ఎస్.., ఈ మతవాద, ఈ మనువాద, ఈ ఛాందసవాద బీజేపీని ఏమాత్రం నమ్మడానికి వీల్లేదు… విశ్వాసఘాతక పార్టీ అది… మొత్తం ద్రోహచింతనే… వీసమెత్తు స్నేహనిబద్దత లేదు… ఆడినమాటకు కట్టుబడే నైజమే కాదు… కాకపోతే ఏమిటండీ… మొన్నమొన్ననే కదా డార్జిలింగులో భేటీ వేయించింది… అప్పటి గవర్నర్ ధనకర్‌ను అప్పటికే అక్కడికి పంపించి, అక్కడికే అస్సోం సీఎం హిమంత విశ్వనూ రప్పించి, ఆ సమయానికి మమతను పిలిపించి కూర్చోబెట్టారు కదా…
చాయ్ తాగారు, బిస్కెట్లు తిన్నారు… మంచీచెడూ మాట్లాడుకున్నారు… మంతనాలు చేశారు… ఇంద్రప్రస్థం మీద కన్నేసిన ఆమె బీజేపీ రాయబార ఎత్తుగడులన్నింటికీ తలవూపింది కదా… గవర్నర్‌ను కాస్తా ఉపరాష్ట్రపతి అభ్యర్థిని చేస్తామంటే సరేనంది కదా… తెల్లారిలేస్తే పిచ్చికోతుల్లా కొట్లాడినా సరే, చివరకు ఆ గవర్నరుడు ఉపరాష్ట్రపతి అయ్యేందుకు వీలుగా, తను వోటింగుకు దూరం ఉంటానని కూడా ప్రకటించింది కదా… ఒప్పందాలు ఎలాంటివైనా కట్టుబడి ఉండటం మమత నైతికత…
అసలే బీజేపీ అంటే ఈడీలను, సీబీఐలను ఉసిగొల్పడంలో నంబర్ వన్ అంటారు కదా… విపక్షం కోణంలో దుర్వినియోగమో, ఆ పార్టీ కోణంలో సద్వినియోగమో జానేదేవ్… ఇక ఆ శారదా చిట్‌ఫండ్ స్కామ్ వంటి ఇంకా కెలకరనీ మమత ఆశించడంలో తప్పులేదు కదా… కానీ ఏం జరిగింది..? మళ్లీ ఈడీ రంగంలోకి దిగింది… ఓ మంత్రి పార్థాచటర్జీ అనుచరిణి అర్పితాముఖర్జీ ఇంటిపై పడింది… దుర్మార్గం కదా…
Ads
పరిశ్రమలు, వాణిజ్య శాఖ చూసే పార్థా చటర్జీయే కాదు, విద్యామంత్రి ప్రకాశ్ అధికారి, విద్యామండలి మాజీ అధికారి మాణిక్ భట్టాచార్యల ఇళ్లపైనా దాడులు చేసింది… అర్పిత ఇంట్లో 20 కోట్ల నగదు కట్టలుకట్టలుగా దొరికింది… ఇదే పార్థా చటర్జీ విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయ నియామకాల్లో సాగించిన అక్రమాల డబ్బు అని ఈడీ అనుమానిస్తున్నదట… ఎంత అన్యాయం..? ఒక మంత్రి తన పని తనను చేసుకోనివ్వదా ఈ బీజేపీ ప్రభుత్వం..?
అసలు మమత ప్రభుత్వం జోలికి పోకూడదు కదా… ఏదో సదరు మంత్రి నాలుగు డబ్బులు సంపాదించుకుంటే ఇంత కుళ్లుబోతుతనమా..? దేశంలో వేల కోట్లు దిగమింగి, ఈడీలను పంపిస్తే భయపడతామా, పంపించు, బస్తీమే సవాల్ అంటుంటే, వాళ్లను వదిలేసి… రహస్య ఒప్పందాలకు దిగిన మమత సర్కారును బదనాం చేయడం బీజేపీ నైతికతారాహిత్యానికి నిదర్శనం…
ఇంకో మంత్రి ఉన్నాడు… రవాణా మంత్రి ఫిర్హాద్ హకీమ్ ఆరోపిస్తూనే ఉన్నాడు… తమ పార్టీ నాయకులను వేధించాలన్నదే బీజేపీ ధ్యేయమని చెబుతూనే ఉన్నాడు… అరె, డబ్బు దొరుకుతుంది భయ్, 20 కాదు, 30 కోట్లు దొరుకుతయ్, ఓ మంత్రి లావాదేవీలు లభించే అడ్డాలో 20 కోట్లు దొరకడం ఏ లెక్కా, పత్రమా…? 20 కాకపోతే 40 ఫోన్లు దొరుకుతయ్… విదేశీ కరెన్సీ దొరుకుతుంది, అక్రమ సంపాదనకు ఆధారాలు కూడా దొరుకుతయ్… అవన్నీ లేకుండా ‘‘ఇష్యస్ సెటిల్’’ చేయడం ఎలా మరి..? ఈ ఈడీలకు, బీడీలకు ఆమాత్రం అర్థం కాదా..?
వద్దు, మమతక్కా వద్దు… ఇలాంటి నమ్మకద్రోహ పార్టీలతో ఒప్పందాలు సరికావు… వాళ్లు వినరు… నీ పాత పంథాయే కరెక్టు… బజారుకెక్కి, సైఅంటేసై అనడమే కరెక్టు… హమ్మా… ఇలా రాష్ట్ర మంత్రుల పనితీరును డిస్టర్బ్ చేయడానికి పూనుకుంటే ఇక దేశంలో ఫెడరల్ స్పిరిట్ ఎక్కడున్నట్టు..? ఫెడరల్ స్పిరిట్‌ను తుంగలో తొక్కుతున్న బీజేపీ డౌన్ డౌన్… అధికారంలో ఉన్న ఏ మంత్రిపై గానీ, ఏ ముఖ్యమంత్రిపై గానీ, వాళ్ల బినామీలపై గానీ ఈడీ, సీబీఐ, ఐటీ ఎట్సెట్రా ఎవరూ దాడులు చేయకుండా కఠినమైన చట్టం ఒకటి తీసుకురావాలని ఉద్యమించాలి మమతక్కా… కమాన్…
నువ్వు పోరాడు… ప్రతి విపక్షం నీకు బాసటగా నిలుస్తుంది… గ్యారంటీ… అంతెందుకు..? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ముఖ్యుల నుంచి కూడా నీకు మద్దతు ఖాయం… అసలు సిసలు విపక్ష ఐక్యతకు ఇప్పుడు శ్రీకారం చుట్టాలి… డిమాండ్లు… 1) రాజకీయ నాయకులపై పెట్టబడిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి… 2) ప్రజాప్రతినిధుల ఇళ్లల్లో దొరికిన డబ్బును వాపస్ చేసేయాలి… 3) ఏ స్థాయి ప్రజాప్రతినిధి అయినా సరే ఈడీ, సీబీఐ దాడుల నుంచి మినహాయింపు ఇవ్వాలి… జై మమతక్క… జైజై మమతక్క…
Share this Article