గట్టిగా ఓ పట్టుపడితే… బీజేపీ కాంగ్రెస్ నిట్టనిలువునా చీల్చి, హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవడం పెద్ద కథేమీ కాదు… కానీ అలా చేస్తే అంతకుమించిన నీచరాజకీయం మరొకటి ఉండదు… బీజేపీ ఫ్యాన్స్ 17 స్థానాల్లో కేవలం 1000 లోపు మెజారిటీతో కాంగ్రెస్ గెలిచిందనీ, నిజానికి బీజేపీదే బలుపనీ చెప్పుకోవచ్చుగాక… కానీ గెలుపు గెలుపే… రెండుమూడు వోట్లతో గెలిచినా గెలుపే… ఈ దిక్కుమాలిన సమర్థనల్ని కట్టిబెట్టడం మేలు… హిమాచల్ ఓటరు ‘ఒరేయ్, నీకు పాలన చేతకాదురా…’ అని ఈడ్చి తన్నాడు… అంగీకరించాలి…
పైగా గుజరాత్‌లో 100 స్థానాల్లో బీజేపీ 1000 ఓట్ల లోపు మెజారిటీతో గెలిచిందనీ, ఎంఐఎం లేకపోతే బీజేపీకి చేదు ఫలితాలే ఉండేవనే కాంగ్రెస్ ఫ్యాన్స్ ప్రచారానికి తావిచ్చినట్టయింది… మళ్లీ ఆ కాంగ్రెస్ ఫ్యాన్సే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ ఆప్ చీల్చిందనీ లేకపోతే కథ వేరే ఉండేదనీ విశ్లేషణలు చేసుకుంటున్నారు… అది మరీ నాన్సెన్స్… నిజంగానే హిందూ ఓట్ల సంఘటన గుజరాత్‌లో బీజేపీ ఘనవిజయానికి కారణం… దీన్ని బ్రేక్ చేయడానికి ఆప్ విశ్వప్రయత్నం చేసి, రెండు రాష్ట్రాల్లోనూ ఫెయిలైంది…
ముందు నుంచీ చెప్పుకుంటున్నదే కదా… గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల్లో సహకరించడానికి ఖలిస్థానీ, యాంటీ హిందూ సెక్షన్లు లేవు కదా… అదీ ఆప్ ఫెయిల్యూర్‌కు కారణం… గత ఎన్నికల్లో పంజాబ్‌లో ఆప్ గెలుపు జస్ట్ ఓ బలుపు… వాపు కాదు… ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆప్ విజయాన్ని ఆహా ఓహో అని రాసుకొచ్చే పిచ్చి మేధస్సులు మరోరకం… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఏ రేంజ్ గెలుపు సాధించిందో తెలుసు కదా, మరి ఆ ఘనతతో పోలిస్తే ఇప్పుడు తన బలం తగ్గినట్టా..? పెరిగినట్టా..? కాంగ్రెస్ క్షీణదశలో బీజేపీ మాత్రమే ఆప్‌కు దీటుగా నిలబడగలిగింది…
Ads
హిమాచల్ ఓటరు తనకు ఎప్పటి నుంచో అలవాటైన పద్ధతిలోనైనా సరే… ప్రతీ ఎన్నికల్లోనూ ప్రతిపక్షానికి చాన్స్ ఇద్దాం అనే పద్ధతికి కట్టుబడి ఉన్నా సరే… దాన్ని బ్రేక్ చేయడంలో బీజేపీ ఫెయిల్… అక్కడ అసలు పార్టీకి ఓ మంచి నాయకుడు లేడు అనేది నిజం… ఆ పార్టీ పాలన తీరు తమకు కాంగ్రెస్ ఇక అవసరం లేదని హిమాచల్ ఓటరు భావించేలా చేయలేకపోయింది… ‘కాంగ్రెస్ ముక్త భారత్’ దిశలో తన వైఫల్యం ఏమిటో బీజేపీకి అర్థం అవుతున్నదో లేదో మనకు అర్థం కాదు… ఇప్పటికీ ఉత్తరాదిలో కాంగ్రెస్ ఓ బలమైన శక్తి, సరైన నాయకత్వం లేక చతికిలపడుతోంది గానీ దాని వేళ్లు బలంగానే ఉన్నాయి… వాటిని పెరికివేయడం అంత వీజీ కాదు… కాంగ్రెస్ హిమాచల్ గెలుపు చెప్పిన పాఠం అదే…
నో డౌట్, 182 సీట్లకుగాను 156 స్థానాల్లో గెలవడం అంటే గుజరాత్‌లో బీజేపీ గెలుపు ఖచ్చితంగా ప్రశంసనీయం… అనూహ్యం… యాంటీ హిందూ, యాంటీ బీజేపీ సెక్షన్ల మొహాలు మాడిపోయాయి… పాలనలో మెరుపులు ఏమీ లేకపోయినా సరే, బీజేపీ ఇన్నేళ్లుగా పాలనలో కొనసాగడం, పైగా ఇప్పుడు అద్భుతమైన గెలుపు సాధించడం చిన్న విషయమేమీ కాదు… వీసమెత్తు ప్రభుత్వ వ్యతిరేకత లేదని కాదు అసలు అర్థం… బీజేపీయేతర పార్టీల యాంటీ హిందూ రాజకీయాల్ని ఓటర్లు అర్థం చేసుకుని, చావుదెబ్బ కొట్టడం…
కానీ ఇదే వర్క్‌ను బీజేపీ హిమాచల్‌లో చూపించలేకపోయింది… అంతేనా..? పలు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఒకటీఅరా గెలుచుకోగలిగింది… ఏతావాతా ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు తేల్చేదేమిటీ అంటే… జాతీయ స్థాయి విస్తరణ కోణంలో ఆప్‌కు అంత పెద్ద సీన్ ఏమీ లేదు, కాంగ్రెస్ మినహా ఉత్తరాదిలో బీజేపీకి వేరే బలమైన ప్రతిపక్షం లేదు… సో, మోటూభాయ్, పార్టీలను చీల్చి, ఎమ్మెల్యేలను కొని రాష్ట్రాల్లో అధికారాన్ని బదాబదలు చేసే దందా అలవోకగా చేసేయడం అలవాటైన మీరు హిమాచల్‌ను కొన్నాళ్లు వదిలేయండి… చేతనైతే కాంగ్రెస్ అవసరం లేదు అనే స్థితిని క్రియేట్ చేయండి, అది సంస్థాగతంగా మరింత బలపడటం ద్వారా మాత్రమే… కొనుగోళ్ల ద్వారా మాత్రమే కాదు…!
Share this Article