.
బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యేల అనర్హత మీద గొంతుచించుకునే నైతిక అర్హత ఉందా..,? ఇదీ తెలంగాణ సమాజంలో మండుతున్న ఓ ప్రశ్నే… అసలు తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను పరాకాష్టకు తీసుకుపోయిందే కేసీయార్ కదా…
మధ్యేవాద పార్టీలనే కాదు… సోకాల్డ్ నొటోరియస్ లెఫ్ట్ పార్టీలనూ వదల్లేదు… అసలు బీఆర్ఎస్ తప్ప మరో పార్టీయే ఉండకూడదనే అప్రజాస్వామిక, నియంత పోకడలతో కదా నానా ప్రయత్నాలు, ప్రలోభాలు… చివరకు సైద్ధాంతిక నిబద్దత అని పదే పదే చెప్పుకునే పార్టీల సభ్యులను కూడా పొల్యూట్ చేసి, పార్టీ మార్పించి, లేదా కోవర్టులుగా మార్చుకుని… ఎన్ని, ఎన్నని, ఎన్నెన్నని…
Ads
ఇప్పుడు నైతికత, నీతులు వల్లెవేస్తున్నది… పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతల మీద సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కాసేపు వదిలేద్దాం… అది బాల్‌ను మళ్లీ స్పీకర్ కోర్టులోకే తోసేసింది… ఆ చర్చలోకి ఇక్కడ వెళ్లదలుచుకోలేదు…
కానీ గతం ఓసారి పరిశీలిద్దాం… బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ జనం తెలివి మీద చీప్ అభిప్రాయం ఉంటే ఉండవచ్చుగాక… మనం ఎల్లకాలమూ తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్గగలం అనే ఓ పిచ్చి అభిప్రాయం నిలువెల్లా ఉండవచ్చుగాక… కానీ..?
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్‌ను అనైతికంగా మంత్రిని చేసింది ఎవరు..? ప్రస్తుతం గొర్ల స్కీములో ప్రధానంగా ఈడీ వేలెత్తి చూపిస్తోంది… ఏ కేసీయార్ తెలుగుదేశాన్ని ఆగర్భ శత్రువుగా పరిగణించి, చంద్రబాబును ఇక్కడి నుంచి తరిమేశాడో, ఆ చంద్రబాబు అనుంగు అనుచరుడు కాదా..?
2014లో కాంగ్రెస్ నుంచి 21 మంది గెలిస్తే అందులో ఏడుగురిని లాగేసుకోలేదా..? ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చనిపోతే, అమల్లో ఉన్న రాజకీయ మర్యాదల్ని మంటగలిపి, పోటీకి పెట్టి, కాజేసింది బీఆర్ఎస్ కాదా..? తెలుగుదేశం నుంచి 15 మంది గెలిస్తే అందులో 12 మందిని నానా ప్రలోభాలకూ గురిచేసి లాగేసుకున్నది ఎవరు..? వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని లాగేసింది ఎవరు..? బీఎస్పీ నుంచి ఇద్దరు గెలిస్తే లాగేసుకుని, ఒకరిని మంత్రిని చేశారు కదా… చివరకు సీపీఐని కూడా వదల్లేదు కదా… కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు ఇద్దరిని కూడా… ది గ్రేట్ మల్లారెడ్డి, సుఖేందర్‌రెడ్డిలను…
సేమ్, శాసనమండలి సభ్యులనూ వదల్లేదు… 12 మంది కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు… ఎవరినైనా వదిలారా అసలు..? 2014లో టీఆర్ఎస్ గెలిచినవి 63 అయితే ప్రభుత్వం రద్దయ్యేనాటికి 90 మంది బలం ఎలా వచ్చింది..?
2018 ఎన్నికల తరువాత కూడా ఇదే కదా కథ..? 88 సీట్లతో మంచి మెజారిటీ వచ్చినా కూడా… అదే ప్రలోభాల పర్వం… కాంగ్రెస్ నుంచి 19 మంది గెలిస్తే 12 మందిని లాగేశారు కదా… టీడీపీ నుంచి ఇద్దరు… సబితా ఇంద్రారెడ్డికి రాజీనామా చేయించకుండా మంత్రి పదవి ఇవ్వలేదా..? డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, కే.కేశవరావు, కేఆర్ సురేష్‌రెడ్డిలను గులాబీ క్యాంపులోకి తీసుకోలేదా..?
…… ఇలా చెబుతూ పోతే బోలెడు… ఎప్పుడూ ప్రజాస్వామిక విలువల మీద, ప్రమాణాల మీద ఏమాత్రం గౌరవం లేని కేసీయార్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి కొందరు సభ్యులు వెళ్తే గగ్గోలు, గాయిగత్తర… ఎస్, మనం శుద్ధపూసలం అయితే కదా…
అవును, ఏమైనా అంటే అన్నామంటారు గానీ… గతం చీకట్లను, నలుపును మరిచి… ఇప్పుడు ప్రజాస్వామిక విలువల గురించి, నైతికతల గురించి మాట్లాడితే ఎలా కేసీయార్ సారూ..!!
Share this Article