసు, విపక్షాలు తన తాజా పథకాల్ని ఖండితంగా వ్యతిరేకించలేవు అని…! కక్కలేవు, మింగలేవు… ఒకవేళ విపక్షాలు కూడా దళిత ఇష్యూ మీద మాట్లాడటం మొదలుపెడితే ఇక కేసీయార్ ఆలోచన సక్సెస్ అయినట్టే… కేసీయార్ హుజురాబాద్ వ్యూహంలోకి వచ్చి చిక్కుకున్నట్టే వాళ్లు… దళితబంధు ఎంత చర్చనీయాంశం అయితే కేసీయార్‌కు అంత పొలిటికల్ ఫాయిదా… ఇప్పుడు బండి సంజయ్ దళిత కుటుంబాలకు పది కాదు, యాభై లక్షలు ఇవ్వాలని అంటున్నాడు… మరి మా మాటేమిటి అని బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఈబీసీలు ఐక్యంగా ప్రభుత్వాన్ని అడిగేలా… ఆల్టర్నేట్ వోట్ కన్సాలిడేషన్ అనే స్ట్రాటజీ లోపించింది బీజేపీలో… (ఒకసారి చార్మినార్, భాగ్యలక్ష్మి టెంపుల్, కెసిఆర్ కు సవాల్, ఆ స్ట్రాటజీ యాది చేసుకో సంజయన్నా)… కాంగ్రెస్ కైతే నోట మాటే కరువైంది… 4) చివరగా… కేసీయార్ మెడలు వంచి హామీలు అమలు చేయిస్తాం అంటున్నాడు సంజయ్… మీరు అధికారంలోకి వచ్చే పక్షంలో ఆయన మెడలు వంచే ప్రసక్తి ఎందుకొస్తుంది..? ఆయన మెడలు వంచి మీరు అమలు చేయిస్తే, ఇక మీరు అధికారంలోకి రాకపోయినా పర్లేదా..? మళ్లీ కేసీయారే ముఖ్యమంత్రి అయినా పర్లేదా..? ఎలాగూ మీరున్నారు కదా, ఆయన మెడలు వంచి ఆయన హామీలు అమలు చేయించడానికి…!!
Ads
Share this Article