.
సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా సరే… అధికార పక్షం మీద ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి… తప్పుల్ని ఎండగడుతూ ఉంటాయి… మన ప్రజాస్వామిక వ్యవస్థలో అది సహజమే, అవసరమే… మంచినీ తప్పుపట్టే ధోరణి తప్ప..!!
కానీ ప్రతిపక్షమే మరో ప్రతిపక్షాన్ని తూర్పారపడితే..? తోటి ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాకాల్ని కడిగేస్తే..? ఇంట్రస్టింగు..! తెలంగాణలో బీజేపీ కాస్త మొదటిసారి బీఆర్ఎస్ మీద టోన్ పెంచింది… అదీ విలీనం, అవగాహన వంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో..!!
Ads
ఇప్పుడు తెలంగాణలో టాపిక్ ఏమిటి..? పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల వాటాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, బాధ్యుల వైఫల్యాల గురించి కదా… హరీష్ రావు ఏదో పీపీటీ అన్నాడు, సగం దాచి, తమ వైఫల్యాల్ని దాచి ఏదో చెప్పుకున్నాడు, సరే…

మరోవైపు ప్రభుత్వం కూడా అంతకుముందే పీపీటీలో పాత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిన జలద్రోహం గురించి సోదాహరణగా చెప్పుకొచ్చింది… సరే… మేమేం తక్కువ అన్నట్టుగా బీజేపీ కూడా రంగంలోకి వచ్చింది… ఇరిగేషన్ సబ్జెక్టు మీద మంచి అవగాహన, అనుభవం ఉన్న వెదిరె శ్రీరాంకు ఆ పని అప్పగించింది…
ఆయన ఎవరు..? తను మహారాష్ట్ర జలవ్యవహారాల సలహాదారు, కేబినెట్ హోదా… ఇదే కృష్ణా బేసిన్‌లో మహారాష్ట్ర కూడా భాగస్వామియే… తను గతంలో నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ కమిటీకి చైర్మన్, కేంద్ర జలవనరుల శాఖకు పదేళ్లపాటు సలహాదారు… (ఆయన భార్య సీమకు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా 2018లో జగన్ అవకాశం ఇచ్చాడు)…

తనకు నదీజలాలకు సంబంధించి అవగాహన ఉంది… తనే క్లియర్ కట్‌గా చెప్పాడు, తెలంగాణకు కేసీయార్ చేసిన ద్రోహం ఎలాంటిదో… ‘ఇచ్చంపల్లి, కాంతనపల్లి, తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టులు చేపట్టకపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదం… కాళేశ్వరం డిజైన్ పెద్ద బ్లండర్… ఒకవైపు ఏపీ ప్రభుత్వం వందల కృష్ణా జలాల్ని స్టోర్ చేసుకునే ప్రాజెక్టులపై కాన్సంట్రేట్ చేస్తే, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కృష్ణా ప్రాజెక్టులపై నిర్లక్ష్యం కనబరిచింది…
పాలమూరు- రంగారెడ్డికి 5 అనుమతులు సాధించినట్టు బీఆర్ఎస్ చెప్పుకుంటోంది కానీ ఏ ప్రాజెక్టుకైనా హైడ్రాలిక్, పర్యావరణ అనుమతులే ముఖ్యం… అవి సాధించలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం… బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు వాటర్ డ్రా సామర్థ్యాన్ని 4.3 నుంచి 13.7 టీఎంసీలకు పెంచుకుంది…

కేవలం ఒక్క సంవత్సరం కోసమే కేసీయార్ 299 టీఎంసీల వాడకానికి సంతకం చేసినట్టు బీఆర్ఎస్ చెబుతోంది గానీ 2015 నుంచి 2020 వరకూ అదే కొనసాగింది… పోనీ, ఆ 299 టీఎంసీల్లో డిండి, నెట్టెంపాడు, ఎస్ఎల్‌బీసీ, పాలమూరు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌లకు ఏమైనా కేటాయింపులు వచ్చాయా అంటే అదీ లేదు…
మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్‌ను సోర్స్ వారీగా పంపించాలని కేంద్రం అడిగితే తెలంగాణ ప్రభుత్వం జిల్లాల వారీగా పంపింది, అందుకే అది వాపస్ వచ్చింది… నల్లమలసాగర్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించింది కేవలం పీఎఫ్ఆర్ (ప్రైమరీ ఫీజుబుల్ రిపోర్టు) మాత్రమే, అదేమీ డీపీఆర్ కాదు…’’

ఇవీ తన పీపీటీలో క్లారిటీలు… ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై నిర్లక్ష్యం చూపించిందని ఆరోపించాడు… నిజమే, అందుకే కదా తెలంగాణ ఉద్యమం, పోరాటం, రాష్ట్ర సాధన… కానీ స్వరాష్ట్రం వచ్చాక కూడా, సొంత పాలనలో కూడా కేసీయార్ పుణ్యమాని జలద్రోహం కొనసాగుతూ పోయిందనే తన విశ్లేషణ అక్షరసత్యం..!!
Share this Article