ఓహ్… ఇప్పుడర్థమైంది… ఆంధ్రప్రభ ఎందుకింత హడావుడిగా స్మార్ట్ ఎడిషన్లు తీసుకొచ్చిందో… ఎన్నికల దాకా పొద్దున, మధ్యాహ్నం, రాత్రి భజన చేయడానికా..? ఈరోజు తమ స్మార్ట్ ఎడిషన్‌లో ఓ స్టోరీ, దానికి హెడ్డింగ్ చదివాక నవ్వొచ్చింది… శీర్షిక ఏమిటంటే… ‘‘గులుగుడు గులుగుడే… గుద్దుడు గుద్దుడే…’’
గుడ్, గులుగుడు వంటి తెలంగాణ పదాలు శీర్షికల్లోకి అర్థవంతంగా తీసుకురావడం వరకు గుడ్… ఇది ప్యూర్ భజన వార్త… కేసీయార్ కోసం వండబడిన కథనం… కంటెంట్, ప్రజెంటేషన్ అన్నీ అదే చెబుతాయి… కానీ ఈ గుద్దుడు గుద్దుడే దగ్గర… ఆ కంటెంట్ లోపలకు వెళ్లాక నవ్వొచ్చింది… ఆ హెడింగ్ గురించి కాదు… కంటెంట్ గురించి…
భజన చేసే విధము తెలియండీ జనులారా మీరు… అని అప్పట్లో భజనగీతం ఒకటి పాపులర్… ఎస్, భజన చేయడానికి ఓ తీరు, ఓ రిథమ్ ఉండాలి… లేకపోతే వికటించి, కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది… సరిగ్గా ఇది అలాంటి వార్తే… ఏదో చేయబోయి ఏదో చేసినట్టుంది… ఆంధ్రప్రభ పొలిటికల్ లైన్ నిజానికి జనసేన… ముత్తా వారు అందులోనే ఉన్నారు కాబట్టి… జనసేన ఉన్నదేమో బీజేపీతో… ఆరేడు సీట్లు కూడా బీజేపీ వదిలేసినట్టుంది… కానీ ప్రభ లైన్ మాత్రం బీఆర్ఎస్… లోపాయికారీగా కాదు… స్ట్రెయిటే… నమస్తే ప్రభ అనిపించుకుంటున్నది అందుకే…
Ads
ఈ స్టోరీ సారాంశం ఏమిటంటే..? మా ఇంటి పెద్ద మీద గులుగుడు గులుగుడే, కానీ అదంతా మా ఇంటి వ్యవహారం, చివరకు గుద్దుడే గుద్దుడు అని చెప్పుకొచ్చింది ఈ స్టోరీ… యువతలో కొత్తగా ఈ చర్చ సాగుతున్నదట… అంటే ప్రభ ఏం చెబుతున్నట్టు… నిజమే, జనంలో వ్యతిరేకత ఉన్నమాట నిజమే… కానీ అంతిమంగా కేసీయార్‌కే వోట్లు గుద్దుతారు అని..! దానికి యువత ఇలా అభిప్రాయపడుతోంది అని రాసుకొచ్చింది…
సరే, మంచిదే… నిజంగానే యువత అలా ఆలోచిస్తే మంచిదే… కనీసం మన రాజకీయాల గురించి ఆలోచిస్తున్నందుకు..! కానీ పరోక్షంగా ఆంధ్రప్రభ ఏం చెబుతున్నట్టు..? కేసీయార్ మీద జనంలో వ్యతిరేకత ఉంది అని..! అంటే సత్యాన్ని అంగీకరిస్తున్నట్టా..? కేసీయార్ మీద వ్యతిరేకత ఉందహో అని తన పాఠకులకు చాటిచెబుతున్నట్టా..? ఇదేం భజన..?
సరే, కేసీయార్ తెలంగాణ బాపు అనే కాసేపు అనుకుందాం వీళ్లు రాసినట్టు… బాపు అనే పదాన్ని ఎవరికి వాడాలో కూడా వీళ్లకు తెలియదు, అది వేరే సంగతి… కానీ మాకూ మాకూ మా కుటుంబంలో లక్ష ఉంటయ్, మధ్యలో మీరెవరురా అంటున్నారట యువత… ఎవరిని..? ప్రతిపక్ష పార్టీలనట..! కానీ ప్రభ మరిచిపోయింది ఒకటుంది… ప్రతిపక్షంలో ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ములుగు సీతక్క… ఇలాంటి లీడర్లు తెలంగాణ వాళ్లు కారా..? తెలంగాణ కుటుంబంలో సభ్యులు కారా..? బీఆర్ఎస్ కుటుంబమే తెలంగాణ కుటుంబమా..? అదెలా..?
కేసీయార్ కుటుంబపెద్ద ఎలా అవుతాడు..? అధికారంలో ఉన్నందుకా..? ముఖ్యమంత్రిగా ఉన్నందుకా..? మరి రేప్పొద్దున ఇంకెవరో ముఖ్యమంత్రి అయిపోతే, ఇక తనను కుటుంబ పెద్ద అనాలా..? లేక ఏకంగా తనను కూడా తెలంగాణ బాపు అంటారా..? దేవుడా… ఏమిటీ బాష్యాలు, కీర్తనలు…?
‘‘ఇక్కడ మేం ఆశపడ్డవి, అనుకున్నవి కొన్ని జరగకపోవచ్చు… ఐతేనేం, కోపమొస్తే అలుగుతం, గుణుగుతం, గులుగుతం… కానీ కాదనుకుంటామా..? వోట్లు గుద్దుతాం’’ అని కొన్ని వాక్యాలు… అంటే ఆశపడ్డ కొన్ని అంశాల మీద కేసీయార్ మీద కోపం జనంలో ఉంది అని చెబుతున్నట్టేనా..? అందుకే నవ్వొచ్చింది… గుద్దుడు అంటే వోట్లు గుద్దుడా..? పార్టీని గుద్దుడా..? ఆ నాయకుడిని గుద్దుడా..? ఆ హెడింగ్ ఏం చెబుతున్నట్టు మహానుభావా..?
Share this Article