ఆ షో పేరే ‘ఆలీతో సరదాగా’…! మనం మరిచిపోతున్న పాతతరం నటీనటుల్ని, సినిమా సెలబ్రిటీలను తీసుకొచ్చి మాట్లాడింపజేస్తాడు ఆలీ… ఎస్, బాగుంటుంది… మనం మరిచిపోయిన మొహాల్ని మళ్లీ చూపిస్తాడు… కానీ తనకు ఓ వింత పైత్యం ఉంది… తన షోకు ఎవరొచ్చినా ఏడవాలి… దాన్ని ప్రోమో కట్ చేయిస్తాడు… ఈటీవీ వాడు ఎడాపెడా ఆ ప్రోమోలను కుమ్మేస్తాడు… చివరకు వడ్లగింజలో బియ్యపు గింజ… షో చూశాక మరీ అంత హృదయ విదారకం ఏమీ ఉందిరా భయ్ అనిపిస్తుంది… సరే, ఇప్పుడంతా ప్రొమోల పైత్యమే కదా… యూట్యూబ్ చానెళ్లు, వెబ్సైట్ల హెడ్డింగుల్లాగే ఏదో టెంప్టింగ్ మసాలా… అసలు సరదాగా అని టైటిల్ పెట్టుకుని, ఈ ఏడుపు వికారం అవసరమా నిజానికి..?
కరోనా భయం నేపథ్యంలో ఇప్పుడు సినిమా ఫంక్షన్స్ కష్టమవుతున్నాయి కాబట్టి… సినిమాల ప్రమోషన్ కోసం అందరూ టీవీ షోల మీద పడుతున్నారు… టీవీల రియాలిటీ షోలన్నీ ఇప్పుడు సినిమా ప్రమోషన్లే… చివరకు కిట్టీ పార్టీల్లాంటి సుమ ప్రోగ్రాములు కూడా… జబర్దస్త్, వావ్ వంటి షోలు మాత్రమే కాదు, ఇదుగో ‘ఆలీతో సరదాగా’ వంటి ప్రోగ్రాములను కూడా వదలడం లేదు… అంతెందుకు, ఈమధ్య బిత్తిరి సత్తితో చిట్చాట్లు కూడా..! తన సినిమా లవ్ స్టోరీ ప్రమోషన్ కోసం కావచ్చు డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘ఆలీతో సరదాగా’ షోకు వచ్చాడు… నిజానికి తను పెద్దగా ఇంటర్వ్యూల్లో కనిపించడు…
Ads
తన సినిమాలు భిన్నంగా ఉంటయ్… వల్గారిటీ, మితిమీరిన చెత్తా సూపర్ హీరోయిజం, ఫార్ములా బాపతు వాసనలేమీ ఉండవు… తనది వేరే ప్రపంచం… తన లోకం తనది… తన మాటలు కూడా అంతే… హిపోక్రసీ, అబద్ధాలు ఉండవ్… కడుపులో ఉన్నదేదో నిజాయితీగా చెబుతాడు… వద్దనుకుంటే సైలెంట్… అంతే… తనే చెప్పాడు ఆలీతో… ‘‘నేను స్టోరీ నెరేట్ చేయడంలో వీక్… అందుకే ఫిదా కథను కూడా పెద్ద హీరోలను కన్విన్సింగుగా చెప్పలేకపోయాను…’’ ఒక్క మాటలో చెప్పాలంటే మనకున్న సెన్సిబుల్ డైరెక్టర్లలో ఒకడు, కానీ ఆ ఫోజులు కొట్టడు… మరి ఆలీ షోకు వచ్చాక తను కూడా ఏడుపు మొహం పెట్టాల్సిందేనా..? సరదా చిట్‌చాట్‌లో ఈ పైత్యానికి తలఒగ్గాల్సిందేనా..? తలొగ్గాడు… ఏడుపు మొహం పెట్టాడు… అదే ప్రోమో కటయింది, ఈటీవీ వాడు వాటిని కుమ్మేస్తున్నాడు…
ఆ షోలో ఆలీ ఏం చూపించాడు, ఈయన ఎందుకు ఏడుపు మొహం పెట్టాడు అనేది వదిలేద్దాం… కానీ ప్రతి షోలో, ఎవరొచ్చినా సరే ఇదే దిక్కుమాలిన ఆనవాయితీ దేనికి..? ముందస్తుగా ఏడుపు ప్లాన్ రచించి, అమలు చేయడం ఏమిటి..? పైగా ఇవి ఫ్లోలో సహజంగా వచ్చినట్టు గాకుండా కృతకంగా ఇరికించినట్టు ఉంటాయి… ఈమధ్య మరీ ఎక్కువైంది… గతంలో బాలు, రాఘవేంద్రరావు, వర్మ వంటి దిగ్గజాలతోనూ ఆలీ షో చేశాడు… అప్పుడు ఈ పైత్యం కనిపించేది కాదు… మరీ ఏడాదిరెండేళ్లుగా ఈ ఏడుపు ప్రోమోల రోగం కనిపిస్తోంది… సెలబ్రిటీ ఏడుపు సేల్ అవుతుందనే థాట్ ఎప్పుడూ వర్కవుట్ కాదు… ఆమధ్య హిమజ అనుకుంటా, ఎంత ప్రయత్నించినా కన్నీటి చుక్క కాదు కదా, మొహంలో ఆ ఫీల్ కూడా రాలేదు… కృత్రిమంగా ప్రయత్నిస్తే ఇలాంటి మాటామంతీ ప్రోగ్రాముల్లో అన్నిసార్లూ ఆ లైఫ్, ఆ ఫీల్ రాదు… అవునూ, ఆలీ… ఎప్పుడైతే నీ షో కేరక్టర్ దెబ్బతింటూ.., పరమ రొటీన్, ప్రమోషన్ ప్రోగ్రాం అయిపోయిందో, టీఆర్పీలు కూడా ఘోరంగా పడిపోయాయి… గమనించావా..?
Share this Article