== స్టాక్ మార్కెట్ నల్ల త్రాచు == హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ షేర్స్ ను షార్ట్ సెల్లింగ్ చేసిన నేపథ్యంలో ఇప్పటి తరానికి అంతగా తెలియని గతంలో జరిగిన ఒక పెద్ద షార్ట్ సెల్లింగ్ ఘటన గురించి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో అందరికీ బాగా గుర్తున్నవి రెండు స్కాంలు మాత్రమే. ఒకటి హర్షద్ మెహతా, రెండు సత్యం కంప్యూటర్స్. హర్షద్ మెహతా, నేను సహఉద్యోగులం, ఒకే సమయంలో ఒకే కంపెనీలో పనిచేసాము. ఎప్పుడూ కలవలేదనుకోండి. నేను పనిచేసిన కంపెనీలో ఆయన రికార్డ్ క్లర్క్ కింద పనిచేశారు. కింద నుంచి రెండో స్థాయి ఉద్యోగం. ఆయన బాంబేలో నేను హైదరాబాదులో.. అలాగే సత్యం రామలింగరాజు గారు నేనూ ఒకే జిల్లా వారం. వీరిని మాత్రం మూడుసార్లు కలిశాను.
ఇప్పుడు అదానీ షేర్స్ ఉదంతం స్టాక్ మార్కెట్ ను ఒక ఊపు ఊపుతున్నది కానీ ఇంతకు ముందు జరిగిన ఇలాంటి సంఘటనతో పోలిస్తే ఇది టీ కప్పులో తుఫాను లాంటిది. మొన్నమొన్నటి వరకు భారతదేశంలో చాలా ఏళ్ళు అత్యంత ధనికుడిగా పేరు పొందిన ముఖేష్ అంబానీ తండ్రి గారైన ధీరుభాయి అంబానీ vs నల్ల త్రాచుపాముగా పేరు తెచ్చుకున్న ఒక స్టాక్ బ్రోకర్ కి మధ్య జరిగిన ఆసక్తికరమైన షార్ట్ సెల్లింగ్ యుద్ధం గురించి అందరు మర్చిపోయారు.
మను మానెక్ ముంద్రా (Manu Manek Mundra) ఈ పేరు విన్నవాళ్ళు పెద్దగా ఉండకపోవచ్చు. ఇతని వ్యక్తిగత వివరాల గురించి బయట ప్రపంచానికి తెలిసింది అతి తక్కువ. ఎంత తక్కువ అంటే అతని నిర్ధారిత ఫోటో (అతనే అని నిర్ధారణగా చెప్పలేని ఫోటోలు ఒకటీరెండు కనిపిస్తుంటాయ) కూడా లభ్యం కానంత. అందుకే ఈయనకు స్టాక్ మార్కెట్ నల్ల త్రాచు అనే పేరు వచ్చింది.
Ads
ఈయన పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబం, మరణం వంటివి ఏవి కూడా ప్రపంచానికి తెలియవు అంటే వినడానికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనే ఈయన అంటూ ఒక ఫోటో ఉంది కాని అది నిజంగా ఆయనే అన్నది ఎవరూ నిర్ధారించేవారు లేరు. ఉజ్జాయింపుగా 1948-52 ప్రాంతంలో పుట్టారు అంటారు. గత శతాబ్దంలో స్టాక్ మార్కెట్‌ను శాసించారు ఆయన. కలకత్తాలో జన్మించారు, వ్యాపారవేత్త, స్టాక్ బ్రోకర్ అని అప్పట్లో చాలా మంది విన్నారు కానీ ఆయన్ని కలిసినవారు అతి తక్కువ.
ఈ మధ్యనే స్వర్గస్థులైన స్టాక్ మార్కెట్ అత్యంత పెద్ద మదుపుదారు రాకేష్ ఝంఝన్ వాలా, రాధాకిషన్ దామాని ఆయన దగ్గర శిక్షణ పొందారు అంటారు. ఇద్దరూ కూడా షార్ట్ సెల్లింగ్ లో పేరుపొందినవారే. రాధాకిషన్ దామాని 1990లో షార్ట్ సెల్లింగ్ ద్వారా బాగా సంపాదించారు. 1995లో హెచ్డిఎఫ్సి ప్రజలకు మొదటిసారి షేర్స్ విడుదల చేసినప్పుడు హెచ్డీఫ్సీ (HDFC) బ్యాంకులో ఆయన అతిపెద్ద వాటాదారుడు. ఇప్పుడు మనందరికీ తెలిసిన డిమార్ట్ ఆయనదే. ఇప్పుడాయన ఆస్తి ₹ 90,000 కోట్ల పైనే. ఈయన హర్షద్ మెహతా స్కాం సమయంలో షార్ట్ సెల్లింగ్ ద్వారా వందల కోట్లు సంపాదించారు.
ఈ మను మానెక్ 1980 దశకంలో రిలయన్స్ కంపెనీ షేర్స్ తో ఒక ఆట ఆడుకునేందుకు ప్రయత్నించి, ధీరుభాయి అంబానీ తెలివితేటల ముందు ఆ రోజుల్లోనే కొన్ని వందల కోట్లు నష్టపోయాడు.
అంబానీ ఓ వ్యూహకర్త, లొసుగుల అన్వేషి
ధీరుభాయి అంబానీ వ్యాపార దక్షత చిన్న వయసులోనే బయటపడింది. మొదట పెట్రోల్ బంకులో పనిచేసి, ఆ తరువాత యెమెన్ దేశ రాజధాని అయిన అడెన్ లో అప్పట్లో చలామణిలో ఉన్న నాణ్యాలను అధిక మొత్తంలో సంపాదించి, ఆ నాణ్యాలను కరిగించి, వాటిలో ఆ రోజుల్లో ఆ నాణ్యాలలో అధికమొత్తంలో ఉండే వెండిని వేరు చేసి, లండన్ బులియన్ మార్కెట్ కు ఆ కరిగించిన వెండిని తరలించి, అమ్మి ధనం సంపాదించారు. Aden లో మార్కెట్లో నాణ్యాల కొరత సృష్టించాడీ మహానుభావుడు. ఎంతగా కొరత సృష్టించాడంటే ఆ దేశ ప్రధాన బ్యాంకు ఒక కమిటీ వేసి దేశంలో నాణ్యాల కొరత ఎందువల్ల ఏర్పడింది అని నిజానిజాలు తెలుసుకునేంతగా…
ఆయన చేసినపని చట్టవిరుద్దం కాదు కనుక దేశ బహిష్కరణ శిక్ష విధిస్తే, ఆ సంపాదించిన డబ్బుతో భారత దేశం చేరుకున్నారు ధీరుభాయి. యెమెన్ దేశం ఆయన్ను తరిమేసి బోల్డు నష్టపోయినట్లే, యెమెన్ దేశం వల్ల మరియు “తొంసే మాధవ్ అనంత్ పాయి” (T.M.A PAI, సిండికేట్ బాంక్ వ్యవస్థాపకులు, ఆయన ధీరుభాయి అంబానీకి నూలు yarn లైసెన్స్ ఇప్పించడం వల్ల రిలయన్స్ ఎదుగుదల ప్రారంభమైంది)కి భారతదేశం ఎంతో రుణపడి ఉంది. పాయి గారు లైసెన్స్ రాజ్ సమయంలో లైసెన్స్ ఇప్పించడం వల్ల రిలయన్స్ అంటే సామాన్య ప్రజలకు తెలిసింది.
ఆయన సృష్టించిన సంపద, ఉద్యోగాలు, ఆయన సంస్థ మీద ఆధారపడ్డ తెరవెనుక పరిశ్రమలు వారి ఉద్యోగులు.. లెక్కకట్టలేని విలువైన సేవలు అందించారు దేశానికి. ఇంకా అందిస్తున్నారు కూడా. ప్రస్తుతం రిలయన్స్ సంస్థ ₹17,000 కోట్ల ఆదాయపు పన్ను కడుతోంది ఏడాదికి. ధీరుభాయి అంబానీ మొదటినుంచి చట్టాలలోని లొసుగులు పట్టుకుని, వాటి ఆధారంగా గొప్ప పారిశ్రామిక వేత్తగా, ధనికుడిగా ఎదిగిన వ్యక్తి. అదికూడా భారత దేశంలో లైసెన్స్ రాజ్ వ్యవస్థ ఉన్నప్పుడు. సామాన్యమైన విషయం కాదు అలా చేయడం.
లొసుగుల్ని వాడటం అంటే అక్రమాలు చేయడం కాదు
చట్టాలలోని లొసుగు అంటే అక్రమాలు చేయడం కాదు. దానికి ఒక ఉదాహరణ చెబుతాను. ఆయన రిలయన్స్ పరిశ్రమ విస్తరిస్తున్న కొద్దీ అధునాతన యంత్రాలు విదేశాల నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది. అప్పట్లో విదేశాల నుంచి యంత్రాలు దిగుమతి చేసుకుంటే సుంకం అధికంగా ఉండేది. ఆయన తెలివిగా సుంకం తక్కువుగా ఉండే యంత్రాల విడిభాగాలను తెప్పించుకునేవారు. అన్ని భాగాలు వచ్చిన తరువాత పూర్తి యంత్రాన్ని బిగించుకునేవారు. ఉదాహరణకు ఒక యంత్రం ఖరీదు 5 కోట్లు అయితే సుంకం 15కోట్లు ఉండేది. (300 శాతం సుంకం). మొత్తం కలసి ఒక యంత్రం 20 కోట్లు అయ్యేది. అదే యంత్రాన్ని విడిభాగలుగా తెప్పించుకుంటే సుంకం 50% మాత్రమే. అంటే ఇరవై కోట్లు ఖరీదు చేసే యంత్రాన్ని చట్టబద్ధంగా ఆయన ఏడున్నర కోట్లకు తెప్పించుకునేవారు. ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.
ఆయన రిలయన్స్ సంస్థ పెట్టుబడి కోసం దేశంలోనే అత్యధిక మొత్తంలో IPO ద్వారా చిన్న మదుపుదార్లను వాటాదారులుగా ఆకర్షించి అలా ఆయన షేర్లను కొన్న చిన్న మదుపుదార్లు లబ్ది పొందేటట్టు సఫలీకృతులయ్యారు. అప్పట్లో ఆ విధంగా షేర్ మార్కెట్లో చరిత్ర సృష్టించారు. చిన్న మదుపుదారులు ఎక్కువ సంఖ్యలో ఉండేసరికి సంవత్సరాంతంలో జరిగే మీటింగ్ లను బాంబేలోని క్రికెట్ స్టేడియంలో నిర్వహించేవారు.
డెబ్బైవ దశాబ్దంలో లక్షలాది వాటాదారులు కలిగిన రిలయన్స్ కంపెనీ లాభాల బాటలో పయనిస్తూ వాటాదారులకు ప్రతి ఏటా డివిడెండ్ చెల్లిస్తూ ఉండడం వల్ల అనతికాలంలోనే అన్నివిధాలా స్థిరమైన కంపెనీగా పేరుపొందడం వల్ల కంపెనీ షేర్ ధర పెరుగుతూ వచ్చింది. 1980ల మొదటి సగభాగంలో రిలయన్స్ కంపెనీ మీద మను మానెక్ దృష్టి పడింది. మను మానెక్ అప్పటికే పెద్ద బ్రోకర్ కింద ప్రసిద్ధి చెందారు… (తరువాయి భాగం రెండో పార్టులో చదవండి…) ( ఇది సుబ్రహ్మణ్యం వల్లూరి పోస్టు, మున్నూరు నాగరాజు వాల్ నుంచి ఎత్తుకురాబడింది…)
Share this Article