ఫేస్ బుక్ అనువాదాన్ని నమ్మితే… ఇంతే సంగతులు!
ఈ మధ్యన ఫేస్ బుక్ మనం తెలుగులో ఏదైనా రాసి పెడితే…. అది రాకుండా దానంతట అది ఇంగ్లిషులోకి అనువదించి పెడుతోంది. ‘Show Original’ అన్న మాటను నొక్కితే తప్ప తెలుగు లిపి కనిపించదు. ఈ అనువాదం సంగతి ఏమిటా? అని చూస్తే నాకు మతిపోయింది. ముందుగా ఫేస్ బుక్ నుంచి సంగ్రహించిన ఈ స్క్రీన్ షాట్ చూడండి.
Ads
1992లో ఈనాడు జర్నలిజం స్కూల్ లో నా బ్యాచ్ మేట్ అయిన శోభశ్రీ పోస్టు చేసిన ఒక వ్యాసం. చదువుదాం కదా… అని మొదలుపెట్టా. దిమ్మతిరిగింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ రెండో తరంగం (సెకండ్ వేవ్ అన్న) జర్నలిస్టులను ఎలా పొట్టన పెట్టుకుంటున్నదీ తెలుగులో బాగా రాశారా వ్యాసంలో. తెలుగులో రాసింది చేయి తిరిగిన జర్నలిస్టు. తర్జుమా అయిన మొదటి పేరా చదివేసరికి ఓర్నాయనో… ఇది అనువాదమా? భాషా హననమా… అనిపించింది. మచ్చుకు…
1) శీర్షికలోనే పెద్ద దూడ
‘సెకండ్ వేవ్ లో… కొడిగడుతున్న జర్నలిస్టు దీపాలు’ అని రచయిత రాశారు. ‘దీపం కొడిగట్టడం’ అనేది బతుకులు ఆరిపోతున్నాయని, జర్నలిస్టులు మరణిస్తున్నారని కవి హృదయం. దీన్ని వ్యతిరేకార్థంలో వాడతారు. దీన్నే ‘పిట్టల్లా రాలిపోతున్నారు’ అని రచయిత వ్యాసంలో స్పష్టంగా చెప్పారు. దానికి ఫేస్ బుక్కు డొక్కు అనువాదం ఇదీ…
In the second wave…journalist lamps are lighting…
wave ను అనువదించకుండా మక్కీకిమక్కీ దింపి… దీపం కొడిగట్టడాన్ని బండ బూతు అనువాదం చేయబడింది. ఒకపక్క జర్నలిస్టులు అష్టకష్టాలు పడుతుంటే… వారి ప్రభ వెలిగిపోతున్నదన్న ధోరణిలో అనువాదం! ఖర్మ…
2) ‘శ్రీకారం రామ్మోహన్ మొదట జర్నలిస్టు’ అన్న దానికి Srikaram Rammohan is the first journalist అని వచ్చింది.
మొదట జర్నలిస్టు అంటే… initially he was a journalist. మొదటి జర్నలిస్టు… అంటే ఈ భూమ్మీద ఓం ప్రథమంగా పుట్టిన జర్నలిస్ట్ అనే అర్థం వచ్చేలా అనువాదం వచ్చింది.
3) ‘మంచి రచయిత’ అని వ్యాసకర్త రాస్తే… A very good writer అని మెషిన్ అనువాదం చేసేసింది.
చాలా మంచి రచయిత అని రాసినప్పుడు… ఆ ఇంగ్లిష్ సరిపోతుంది.
4) ‘రాసినవి చాలా తక్కువే అయినా-రాసినవన్నీ మంచి రచనలే’ అని వ్యాసకర్త రాశారు. దానికి…
Though the written things are very few-all the written things are good writings... అని అమ్మడు అనువదించింది. చేసినవన్నీ మంచి రచనలే… అని రచయిత రాసి ఉంటే దాని అనువాదం ఇంకెంత బాగా ఏడ్చెదో కదా!
Share this Article