.
…. హరీష్ రావు క్షుద్రపూజల కలకలం కథనానికి ఇది కొనసాగింపు – 2 భాగం… అసలు క్షుద్ర పూజలు అంటే ఏమిటి..? గత కథనంలో వామాచార పూజల గురించి చెప్పుకున్నాం కదా… ‘షుద్ర’ అనగా నీచమైన లేదా అల్పమైన అని అర్థం. స్వార్థపూరితమైన, హానికరమైన ప్రయోజనాల కోసం చేసే పూజలను క్షుద్ర పూజలు అంటారు.
ఇది ఇతరులకు చెడు చేయడం కోసం ఉద్దేశించినవి… (ఆధ్యాత్మిక, మార్మిక శక్తుల ఔపోసన, ఆవాహన, ప్రార్థన దిశలో భారతీయ విధానాలు అత్యంత సంక్లిష్టమైనవి… సమగ్రంగా రాయాలంటు పుట్టలుపుట్టలుగా పుస్తకాలు రాసినా ఒడవనంత అనంతం) క్షుద్ర పూజలు అంటే భూత, ప్రేత, పిశాచాలు, నిమ్న శక్తులను ఆవాహన చేయడం, నరబలి పోలికలు లేదా జీవహింస, శ్మశానాలలో చేతబడులు చేయడం వంటి గుప్త పద్ధతులు ఉంటాయి. గోప్యత దేనికంటే సమాజం దాన్ని ఆమోదించదు కాబట్టి…
Ads
లక్ష్యం… ఇతరులకు హాని తలపెట్టడం, వశీకరణం చేసుకోవడం, ధనాన్ని అక్రమ మార్గంలో సంపాదించడం లేదా శత్రు నాశనం చేయడం. సమాజానికి, వ్యక్తులకు అత్యంత హానికరమైనది. ఆధ్యాత్మికతకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఇది పూర్తిగా స్వార్థం, దుష్ట సంకల్పంతో కూడుకున్నది.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఆరోపిస్తున్నదీ అదే… ప్రధాన ఆలయాలకు సమీపంలోనే ఇలాంటి క్షుద్రపూజల స్థావరాలూ ఉంటాయి, హరీష్ రావు తిరుచ్చి, షిమోగా వెళ్లింది వీటి కోసమే అని…! ఒకవేళ హరీష్ రావు ఈ పూజలు చేసింది నిజమే అయితే… అది తెలంగాణ సమాజానికి నష్టదాయకం… రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్న క్షుద్ర నాటకం అవుతుంది…!
- ఇక్కడ ఓ క్లారిటీ… బ్లాక్ మేజిక్ అని పిలవబడే ఈ తాంత్రిక పూజలు ప్రపంచంలో ప్రతిచోటా ఉన్నాయి… అనేక రకాలుగా… మంత్రగాళ్లు లేని ప్రపంచం, సమాజం ఉందా అసలు..?

సరే, క్షుద్ర పూజలు, కాష్మోరాలను వదిలేస్తే… మరి గుళ్లల్లో చేసే సంప్రదాయ పూజలు ఏమిటిి..? అవి ఆగమశాస్త్ర పూజలు (Agama Shastra Poojas)…
అర్థం…: ‘ఆగమం’ అనగా ఈశ్వర ముఖం నుండి వెలువడిన జ్ఞానం లేదా శాస్త్రం. ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట, నిత్య పూజా విధానాలను శాస్త్రీయంగా నిర్దేశించే గ్రంథాలే ఆగమాలు… శాస్త్ర విహితంగా గుళ్లల్లో దేవుళ్లను ఆరాధించే విధానం ఇది…
ఇది పూర్తిగా వైదిక, తాంత్రిక సంప్రదాయాల సమ్మేళనంతో కూడిన ఆలయ సంస్కృతి. వైఖానస, పాంచరాత్ర (వైష్ణవ), శైవ, శాక్త ఆగమాలు దీనికి ఉదాహరణలు… లక్ష్యం…: భగవంతుని ఆలయాలలో ప్రతిష్ఠించి, లోక కల్యాణం కోసం, భక్తుల మోక్ష ప్రాప్తి కోసం శాస్త్రోక్తంగా అర్చనలు, అభిషేకాలు, ఉత్సవాలు నిర్వహించడం. ఇది పక్కాగా సకారాత్మక ఉపలబ్ధి కోసం…
ప్రత్యేకత…: ఇవి అత్యంత పవిత్రమైనవి, నియమబద్ధమైనవి, సమాజానికి ఆధ్యాత్మిక ధర్మాన్ని పంచే సమూహ పూజా విధానాలు.
మరి దక్షిణాచార పూజలు (Dakshinachara Poojas)? అర్థం…: వేద సమ్మతమైన, శుద్ధమైన, సాత్విక మార్గంలో దేవుడిని ఆరాధించే పద్ధతి. (‘దక్షిణాది’ అనే పదం భౌగోళిక దక్షిణ భారతదేశాన్ని సూచించదు, ఇది తంత్ర శాస్త్రంలో ఒక శాఖ అయిన ‘దక్షిణాచారం’ లేదా సాత్విక మార్గాన్ని సూచిస్తుంది)… విధానం…: ఇందులో ఎలాంటి హింస, మద్యపానం లేదా రహస్య భీకర ఆచారాలు ఉండవు. ధూప, దీప, నైవేద్యాలు, షోడశోపచార పూజలు, జపం, ధ్యానం దీనిలో ప్రధానమైనవి.
లక్ష్యం…: మనశ్శాంతి, భక్తి, ముక్తి, కైవల్యప్రాప్తి, దైవానుగ్రహాన్ని పొందడం…. ప్రత్యేకత…: ఇది పూర్తిగా సాత్వికమైనది, అందరూ ఆచరించదగినది, వేదాలు, ఉపనిషత్తుల నిబంధనలకు లోబడి ఉండే అత్యంత సురక్షితమైన పూజా మార్గం…
- (అసలు ఏయే పూజల్లో ఏ విధానాలు పాటిస్తారు..? ప్రేతాత్మలు వేరు- పితృదేవతలు వేరు… అఘోరీలు… తరువాయి కథనంలో… )
Share this Article