నిన్నంతా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీ జంప్ మీద బోలెడు వార్తలు… టీవీల్లో, పత్రికల్లో, పత్రికల డైనమిక్ ఎడిషన్లలో, సోషల్ మీడియాలో ఊదరగొట్టేశారు… తనేదో పెద్ద రాష్ట్ర స్థాయి నాయకుడైనట్టు… వెంటనే విశ్లేషణలు… ఒక నాగం, ఒక కోమటిరెడ్డి, ఒక జిట్టా ఎట్సెట్రా ఎవరినీ బీజేపీ కాపాడుకోలేదనీ, డీకేఅరుణ, కొండా, వివేకా ఎట్సెట్రా కీలకనేతలు కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్‌లోకి పారిపోతున్నట్టు రాతలు…
కొందరైతే మరీ ముందుకెళ్లి, అసలు కోమటిరెడ్డి బీజేపీలోకి రావడమే ఓ కోవర్టు ఆపరేషన్ అని తేల్చేశారు… ఆయన ఇప్పుడు రెచ్చిపోయి కేసీయార్‌ను దమ్ముంటే మునుగోడులో పోటీకి రమ్మంటున్నాడు, సవాల్ చేస్తున్నాడు, నేనే గజ్వెల్‌లో పోటీకి వస్తా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటున్నాడు, మళ్లీ తనే ప్రాణమున్నంతవరకూ మునుగోడును వదిలేది లేదంటున్నాడు… అబ్బే, తన పార్టీ జంప్ గురించి నాకు ఒక్క ముక్కైనా తెలియదు, నమ్మండి అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి…
ఎటూ వెళ్లకుండా పార్టీ జెండా మోసిన పొన్నాల కాంగ్రెస్‌కు చేదు… ఇలాంటి కోమటిరెడ్డి కాంగ్రెస్‌కు తీపి ఇప్పుడు… అసలు ఏం ఆశించింది కోమటిరెడ్డిని బీజేపీలో చేర్చుకుని… వేల కోట్ల కంట్రాక్టులు ఇచ్చి మరీ ఆకర్షించిందట… ఏం ఫాయిదా…? అందుకే అనేది, తెలంగాణ బీజేపీకి ఓ దశ లేదు, ఓ దిశ లేదు… చాలాఏళ్లు తెలుగుదేశానికి తోకగా మార్చి, పార్టీని తెలంగాణలో ఎదగకుండా చేశారు… ఇప్పుడేమో ఇదుగో ఇలాంటి అడ్డదిడ్డం నిర్ణయాలతో కాస్తో కూస్తో పెరిగిన జోష్‌నూ చంపేస్తున్నారు…
Ads
పార్టీకి దూకుడు నేర్పిన బండి సంజయ్ తొలగింపు… ఆ పాత కిషన్‌రెడ్డికే మళ్లీ బాధ్యతలు… అసలు తను ఏనాడైనా బీఆర్ఎస్ మీద దూకుడు ప్రదర్శించాడా..? పార్టీ సభ్యత్వాలు, పార్టీ కార్యక్రమాల్లో ఏమైనా ఉత్సాహం కనిపించిందా..? ఒక ఉదాహరణ… కల్వకుర్తిలో ఆచారి చాలా స్వల్ప తేడాతో ఓడిపోతున్నాడు… ఎటూ పార్టి మారడు… కమిటెడ్ కార్యకర్త… అలా పార్టీ జెండాను ఎన్నాళ్లుగానో మోస్తున్న బోలెడు మంది ఉన్నారు… వాళ్లను ఎంకరేజ్ చేస్తూ, మద్దతుగా నిలబడుతూ పార్టీ బలం పెంచిందెక్కడ..?
సిద్ధాంతరాహిత్యం నిలువునా పులుముకుని వేరే పార్టీల నుంచి వచ్చి చేరే అవకాశవాదులకే పెద్ద పీట ఎందుకు వేస్తున్నట్టు..? ఏబీవీపీ, బీజేవైఎంల నుంచి కూడా ఎదిగిన కమిటెడ్ కార్యకర్తలు పనికిరారా..? ఇప్పటికీ టీబీజేపీ పయనం అలాగే ఉంది… పవన్ కల్యాణ్ 33 సీట్లు అడిగాడట… 8 నుంచి 10 సీట్లు ఇచ్చేద్దాంలే అంటున్నాడట అమిత్ షా… తెలంగాణ ఏర్పాటు చేస్తే 11 రోజులు నిద్రాహారాలు మాని బాధపడ్డ పవన్ మీద ఎందుకు తీపి..? పైగా తన కార్యక్షేత్రం ఏపీ… తెలంగాణలో ఏమిటీ పితలాటకం..? ఎందుకు తన ఎదుట సాగిలబడటం..? హార్డ్ కోర్ బీజేపీ సానుభూతిపరులకూ మింగుడుపడని పరిణామాలు ఇవన్నీ…
ఇన్నాళ్లూ కేసీయార్‌పై మీద ఏదో పోరాడినట్టు నటించి, ఇప్పుడు తనతో ఏం ఆశించి తెర వెనుక దోస్తానా చేస్తున్నట్టు..? రేప్పొద్దున కేంద్రంలో అవసరమైతే మద్దతు ఇస్తాడనేనా..? తను కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నిధులు ఇచ్చినట్టు ఆరోపించేదీ బీజేపీయే… తను విపక్ష సారథ్యం ఇస్తే మొత్తం విపక్ష ప్రచార ఖర్చు నేనే భరిస్తానని కేసీయార్ యాంటీ బీజేపీ స్టాండ్‌తో వెళ్లినట్టు పాత్రికేయులే చెబుతున్నారు…
సంతోష్ వంటి పెద్ద నేతలనూ బజారుకు లాగడానికి ప్లాన్లు వేయలేదా కేసీయార్..? మరి తనను ఎందుకు నమ్ముతున్నట్టు..? ఇక్కడ కేసీయార్ తప్పేమీ లేదు, అది తన పొలిటికల్ స్ట్రాటజీ… గమనించలేక చేతులు కలపడం బీజేపీ బ్లండర్… దక్షిణాన పార్టీకి బలం లేదు అంటూనే, చాన్స్ ఉన్న తెలంగాణలో చేజేతులా చంపుకోవడం దేనికి..? కేరళ, తమిళనాడు, ఏపీలలో శుద్ధ దండుగ… మరి తెలంగాణపై ఏమిటీ ప్రణాళికరాహిత్యం..?
Share this Article