Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ద్వారం ఇప్పుడు ఉత్తరం వైపు తెరిచి ఉన్నది… ఎన్ని రేకలు వికసించునో మరి…

December 3, 2023 by M S R

Vaastu-Tadhaastu: అధికారి చేసే పని ఆధికారికం అయినట్లు- వస్తు సంబంధమయినది వాస్తు అవుతుంది. మాటకు ఆది వృద్ధి రావడం అని ఈ మార్పును వ్యాకరణం సూత్రీకరించింది. అంటే వస్తువుల కూర్పు లేదా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో చెప్పడం అని అర్థం. వాస్తు శాస్త్రం అయి…మూఢ నమ్మకమై…వేలం వెర్రి అయి…చివరకు వాస్తు వేదం కంటే సంక్లిష్టం, గంభీరమై…వాస్తు జ్ఞాన దాడికి అష్ట దిక్కులు దిక్కులేనివై దీనంగా నిలుచున్నాయి.

వాస్తు ఒక శాస్త్రం అవునో! కాదో! కానీ రియలెస్టేట్ వ్యాపారులకు తెలిసినంతగా వాస్తు ఇంకెవ్వరికీ తెలిసి ఉండదు. ఒక లే అవుట్లో, లేదా ఇళ్ల నిర్మాణంలో ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి రేటు ఎక్కువ పెడతారు. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అందునా కార్నర్ అయితే ఇక అది బంగారుగని కంటే ఎక్కువ రేటు. కొనేవారికి కూడా ఈస్ట్ ఫేసింగ్ తరువాత వెస్ట్ ఫేసింగ్ కొంతవరకు ఓకే. నార్త్ ఫేసింగ్ మంచిదే. సౌత్ ఫేసింగ్ నిషేధం.

ఇది ఎంత వేలం వెర్రిగా తయారయ్యిందంటే- ఈస్ట్ ఫేసింగ్ అన్నది సూర్యోదయంతో ముడిపడి ఒక ఆచారంగా పెట్టుకున్నారన్న అసలు విషయాన్ని గాలికొదిలేశారు. ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ముందు వెస్ట్ ఫేసింగ్ ఇల్లో, అపార్ట్ మెంటో అడ్డుగా ఉంటే…సూర్యోదయం అయితే…వెస్ట్ ఫేసింగ్ ఇంటి వెనుకవైపు కిరణాలు పడతాయి కానీ…మనం ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కొన్నామని…మన ముందున్న వెస్ట్ ఫేసింగ్ ఇంటి గోడలు దాటి సూర్యుడు మన ఇంట్లోకి రాలేడు కదా! పైగా ఆగ్నేయంలో వంటిల్లు ఉండాలన్న వాస్తు నియమం ప్రకారం ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ప్రధాన ద్వారం పక్కనే వంటిల్లు వచ్చి తీరుతుంది.

Ads

చీకటి గుయ్యారంగా ఉన్నా…వాస్తు కోసం ఆ కారు చీకట్లో వెలుగులకోసం పరితపించాల్సిందే. ఒకవేళ ఈస్ట్ ఫేసింగ్ ఇంటి వంటింటికి కిటికీ ఉన్నా…ముందు వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఉంటే…ఆ కిటికీ ఎప్పుడూ మూసుకుని…వాస్తు పరవశంలో గాలి ఆడక గిలగిలలాడాల్సిందే. అదే వెస్ట్ ఫేసింగ్ ఇంటికయితే వంటిల్లు ఇంటి మరో చివరి మూలలో అనుకూలంగా…వీలయితే సూర్యకిరణాలు పడుతూ గాలి వెలుగులతో అనుకూలంగా ఉంటుంది.

నైరుతిలో మాస్టర్ బెడ్ రూమ్ మరో వాస్తు ప్రమాణం. నైరుతిలో బరువు తప్పనిసరి. దూలాలకింద సోఫాలు ఉండకూడదట. దూలాలు నెత్తిన పడే రోజుల్లో పెట్టుకున్న ఆచారమిది. ఇప్పటికీ అదే ప్రమాణం. గుమ్మాలకు, ద్వారాలకు, కిటికీలకు వాస్తు లెక్క. నీటి గుంతకు వాస్తు కొలతలు. గుండెపోటు ఉన్నా స్టెంట్లు వేసుకుని బతికి బట్టగట్టి బలుసాకు తిని బతకవచ్చు కానీ…ఇంటికి వీధిశూల, వీధిపోటు ఉంటే బతకలేం.

దిక్కులేనివారికి దేవుడే దిక్కు. ఈ దిగ్భ్రమ మీద కన్నడ శివ కథల్లో అద్భుతమైన కథనం ఉంది. కర్ణాటక శివమొగ్గ  నుండి ఒక యువకుల బృందం శ్రీశైలానికి కాలినడకన బయలుదేరారు. ఇరవై రోజుల పాటు ఆగి ఆగి సాగే పవిత్ర దీక్షా ప్రయాణం. బృందంలో ఒక యువకుడు ఒక రాత్రి అడవిలో దారి తప్పాడు. కాసేపటికి ఒక పల్లె కనపడితే హమ్మయ్య అనుకుని వెళ్లాడు. పూరి గుడిసె అరుగు మీద ముసలి అవ్వ వక్కాకు నమలడానికి వక్కలను దంచుకుంటోంది. అవ్వా! నేను శ్రీశైలం వెళ్లాలి…దారి ఎటు? అని అడిగాడు.

అయ్యో ఇంత రాత్రి…అడవిలో వెళ్ళలేవు. ఈ ఊరి శిథిల శివాలయం మండపంలో పడుకుని ఉదయాన్నే సూర్యోదయాన్ని గమనించి తూర్పు వైపు కాలి బాటలో వెళ్ళు అంటుంది. సరే అలాగే…ఎక్కడుంది ఆలయం? అని అడుగుతాడు. ఇదో నేను కాళ్లు చాచిన వైపే వెళ్లు అంటుంది. శివ శివా! శివుడున్న దిక్కున కాళ్లు చాచావా? మహాపరాధం! అంటాడు. అయితే శివుడు ఏ దిక్కున లేడో చెప్తే…అటువైపే కాళ్లు పెట్టుకుంటా! అంటుంది అవ్వ. పిచ్చిదిలా ఉంది అవ్వ అని విసుక్కుంటూ వెళ్లిపోతాడు. అవ్వ చెప్పినట్లే మండపంలో పడుకుని ఉదయాన్నే తూర్పున కాలిబాటలో వెళితే సాయంత్రానికి శ్రీశైలం వస్తుంది.

గుడి మెట్ల ముందు ఆ అవ్వే వక్కాకు దంచుకుంటూ ఏమి నాయనా ఏ దిక్కున వచ్చావు? అని అడుగుతుంది. ఆ అవ్వలో యువకుడికి పరమశివుడు దర్శనమిస్తాడు. అన్ని దిక్కుల్లో ఉన్నవాడు, నాకు దిక్కై ఇలా దిగివచ్చినవాడు- అని అవ్వకు నమస్కారం చేసి పొంగిపోతాడు యువకుడు.

ఆ అవ్వ(శివుడు)అడిగిన ప్రశ్న-
“ಶಿವ ಯಾವ ದಿಕ್ಕಿಗೆ ಇಲ್ಲ ಹೇಳಿ-
శివుడు ఏ దిక్కున లేడో చెప్పు”
అనంతర కాలంలో శివభక్తులకు పెద్ద దిక్కు అయ్యింది.

వాస్తు పిచ్చి ముదిరిన సందర్భాల్లో కర్ణాటకలో, కర్ణాటక- ఆంధ్ర సరిహద్దుల్లో ఈ శివవ్వ చెప్పిన దిక్కున్న కథ చెప్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ బీ జె పి ప్రధాన కార్యాలయానికి ఈ కథ చెప్పడానికి ఏ శివవ్వ దిగి రావాలో?

కార్యాలయం తూర్పు ద్వారం అచ్చిరాలేదని…తూర్పు ద్వారాన్ని మూసేసి…ఉత్తర ద్వారాన్ని తెరిచారట. వారు నమ్మే వాస్తు ప్రమాణం ప్రకారం చూసినా…ఉత్తర దిక్కుకు కుబేరుడు అధిపతి. అధికారానికి కాదు. అధికారం రాకపోయినా డబ్బొస్తే చాలు అనిగానీ…ఆ డబ్బు అధికారంతో ముడిపడి ఉంటుంది కాబట్టి…అధికారం ఉత్తరద్వారం గుండా బై డీఫాల్ట్ వస్తుందని గానీ…ఇందులో అంతరార్థం అయి ఉండాలి.

అన్నట్లు-
కర్ణాటకలో బీ జె పి కి ఎదురుదెబ్బ తగిలేసరికి మళ్లీ లింగాయతులే దిక్కని ఎడ్యూరప్ప కొడుకు రాఘవేంద్రను కర్ణాటక బీ జె పి అధ్యక్షుడిని చేశారు- పార్లమెంటు ఎన్నికల్లో అయినా పరువు కాపాడుకోవాలని. ఆ రాఘవేంద్రకు ఈ శివవ్వ కథ బాగా తెలిసి ఉంటుంది. తెలంగాణ బీ జె పి కి దిక్కుల అసలు వస్తుబోధ చేసేవారెవ్వరు?
బాగా నడుస్తున్న బండి చీల ఊడబెరికి…చక్రం లేని బండిని తోలుతూ…కమల రథచక్రం విమలగతి తప్పదని అనుకునేవారిని ఉత్తర ద్వారం మాత్రం ఎంతకని కాపాడుతుంది? -పమిడికాల్వ మధుసూదన్ 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions