గతంలో అంబడిపూడి పుస్తకాలు వచ్చేవి… 30 రోజుల్లో తమిళం నేర్చుకోవడం ఎలా..? 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా..? ఇలాంటి పుస్తకాలు పావలా, ఆఠాణా ధరతో దొరికేవి… నిత్యజీవితంలో వాడే కొన్ని పదాలు, వాక్యాల్ని పరిచయం చేసేవి… ఎటయినా టూర్లు వెళ్లినప్పుడు, హోటళ్లలో, టూరిస్టు స్పాట్లలో, షాపింగ్ సెంటర్లలో కాస్త ఉపయోగపడేవి… ఇప్పుడు టెక్నాలజీ ఇంత పెరిగాక కూడా ఇంకా అంబడిపూడి ఏమిటి..? దాని అంబ డిపూడి సౌకర్యం వచ్చేసింది కదా… జస్ట్ అలా స్మార్ట్ ఫోన్లో మనకు కావల్సిన భాషను సెలెక్ట్ చేయడం, అనువాదం చేసుకోవడం, వాడుకోవడం… అంతే… ప్రత్యేకించి ఈ గూగుల్ ట్రాన్స్లేషన్ వచ్చాక ఇంకా ఈజీ అయిపోయింది… అఫ్ కోర్స్, ఈ అనువాదాలు మరీ వికృతంగా అష్టావక్రల్లాగా భయపెట్టేలా ఉంటయ్… కానీ తప్పదు… ఈనాడు క్షుద్రానువాదాల్ని భరించడం లేదా ఏం..? అయితే..?
ఒక రచనకు, ఒక సోషల్ మీడియా పోస్టుకు, తాత్కాలిక అవసరానికి గూగుల్ అనువాదం ఎంత దరిద్రంగా ఉన్నా సరే, వాడుతున్నాం… మన ఖర్మ, మన అవసరం అది… కానీ ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీ ఉందనుకొండి… దానికి పెద్ద క్రియేటివ్ టీం ఉంటుంది… కార్పొరేట్ కమ్యూనికేషన్స్ టీం ఉంటుంది… తమ ప్రకటనల్ని ఇంగ్లిషులోనో, హిందీలోనో ఒరిజినల్‌గా రాయించి, ఇతర భాషల్లోకి మంచిగా ట్రాన్స్‌లేట్ చేయించుకునే నిపుణులూ దొరుకుతారు… అది అవసరం కూడా… పత్రికల్లో, హోర్డింగుల్లో, టీవీల్లో, ఇతర ప్రకటనల్లో తప్పుడు అనువాదాలు, హాస్యాస్పద భాష కనిపిస్తే జనం పకపకా నవ్వుతారు… థూవీడబ్బ అని తిట్టేసుకుంటారు… చివరకు ఆ ప్రకటన కాస్తా ‘కోల్గేట్ వాడి ఉప్పుజ్ఞానం’ తరహా కామెడీ పీస్ అయిపోతుంది…
Ads
ఇది చూడండి… బ్రిటానియా వాడి ప్రకటన… సాక్షిలో వచ్చింది… గ్రామీణ చానల్ భాగస్వామిని అనుభవించాలట… పైగా రెఫరల్ స్థానం అవసరమట… అత్యవసరంగా కోరుకున్నారట… ఏమైనా సమజైందా..? ఇంగ్లిషుకు ఈమధ్యకాలంలో చూసిన పరమ దరిద్రమైన అనువాదం… ఆసక్తి, అభ్యర్థి సంప్రదించండి… థూ.., కర్త, కర్మ, క్రియ ఏమీ ఏడ్వవు… నాలుగు జిల్లాల్లోని నలభై సెంటర్ల పేర్లు రాస్తే ప్రతిదీ తప్పే… ఇబ్రాహీంపట్న్ం, వెలద్ండా, ఆల్ంపూర, ఆమ్లాపూర్ం, దేవీపపట్న్ం… ఇవన్నీ ఓసారి చదివి చూడండి… అంటే ఒరిజినల్ ఇంగ్లిషు కాపీని గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో పెట్టేసి, అక్కడ కనిపించిన దరిద్రాన్ని కట్ చేసి, ఇక్కడ పేస్ట్ చేసి, డీటీపీ చేసి, పత్రిక మొహాన కొట్టారు సదరు బ్రిటానియా ప్రకటనల విభాగం పనిమంతులు… (గూగుల్ కాస్త నయం, వీళ్లు ఇంకేదో దాన్ని మించిన ఓ మహత్తర అనువాద అనువాద పరికరాన్ని, అనగా టూల్ వాడినట్టున్నారు…) మాదేం పోయింది, మా డబ్బులు వచ్చాయా లేదా అని చూసుకుని సాక్షి వాళ్లు అచ్చేసి వదిలారు… వాళ్ల తప్పేముంది పాపం.., అంటే ట్రాన్స్లేషన్ దగ్గర్నుంచి, పబ్లిషింగ్ వరకూ ఆ ప్రకటనలోని భాష గురించి పట్టించుకున్నవాళ్లు లేరు… ఇప్పటికీ తెలుగు సినిమాలు, సీరియళ్లలో తెలంగాణ మాండలికాన్ని ఖూనీ చేస్తున్నట్టుగానే… వాణిజ్య ప్రకటనల్లోనూ తెలుగును ఖూనీ చేస్తూనే ఉంటాయి ఈ నార్తరన్ పెద్ద కంపెనీలు… ఏం చేస్తారు..? ‘‘భాగస్వామిని అనుభవించండి…’’!!
Share this Article