Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆయన అలా హఠాత్తుగా వెళ్లిపోవడం తెలుగు హాస్యానికి ఓ విపత్తు…

July 21, 2023 by M S R

Taadi Prakash……. July 19 – Black Day for Telugu Humour… తెలుగు సినిమాకి రేలంగి, రమణారెడ్డి… మన రాజకీయాలకీ సాహిత్యానికీ శ్రీరమణ గారు, ఆర్టిస్ట్ మోహన్… విట్, సెటైర్, పన్,పేరడీ , హ్యూమర్, రిపార్టీ… ఏదైనా, సున్నితమైన, సంస్కారవంతమైన హాస్యాన్ని అందించి, గురజాడకీ చాప్లిన్ కీ గుర్తులుగా మిగిలిపోయిన వాళ్ళు వీళ్ళిద్దరే! శ్రీరమణ, మోహన్ దారుణమైన స్నేహితులు. ఒకళ్ళంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. “మోహన్ చనిపోవడం నాకు పర్సనల్ లాస్” అన్నారు శ్రీరమణ నాతో. పట్టపగ్గాల్లేని తెలుగు వాక్యానికీ, మెరుపు లాంటి విరుపుకీ, వెక్కిరింతకీ, హద్దుల్లేని హాస్యానికీ తండ్రి లాంటి శ్రీరమణ వెళ్ళిపోవడం… తెలుగు సాహిత్య ప్రేమికులందరికీ ఒక జాతీయ విపత్తు. 2011లో 60 ఏళ్లు నిండినపుడు మోహన్ కి శ్రీరమణ గారిచ్చిన కానుక ఈ వ్యాసం …..

— TAADI PRAKASH



ఆయనో బెరుముడా ట్రయాంగిల్..
———————————- sriramana
వెంకట్రామా అండ్ కో… సోలెడు బియ్యం వండుకో… పప్పు తినీ పండుకో – అనే తెలుగు రైమ్ ను మా చిన్నప్పుడు వుత్సాహంగా పాడుకుంటూ వుడేవాళ్ళం. దీనికో నేపథ్యం వుంది (నేను నేపథ్యం అనే మాటని ఎక్కడోక్కడ గురిచూసి వెయ్యాలని కొన్నేళ్ళుగా ప్రయత్నిస్తున్నా. ఇన్నాళ్టికి పడింది. థాంక్ గాడ్! . అప్పట్లో మా వాచకం పుస్తకాలన్నీ వెంకట్రామా పేరుమీదే వుండేవి. వీళ్ళు కదా బొత్తులు బొత్తులు అచ్చుకొట్టి అభం శుభం తెలియని మా మీదకు వదిలిందని మహా మంటగా వుండేది. పవరుపేట, ఏలూరు అని కూడా అట్టల మీద వుంటం వల్ల ఇప్పటికీ ఏలూరు నాలిక మీద వుండిపోయింది.
అర్టిస్ట్ మోహన్ కూడా అదే ఏలూరు అనేసరికి మా అనుబంధం అరవై ఏళ్ళదిగా పెనవేసుకుంది. పాతిక ముప్పై ఏళ్ళనాడు మొదటిసారి కలిసినప్పుడు మోహన్ కొత్తగా అనిపించలేదు. కనిపించలేదు.

మాట్లాడుతూన్నప్పుడు యీయన ఆచితూచి మాట్లాడతాడని అర్థమైంది. అదేంకాదని, మాట తీరే అంతని నిలకడ మీద గ్రహించాను. నాకు కొత్తగా అనిపించిందల్లా మోహన్ గీత. ఆకారాలు, అక్షరాలు, కొడవళ్ళు కొడవళ్ళుగా కనిపించేవి. ధిక్కారం ధ్వనించేది. మోహన్ అంటే కమ్యూనిస్టు భావాలున్న ఆర్టిస్ట్ అని బెజవాడ మిత్రులు నన్ను హెచ్చరించారు. వాళ్ళంతే, ఏదీ సూచించరు. హెచ్చరిస్తారు. పదేళ్ళ తర్వాత దీన్నే “సామాజిక స్పృహ” అంటారని గుంటూరు మిత్రులు ట్రాన్స్ లేట్ చేసి చెప్పారు.

Ads

ఎంతైనా వ్యక్తీకరణలో గుంటూరుకో మర్యాద, హుందాతనం వుంటాయి. మాది గుంటూరే! ఆనక నేను హైదరాబాదు వచ్చాక ప్రతి అడ్డమైన చోటా మోహన్ సంతకం దృగ్గోచరం కాసాగింది. నేనాయన కళను ఎంతగానో యిష్టపడ్డాను. అంతగానూ అభిమానించాను. లేకుంటే దృగ్గోచరం అనే శబ్దం వాడను. యుగం ఏదైనా, పాత్ర పౌరాణికమైనా, జానపదమైనా ఆ సామాజిక స్పృహ మోహన్ని వదలదు. భీముడైనా, కృష్ణుడైనా, బకాసురుడైనా యీసురోమంటూ ఎముకలు బయటేసుకుని జాలిగా కనిపిస్తారు. హనుమంతుడికి సముద్రం దాటేప్పుడు బోలెడు ఎక్స్ ప్రెషన్స్ని పెడతారు మోహన్.

అది తన పని కాదు. తన రాజుది రాజ్యానిది అంతకంటే కాదు. మరెందుకింతటి దుస్సాహసానికి ఒడికట్టాలి? కట్టాలి. అంతే! జాంబవంతుడు లాంటి సీనియర్స్, “నీకు కెపాసిటీ వుంది.. వుంది” అంటూ ధూపం వేసి ఎగిరేదాకా కేకలేస్తూనే వున్నారు. కాబోలనుకుని హనుమంతుడు లంఘించాడు. అదే మరి కమ్యూనిజమ్ అంటే. అందరూ ఒక్కడి టాలెంట్ ని వెలికితీయడం! మోహన్ ఆ కోతి మొహంలో యీ ఇజాలన్నింటిని దర్శింపచేస్తారు. అదీ ఆయన కమిటెడ్ ప్రతిభ.

అప్పుడెప్పుడో “నీహార్ ఆన్ లైన్” అని ఒక పోర్టల్ పుట్టింది. దాని అనకొమ్మ సరసమ్ డాట్ కామ్. వారం వారం ఇరవై వెబ్ పేజీలు. అయ్యబాబోయ్! కడుపుబ్బి నవ్వుకునే హాస్యం, వ్యంగ్యం, అవహేళన, పేరడీలు, గారడీలు వుండేవి అందులో. శ్రీరమణ అక్షరాలకు తన రేఖా విలాసంతో గంధపు పూతలు పెట్టేవారు మోహన్. సంపన్న దేశాలలో తెలుగు వచ్చినవారు , రానివారు కూడా ముందాశ్చర్యపోయి తర్వాతనే నవ్వుకున్నారు. ఇందుకు లక్షలాది క్లిక్కులే సాక్ష్యం.

దాదాపు వంద వారాల పాటు కొనసాగిన యీ మా జుగల్బందీ అనితర సాధ్యం. అసలిప్పుడు మాకే అసాధ్యం. అదొక్కొక్క సమయం. ఇప్పుడు కేసిఆర్ తెలంగాణ సాధించాలంటే అసాధ్యం. నాడది నల్లేరు మీద బండి. నాడు మోహన్ తో కలిసి ఆ బండిని కేక్ వాక్ గానే నడిపించాను. ఇది ఎప్పటికీ నాకో మంచి జ్ఞాపకం. దరిమిలా ఆంధ్రజ్యోతి (డైలీ) ఆదివారం చిలకలపందిరిలో మళ్ళీ మా డ్యూయట్ సాగింది. అదికూడా వన్స్ మోర్ అనిపించుకుంది.

మోహన్ అందరిలా ఆలోచించడు. ఒకలా కాకుండా మరోలా ఆలోచిస్తాడు. భావప్రకటనలో తెగిస్తాడు. శివుడు సైతం తలపాగాలో కొడవలి దోపుకుని కనిపిస్తాడు. మోహన్ మంచి రచయిత. పదునైన వచనం రాయగలరు. శైలి సమ్మోహనంగా వుంటుంది. రకరకాల సాహిత్యాలు బాగా చదివిన అనుభవం లేకపోతే అలాగ రాయలేరు. మోహన్ వ్యక్తుల గురించి రాస్తున్నా, పుస్తకానికి ముందుమాట రాస్తున్నా పొగడ్తలు చాలా పొదుపుగా వాడతారు. అందుకని నాకు మరీ యిష్టం. ఆర్ట్ మీద ఆర్టిస్ట్ ల మీద మోహన్ వ్యాసాలు చదివేవారికి ..

అర్థమై కావల్సినవారికి కొంచెం వుపయోగపడతాయి. మెచ్చినా మెచ్చకున్నా, అందరికీ నచ్చినా నచ్చకపోయినా తన శైలి తనదే! నా “వెంకట సత్యస్టాలిన్” జ్ఞాపకాల పాతరకి బొమ్మలు వేసిచ్చారు – ముఖచిత్రంతో సహా. పుస్తకం యింకా రాలేదు. సత్యస్టాలిన్ చాలా గొప్ప ఆల్ రౌండర్. మోహన్ యింతగా ఎదగడానికి సత్యస్టాలిన్ దోహదపడ్డాడేమో తెలియదు.

కవళికల్లో మోహన్ కి అడవిదొంగ వీరప్పన్ కి చాలా పోలికలు కనిపిస్తాయి. నైజం విషయం అంటారా నాకు వీరప్పన్ తో ఎక్కువ పరిచయం లేదు.

అయితే మోహన్ కి సొంత అడివి వుంది. అందులో ఎందరో నటవిటగాయక ప్రముఖులు వర్థమానులు వున్నారు. ఇక కుంచెలవారు నిబ్బులవారు సరేసరి. అడివిలో తిరుగాడుతూ, దొరికినచోట దప్పికలు తీర్చుకుంటూ, చిరుమేతలు మేస్తూ జంగిల్ పాటిస్తూ కనిపిస్తారు. అక్కడ పగలూ రాత్రీ తేడా తెలియదు. వేటాడక తిండి దొరకదు. అక్కడ నీ నా బేధం లేకుండా సీసా నించి సిస్టమ్ దాకా వినియోగానికి గురి అవుతూవుంటాయి. మోహన్ వునికి బెరుముడా ట్రయాంగిల్ లాంటిది. లాగేస్తది.

మోహన్ కోరి తయారు చెయ్యకపోయినా కనీసం ఓ పాతిక మంది ఆర్టిస్టులు ఆయన లైట్ అండ్ షేడ్ లో తయారయారు. పీఠాధిపతికి వుండే స్థాయి ఆయనకు వుంది. కొందరు సమున్నత స్థాయిలో బొమ్మలు వేస్తూ పేరు తెచ్చుకున్నవారు వున్నారు. కాని బొమ్మలు వేసేవేళ మీసాలు పీక్కునే చేవాటం మాత్రం అందరికీ అబ్బింది. అది భావితరాలకు కూడా పాకుతుందని ఆశిద్దాం.

రాష్ట్రంలో వుప్పెనల్లా వచ్చిన వుద్యమాల వెనక మోహన్ పోస్టర్లు వున్నాయి. జెండా నడవదు, కాని నడిపిస్తుంది. కారికేచర్లు, కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు గీయడంలో మొదటి స్థానాలు ఆయనవే. అభిమానాలకూ, ఆపేక్షలకూ అర్థం తెలిసినవాడు. అందరూ అభిమానించే చిత్రకారుడు మోహన్. వర్థిల్లుగాక! – శ్రీరమణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions