.
బీజేపీ కావాలనే జుబ్లీ హిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్‌కు సానుకూలంగా వ్యవహరిస్తోందా..? వ్యూహాత్మక స్తబ్దత మర్మం అదేనా..? చెప్పు, కిషన్ రెడ్డీ, ఎన్ని వోట్లతో ఓడిపోతున్నారు మీరు, అసలు పార్టీలో బీసీలకు ప్రాధాన్యం ఏది..? అని రాజాసింగ్ వెటకారపు వ్యాఖ్యలు దట్టిస్తున్నాడు కదా…
కానీ చాలామంది బీజేపీ సానుభూతిపరుల్లోనే ఆ సందేహాలు, ప్రశ్నలు వినిపిస్తున్నాయి… కిషన్ రెడ్డి ఎందుకిలా చేస్తున్నాడు అని..! ఎందుకంటే కాస్త వివరంగా చెప్పుకోవాలి..! జుబ్లీ హిల్స్ ఉపఎన్నిక నిజానికి బీజేపీకే ప్రతిష్ఠాత్మకం… కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం…
Ads
ఒకప్పుడు 2 నుంచి 48 కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుంది బీజేపీ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో… బండి సంజయ్ తను ఎత్తుకున్న చార్మినార్ భాగ్యలక్ష్మి జపంతో వోటర్లలో భారీగా హిందూ సంఘటన తీసుకురాగలిగాడు…
అప్పటిదాకా మజ్లిస్‌తో అంటకాగిన కేసీయార్ కూడా దీంతో ఠారెత్తిపోయి, నాకన్నా పెద్ద హిందువు ఎవడున్నాడు ఈ లోకంలో, అసలు మజ్లిస్‌తో మాకు ఏ దోస్తీ లేదన్నట్టుగా మాట్లాడాల్సి వచ్చింది… రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పంచ్ కనిపించాలంటే ఈ జుబ్లీ హిల్స్‌లో ఇంపాక్ట్ చూపించాల్సిందే… కానీ ఏం జరుగుతోంది..?
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎప్పుడో అభ్యర్థులను ఖరారు చేస్తే, బీజేపీ తాపీగా ఇప్పుడు కష్టమ్మీద ఖరారు చేసింది… ఒకవైపు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, బీసీ మూమెంట్ కనిపిస్తుంటే… మాట్లాడితే బీసీ ముఖ్యమంత్రి అని పాటపాడే బీజేపీ మాత్రం ఓ రెడ్డి అభ్యర్థిని బరిలోకి దింపుతోంది…
బీఆర్ఎస్ ఎప్పుడో ఎన్నికల పని మొదలుపెట్టేసింది… కాంగ్రెస్ కూడా ఖబరిస్థాన్‌కు భూకేటాయింపు దగ్గర నుంచి ఆ నియోజకవర్గంపై ప్రభుత్వపరంగా కాన్సంట్రేట్ చేస్తోంది… కానీ ఇప్పటికీ బీజేపీలో అవసరమైనంత కదలిక లేదు… ఓ విషయం గుర్తొస్తోంది… బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ కేడర్‌లో ఓ జోష్ కనిపించేది…
దుబ్బాకలో బీఆర్ఎస్ సానుభూతి అస్త్రంతోపాటు అధికారంలో ఉన్నందున సాధనసంపత్తిని ఎంత ప్రయోగించినా బీజేపీ గెలిచింది అక్కడ… హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటలను ఓడించేందుకు కేసీయార్ చేయని ప్రయత్నం లేదు, దిగని మెట్టు లేదు… ఐనా బీజేపీ గెలిచింది… మనుగోడులో కూడా మంచి వోట్లు సంపాదించింది…
కానీ ఏం జరిగింది..? బీఆర్ఎస్‌కు ఉపయోగపడేందుకా అన్నట్టు హైకమాండ్ సంజయ్‌ను తప్పించి, మళ్లీ కిషన్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టింది… కాంగ్రెస్ కూడా అందుకే బీజేపీ, బీఆర్ఎస్ రహస్య స్నేహితులు అని పదే పదే విమర్శించేంది… ఇప్పుడూ విమర్శిస్తోంది…
టీటీడీపీ పటిష్టీకరణపై దృష్టి పెట్టిన చంద్రబాబు హైదరాబాద్‌కు వస్తే… టీడీపీ, జనసేన కూటమి మద్దతు బీజేపీ అభ్యర్థికి ఉంటుందనే ప్రకటన చేయించలేదు దేనికి..? అలా చేస్తేనే కదా, సెటిలర్ల వోట్లు పడేది… ఈరోజుకూ ఆ ప్రకటన లేదూ అంటే, బీఆర్ఎస్‌కు పరోక్షంగా సహకరించడమా..? ఇదుగో ఇలా రాజాసింగ్ వేస్తున్న వెటకారపు ప్రశ్నలు బీజేపీ కేడర్‌లో కూడా అనేక సందేహాలకు, ఓ గందరగోళానికి తావిస్తున్నాయి…
కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రి… తన నియోజకవర్గంలో జరిగే ఉపఎన్నిక ఫలితం మీద అందరి దృష్టీ ఉంది… కానీ ఆ మూవ్‌మెంట్ ఏది..? జుబ్లీ హిల్స్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలదే ప్రధాన పోటీ… బీజేపీ మూడో స్థానంలో, అదీ దూరంగా కనిపిస్తోంది ప్రస్తుతానికి..!
నిజానికి బీఆర్ఎస్ ఎంత తగ్గిపోతే… బీజేపీకి అంతగా మేలు తెలంగాణలో..! ఒకవైపు సొంతంగా అధికారంలోకి రావాలనే లక్ష్యం పెట్టుకుని, ఇలా బీఆర్ఎస్‌కు మళ్లీ జవసత్వాలు కలిగించడం దేనికి..? బీఆర్ఎస్ ఏకంగా బీజేపీ ముఖ్య నేతలపై కుట్ర చేసి, గాయిగత్తర లేపి, దేశమంతా బదనాం చేసి, ఏకంగా ఓ కార్యదర్శిని అరెస్టు చేయడానికి ప్రయత్నించిన తీరును బీజేపీ మరిచిపోయిందా..?
ఎనిమిది ఎంపీ స్థానాలు, ఎనిమిది ఎమ్మెల్యే స్థానాల నుంచి ఇంకా ఎదగడానికి బీజేపీకి ఓ పర్‌ఫెక్ట్ స్ట్రాటజీ కావాలి… బీఆర్ఎస్ ఖాళీ అయ్యే స్పేసులోకి తను దూరిపోవాలి… అదేమీ కనిపించడం లేదు… ప్రత్యేకించి హైదరాబాద్ కదా బీజేపీకి మెయిన్ పొలిటికల్ సెంటర్… మరి ఇక్కడే అంత నిర్లిప్తత ఏమిటి ప్రస్తుతం..?
ఇప్పటికీ కాంగ్రెస్ విమర్శ ఏమిటంటే..? తెర వెనుక బీఆర్ఎస్, బీజేపీ దోస్తులే అని..! మరోవైపు బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరిగినట్టు సాక్షాత్తూ కేసీయార్ బిడ్డ కవితే చెబుతోంది… మరి ఈ స్థితిలో బీజేపీ బలంగా నిలబడటానికి, ఎదగడానికి ప్రయత్నించాలి కదా… మరి బీఆర్ఎస్‌కు మేలు జరిగే స్ట్రాటజీలు, నిర్లిప్తతలతో ఏం ఫాయిదా..? ఇదిా మార్మిక స్తబ్ధత..!!
అవునూ… జుబ్లీ హిల్స్ ఫలితం మరీ నెగెటివ్‌గా ఉంటే ఎవరు నైతిక బాధ్యత వహిస్తారు..?! కొంపదీసి… బీఆర్ఎస్, బీజేపీ కలిసి నడిస్తే తప్ప కాంగ్రెస్‌ను ఎదురుకోలేం అనే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారా..?! బీజేపీ సానుభూతిపరుల్లోనే వ్యక్తమవుతున్న అభిప్రాయాల సారాంశం ఇదే..! అన్నట్టు, రాజాసింగ్ ఈరోజు ఏం చెప్పబోతున్నాడు..?!
Share this Article