.
( పొట్లూరి పార్థసారథి ) ……… డీలిమిటేషన్ లేదా నియోజకవర్గ పునర్విభజన పూర్వాపరాలు! దక్షిణాది రాష్ట్రాలు డీ లిమిటేషన్ లేదా నియోజకవర్గ పునర్విభజన ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
నియోజకవర్గ పునర్విభజన అంటే ఏమిటీ? జనాభాకి అనుగుణంగా ఆయా నియోజక వర్గం యొక్క సరిహద్దులలో మార్పులు చేయడం! ఒక నియోజకవర్గంలో ఎక్కువ జనాభా ఉండి పక్క నియోజకవర్గంలో జనాభా తక్కువ ఉంటే ఎక్కువ జనాభా ఉన్న సెగ్మెంట్ల ని పక్క సెగ్మెంట్ లో కలుపుతారు. ఒకవేళ అన్ని నియోజక వర్గాలలో జనాభా పెరిగిపోతే కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేస్తారు!
Ads
డీలిమిటేషన్ చేయడానికి ఒక కమిషన్ ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. డీలిమిటేషన్ కమిషన్ భారత ఎన్నికల సంఘంతో కలిసి పనిచేస్తుంది!
డీలిమిటేషన్ కమిషన్ లో పదవీ విరమణ చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు సభ్యులుగా ఉంటారు! డీలిమిటేషన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టుతో సహా ఏ కోర్టులోనూ ఛాలెంజ్ చేయడానికి వీలు లేదు!
డీలిమిటేషన్ కమిషన్ ఆయా లోక్ సభ నియోజకవర్గాల యొక్క జనాభాని పరిశీలించి నియోజకవర్గాల సరిహద్దులని నిర్ణయిస్తుంది. అవసరం అయితే కొత్త నియోజకవర్గాలని ఏర్పాటు చేస్తుంది!
******
డీలిమిటేషన్ అనేది రాజ్యాంగంలో పొందుపరచబడింది! ఆర్టికల్ 82 ప్రకారం ప్రతీ జనాభా లెక్కల సేకరణ తరువాత లోక్ సభ నియోజకవర్గాలని పునర్విభజన చేయవచ్చు. దీనికోసం డీలిమిటేషన్ కమిషన్ ని నియమించాలి.
ఆర్టికల్ 172 ప్రకారం రాష్ట్రాలు జనాభా లెక్కలు సేకరించిన తరువాత డీలిమిటేషన్ కమిషన్ ని ఏర్పాటు చేసి అసెంబ్లీ నియోజకవర్గ పునర్విభజన చేసుకోవచ్చు!
అధికారాలు ఎలా ఉంటాయి? పునర్విభజన విషయంలో కమిషన్ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయానికి రాలేకపోతే మెజారిటీ సభ్యుల నిర్ణయం అమలులోకి వస్తుంది. డీ లిమిటేషన్ నిర్ణయం అనేది తిరుగులేనిది! కోర్టులలో ఛాలెంజ్ చేసే అవకాశం ఉండదు!
*****
డీలిమిటేషన్ చరిత్ర!
1.డీలిమిటేషన్ చట్టాన్ని మొదటిసారి 1952 లో అమలు చేశారు. అప్పట్లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియోజకవర్గ పునర్విభజన చేసింది.
2. 1952, 1963, 1973, 2002 లలో డీలిమిటేషన్ జరిగింది.
3. చివరిసారిగా 1976 లో డీలిమిటేషన్ జరిగింది కానీ 1971 జనాభా లెక్కల ఆధారంగా జరిగింది! 1976 లో ఇందిర ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని సవరించి 2001 వరకూ డీలిమిటేషన్ జరగకుండా చేసింది!
4.2002 లో మళ్ళీ డీలిమిటేషన్ ని 2026 కి వాయిదా వేశారు.
******
1976 లో చివరిసారిగా లోక్ సభ స్థానాల పునర్విభజన జరిగింది! అంటే యాభై ఏళ్ళ క్రితం డీలిమిటేషన్ జరిగింది!
రాజ్యాంగం ఏమి చెపుతున్నది? జనాభా ప్రాతిపదికగా ప్రజందరికి తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటూ రాజకీయ పార్టీలని ఎంచుకోవడానికి వీలుగా నియోజకవర్గంలో సమాన జనాభా ఉండేట్లుగా చూడాలి.
మరి యాభై ఏళ్లలో జనాభా నిష్పత్తులు మారలేదా? గ్రామాల నుండి ప్రజలు పట్టణాలకి, నగరాలకి వలసపోవడం జరిగింది!
2011 లో చివరిసారిగా జనగణన జరిగింది!
ఇప్పుడు డీలిమిటేషన్ చేయవద్దు అనడానికి కారణం ఏమిటీ?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, కేరళ, తమిళనాడు జనాభా తక్కువ కనుక జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల లోక్ సభ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది అని.
25 ఏళ్ళ తరువాత డీలిమిటేషన్ చేస్తే తమ జనాభా పెంచుకొని తగినన్ని సీట్లకి ప్రాతినిధ్యం లభిస్తుందిట! ఉత్తర భారతంలో సీట్లు పెరిగి దక్షిణ భారతంలో సీట్లు తగ్గుతాయని వాదన చేస్తున్నారు!
ఇప్పుడు మాత్రం ఉత్తర భారతం కంటే దక్షిణ భారతంలో సీట్లు ఎక్కువ ఉన్నాయా? 1947 నుండి ఈ వ్యత్యాసం ఉంటూనే వచ్చిందిగా?
1990 వ దశకం వరకూ ఆర్ధికంగా ఉత్తరాది రాష్ట్రాలు పైదశలో ఉన్నాయి. 1990 నుండి దక్షిణాది రాష్ట్రాలు పారిశ్రామికంగా, ఆర్ధికంగా పుంజుకున్నాయి! ఆర్ధిక స్థిరత్వం ఎక్కువగా ఉండడం వలన ఇద్దరు సంతానానికే పరిమితం అవ్వడం జరిగింది… కుటుంబ నియంత్రణ అమలులో దక్షిణాది రాష్ట్రాలు ముందు ఉన్నాయని వాదిస్తున్నారు కానీ భౌగొళిక స్వరూపం గురుంచి ఎవరూ మాట్లాడడం లేదు. జమ్మూ కాశ్మీర్ తో మొదలయినప్పుడు ఒకరంగా మధ్యలోకి రాగానే వెడల్పుగా కన్యాకుమారికి వచ్చేసరికి సన్నగా ఉంది భారతదేశ భౌగొళిక స్వరూపం! గంగా, యమునా, బ్రాహ్మపుత్ర నదుల వెంట జనాభా ఎక్కువ ఉండడం సహజం!
ఉత్తర భారతంలో మొదటి నుండి జనాభా ఎక్కువే! కుటుంబ నియంత్రణ అనే పదాన్ని వాడకుండా భౌగొళిక స్వరూపం అంటే లాండ్ మాస్ ఎక్కువ!
రాజ్యాంగ స్ఫూర్తి అనే పదాన్ని వాడే ప్రతిపక్షాలు అదే రాజ్యాంగంలో పొందుపరిచిన జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజకవర్గం ఉండాలి అనే కదా పొందుపరిచింది! దానిని వ్యతిరేకిచడం రాజ్యాంగ వ్యతిరేకం కాదా?
డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయి ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయి… అవునా?
ఆంధ్రప్రదేశ్ MP సీట్లు 25 కాగా జనగనణ తరువాత 20 సీట్లు అవుతాయి!
తెలంగాణా MP సీట్లు 17 కాగా 15 అవుతాయి.
కర్ణాటక MP 28 ఉంటే 26 అవుతాయి.
తమిళనాడు MP సీట్లు 39 కాగా 30 అవుతాయి.
కేరళ MP సీట్లు 20 కాగా 14 అవుతాయి!
****
అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పుడున్న సీట్ల సంఖ్యని తగ్గించము కానీ వాటి పరిధి లేదా బౌండరీలు మారుస్తాము అని ప్రకటించారు.
*******
ఇక ఉత్తరప్రదేశ్ లో 80 MP సీట్లు ఉండగా అవి 92 అవుతాయి.
బీహార్ లో 40 MP సీట్లు ఉండగా అవి 50 అవుతాయి.
మధ్యప్రదేశ్ లో MP సీట్లు 29 ఉండగా అవి 34 అవుతాయి.
రాజస్థాన్ లో MP సీట్లు 25 ఉండగా అవి 32 అవుతాయి.
గుజరాత్ లో MP సీట్లు 26 ఉండగా అవి 28 అవుతాయి.
**********
అమిత్ షా మాటలు, కేంద్ర ఆలోచనల ప్రకారం… డీలిమిటేషన్ తరువాత దక్షిణాది రాష్ట్రాలలో MP సీట్లు తగ్గవు! వాటి పరిధిలో మార్పు ఉంటుంది అంతే!
అస్సామ్ లో పెరగవు తరగవు. పశ్చిమ బెంగాల్ లో 4 సీట్లు తగ్గుతాయి.
పైన పేర్కొన్న గణాంకాలు ప్రొజెక్టెడ్. జనగణన జరిగిన తరువాత అసలు సంఖ్య తెలుస్తుంది.
********
సదరు కుల, కుటుంబ పార్టీల నేతలు భయపడేది దేనికి? ఉత్తరప్రదేశ్ లో 92 లోక్ సభ స్థానాలు అవుతున్నందుకు!
మనకి స్వాతంత్య్రం వచ్చిన దగ్గరి నుండి ఉత్తరప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ అయితే ఎక్కువ సీట్లు గెలుస్తుందో అదే పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వస్తున్నది!
ఉత్తరప్రదేశ్ లో ఎంపీ సీట్లు 80 నుండి 92 అవుతాయి. బీజేపీకి ప్రస్తుతం ఉన్న పట్టుని చూస్తే 2029 లో కూడా ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ స్థానాలు గెలుస్తుంది!
*******
ఉత్తరాది పెత్తనం అనే వాళ్లు కాంగ్రెస్ కి చెందిన రేవంత్ రెడ్డిని, కర్ణాటకకి చెందిన dk శివకుమార్ ని ఎందుకు పిలిచినట్లు? రాహుల్ నో, ప్రియాంక నో పిలవవచ్చుగా?
ఇక అదే పనిగా టీవీ చర్చలు పెట్టి గగ్గోలు పెడుతున్న తెలుగు మీడియా 1975 ఎమర్జెన్సీ సమయంలో 2001 వరకూ డీలిమిటేషన్ జరగకుండా అక్రమంగా రాజ్యాంగం సవరించింది ఎవరు అని ఎందుకు మాట్లాడరు?
డీలిమిటేషన్ జరిగితే నియోజకవర్గ స్వరూప స్వభావాలు మారతాయి. తమకి అనుకూలంగా ఓట్లు వేసేవారు పక్క నియోజక వర్గంలోకి వెళతారు!
ఇప్పటివరకూ ముస్లిం వోటర్లని ఒక వ్యూహం ప్రకారం కొన్ని నియోజకవర్గాలలో మోపు చేశారు. డీలిమిటేషన్ తరువాత వాళ్లు చీలిపోయి రెండు నియోజకవర్గాల పరిధిలోకి వెళ్ళిపోతే అది తమ అభ్యర్థుల గెలుపు ఓటములని ప్రభావితం చేస్తాయి!
అసలు దక్షిణాది రాష్ట్రాలలో సీట్ల సంఖ్య తగ్గదు అని అమిత్ షా చెప్పినా వీళ్ళు రచ్చ చేస్తున్నారు అంటే అది కేవలం ఉత్తరప్రదేశ్ లో పెరిగే సీట్ల గురుంచే!
ఇక ప్రత్యేక ద్రవిడదేశం అనేది 2014 లో ప్రత్యేక తెలంగాణా ఇస్తారు అన్నప్పటినుండే తెలుగు తమ్ముళ్లు మొదలుపెట్టారు! ఇప్పుడు బిజెపితో పొత్తులో ఉన్నారు కాబట్టి మీడియా చేత చర్చలు పెట్టి రచ్చ చేస్తున్నారు!
2014 కి ముందు TRS వాళ్లు ప్రత్యేక ద్రావిడ దేశం నినాదంని పట్టించుకోలేదు కాని ఇప్పుడు గంగుల లాంటి వాళ్ళ చేత అనిపిస్తున్నారు! ప్రత్యేక దేశం అంటే వచ్చే లాభనష్టాల గురుంచి తెలుసా వీళ్లకి..?
మోడీ 2020 లో కొత్త పార్లమెంట్ భవనం కడుతున్నప్పుడు తెలీదా వీళ్ళకి? 888 సభ్యులు కూర్చోవడానికి వీలుగా కొత్త పార్లమెంట్ భవనం కట్టారు, అదీ 2026 లో డీలిమిటేషన్ జరుతుంది అప్పుడు సీట్ల సంఖ్య పెరిగినా కొత్త భవనం సరిపోతుంది అనే ఉద్దేశ్యంతోనే!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తరువాత brs, aap పార్టీలు ఓడిపోయాయి! ఇప్పుడు తమిళనాడు లిక్కర్ కుంభకోణం బయటపడ్డది కాబట్టి ఏదో విధంగా రాజకీయ బేరం చేసుకోవడానికే ఇదంతా! ఇది తెలిసే మమత దూరంగా ఉంది తన రాష్ట్రంలో 2 సీట్లు తగ్గుతున్నా కూడా…
ఇక ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ కూడా దూరంగా ఉన్నాడు! Dk శివకుమార్ చెన్నై వచ్చాడే కానీ అన్యమనస్కంగా ఉన్నాడు. కేరళ విజయన్ ఏమీ సంతోషంగా కనిపించలేదు, అతని సమస్యలు అతనికి ఉన్నాయి!
ఒరిస్సా నుండి పట్నాయక్ లైవ్ వీడియోలో చెన్నైతో మాట్లాడాడు కానీ పట్నాయక్ తరువాత బిజు జనతాదళ్ ని ఎవరు నడుపుతారు? తమిళ్ నాడు కేడర్ IAS ఆఫీసర్ పాండ్యన్?
అంతా కుటుంబ పార్టీల అతుకుల బొంత! ప్రజాధనం వృధా తప్పితే వచ్చే హైదరాబాద్ మీటింగ్ కూడా సాధించేది ఏమీ ఉండదు!
(కరణ్ థాపర్ మరో విషయం చెబుతున్నాడు.. కేరళ సగటు ఎంపీ సీటు వోటర్లు 18 లక్షలు కాగా, రాజస్థాన్‌లో 33 లక్షలు… సో, గతం అంతా అస్తవ్యస్తం…)
Share this Article