Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వోట్లేశాక కూడా… వోటర్లకు మందు పోయించిన ‘కృతజ్ఞుడు’…

July 10, 2024 by M S R

‘చుక్క’బళ్లాపూర్ ఎం.పి. చుక్కల ముగ్గు

పోటీచేసే అభ్యర్థులు ఎన్నికలకు ముందు ఒకలా ఉంటారని; ఫలితాలు వచ్చి గెలవగానే చంద్రముఖిలా మరోలా ఉంటారని లోకంలో ఒక అపవాదు ఉంది. అంతదాకా బాబ్బాబూ! అని ఓటర్ల కాళ్లా వేళ్లా పడ్డ అభ్యర్థులు తీరా గెలిచాక నరమానవుడి కంటికి కనపడకుండాపోతారని చెడ్డపేరు ఉంది. ఓటు వేయకముందువరకు ఓడ మల్లయ్య కాస్త ఓటు వేయగానే బోడి మల్లయ్య అవుతాడని లెక్కలేనన్ని అనుభవాలున్నాయి.

కానీ నూటికో, కోటికో ఒక టార్చ్ బేరర్ పుడతాడు. అతడు ప్రజాస్వామ్యాన్ని మలుపు తిప్పుతాడు. ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగి… పది మందికీ ఆదర్శమవుతాడు.

Ads

అలా కర్ణాటకలో మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ నుండి బి జె పి అభ్యర్థిగా గెలిచిన సుధాకర్ హృదయ వైశాల్యానికి, ఉదారతకు, చేసిన మేలు మరవని కృతజ్ఞతకు ఇదొక నిలువెత్తు పులకిత ద్రవ నిదర్శనం.

తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ఓటర్ల రుణం తీర్చుకోవాలని సుధాకర్ గెలిచిన మరుక్షణం నుండి తహతహలాడుతున్నారు. దానికి సరైన సందర్భం దొరకలేదు. పార్టీ కార్యకర్తలు ఆయనకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆ సభలోనే ఓటర్ల రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు ఎం.పి. సుధాకర్. ఆబ్కారీ శాఖకు అధికారికంగా దరఖాస్తు చేసుకుని లారీలకు లారీలు మద్యం బాటిళ్లను తెప్పించారు.

వచ్చినవారు తాగి వెంటనే పడేయడానికి వీలుగా యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ పేపర్ గ్లాసులు వేనకువేలు తెప్పించారు. ద్రవం చుక్కతో పాటు మంచింగ్ ఘనం ముక్కలు కూడా ఘనంగా ఏర్పాటు చేశారో లేదో! వార్తల్లో స్పష్టత లేదు. దయార్ద్ర హృదయంతో చేసే ఉంటారని అనుకోవచ్చు!

తొక్కిసలాట జరక్కుండా ఇనుప కంచెలు, బారికేడ్లు, సాయుధ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. వచ్చినవారందరూ మదర్పిత మద్య మాంస తాంబూలాదులు స్వీకరించి… తృప్తిగా తాగి… తిని… ఊగి… తూగి… మమ్మాశీర్వదింప ప్రార్థన అని మైకులో చక్కగా అనౌన్స్ చేయించారు.

సుధాకర్ కు ఓటేసిన ఓటర్లు సుధారసపానపిపాసులై అమందానందహృదయారవిందులై బుద్ధిగా క్యూలో నిలుచుని కృతజ్ఞతకు ప్రతిఫలంగా గ్లాసుల్లో ఒలికిన ద్రవాన్ని బాధ్యతగా జుర్రుకున్నారు.

ఈ వీడియోలు, చిత్రాలు మిగతా నియోజకవర్గాల్లో ఓటర్లను కన్నుగీటుతున్నాయి. సుధాకర్ లాంటి జానీవాకర్ ద్రవాకర్ ద్రవాలు పోసే ఎంపిలు, ఎమ్మెల్యేలు మాకు లేరే? అని గుండెలు బాదుకుంటున్నారు.

ఆత్మ నిర్భర భారత్ లో డెబ్బయ్ అయిదేళ్లుగా ఓటుకు ముందు మాత్రమే మందు ఉండేది. 2047కు పరుగులు తీసే వికసిత్ భారత్ లో ఓటు తరువాత కూడా మందే ఉంటుందని ఒక బిజెపి ఎంపి నిరూపించాడు!

ఓటుకు ముందూ వెనుక మందు.
మత్తులో ఓటర్ల ఆత్మనిర్భరత్వం.
ఎం.పి. వేసిన చుక్కల ముగ్గులో వికసిత శతదళ శోభల సువర్ణ ‘కమలం’- ఈ ఘనమైన ‘చుక్క’బళ్లాపూర్ ప్రజాస్వామ్య ద్రవోప విజయం! – పమిడికాల్వ మధుసూదన్     9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions