Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏది బ్లాకు..? ఏది వైటు..? ఐటీ కన్నేస్తే తప్ప తేలని అసలు రంగు..!

January 25, 2025 by M S R

.

( పమిడికాల్వ మధుసూదన్  9989090018 )    ……… బ్లాకా? వైటా? భాష ఎంత గొప్పదంటే సందర్భాన్ని బట్టి ఒకే మాట అర్థాలు మార్చుకుని హొయలుపోతూ ఉంటుంది.

వ్యాకరణంలో ఏకవచనం ఏకవచనమే; బహువచనం బహువచనమే. మర్యాదలో మాత్రం ఏకచనం తిట్టు; బహువచనం గౌరవం.
నువ్వు, నీవు, నువ్ అని ఎదుటివారితో ఏకవచనంతో మాట్లాడేవారికి సంస్కారం లేనట్లు.
మీరు, వీరు, వారు అని బహువచనం బరువు కలిపితే సంస్కారులు. నిజానికి వ్యాకరణంప్రకారం ఒకరికి బహువచనం వాడడమే తప్పు.

Ads

భాషలో మాటకు
అభిద (వాచ్యార్థం)
లక్షణ (లక్ష్యార్థం)
వ్యంజన (వ్యంగ్యం లేదా ధ్వని)
అని ప్రధానంగా మూడురకాల అర్థాలుంటాయి.

అర్థపరిణామంలో-
అర్థవ్యాకోచం (అర్థం విస్తరించడం)
అర్థసంకోచం (అర్థం కుచించుకుపోవడం) సహజం.

పారిభాషికపదాలు సులభంగా అర్థం కావాలంటే ఉదాహరణలు తప్పనిసరి.

ఉదాహరణకు- నిప్పులు వేడిగా ఉన్నాయి- అన్న మాటలో “నిప్పులు” అభిదార్థం. దాని అర్థం నేరుగా అలాగే వాడడం. నిప్పులు చెరుగుతున్నాడు- అన్న మాటలో “నిప్పులు” లక్ష్యార్థం. నిజానికి అక్కడ నిప్పులు లేనే లేవు. నిప్పు గుణాన్ని ఇంకో వ్యక్తీకరణకు ఆపాదించడం. “అబ్బో! మీరే చెప్పాలి!” అన్నమాటలో “నువ్వేమిటి చెప్పేది? మేమేమిటి వినేది?” అన్నది వ్యంగ్యం. ధ్వని.

నూనె. ప్రాచీన కాలంలో నువ్వుల నుంచి తీసినదాన్నే నూనెగా పరిమితార్థంలో వ్యవహరించేవారు. ప్రస్తుతం వేరుశెనగ, కొబ్బరి, సన్‌ఫ్లవర్ నుంచి తీసిన వాటిని కూడా నూనెగానే సామాన్య అర్థంలో వాడుతున్నారు. ఇది అర్థవ్యాప్తి లేదా అర్థ వ్యాకోచం.

పూర్వం అవ్వ అనే పదాన్ని స్త్రీ అనే సామాన్య అర్థంలో వాడేవారు. ఇప్పుడు కేవలం వృద్ధ స్త్రీ అనే అర్థానికే పరిమితమైంది. ఒకప్పుడు కంపు అంటే కేవలం వాసన. ఇప్పుడది చెడు వాసనకు అర్థసంకోచమయ్యింది.

వీటితోపాటు అర్థ సౌమ్యత లేదా అర్థ గౌరవం, అర్థ గ్రామ్యత లేదా అర్థాపకర్ష, లక్ష్యార్థాలు, కేవల సంకేతార్థాలు, వస్తు పరిణామం, అలంకారిక ప్రయోగం, లోక నిరుక్తి లాంటి అర్థ బేధాలను భాషాశాస్త్రవేత్తలు లోతుగా విభజించి చెప్పారు. ఇంతకంటే లోతుగా వెళ్ళడానికి ఇది భాషాశాస్త్ర పాఠం కాదు. ఒకవేళ వెళ్లినా తెలుగు భాష, భాషాపరిణామం, అర్థాల గురించి బహిరంగంగా మాట్లాడిన నేరం కింద శిక్ష పడే ప్రమాదముంటుంది.

రంగుల ప్రస్తావనల్లో తెలుపు- నలుపు అంటే తెలుపు తెలుపే. నలుపు నలుపే. అదే ఆర్థిక విషయాల్లో తెలుపు- నలుపు అంటే బ్లాక్ అండ్ వైట్. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కు ఎలాంటి సంకోచం లేకుండా మనమే అర్థవ్యాకోచం కలిగించి చక్కగా బ్లాక్ ను బ్లాక్ లో, వైట్ ను వైట్లో అర్థవంతంగా వాడుకుంటున్నాం. లెక్కల్లో చూపకుండా నగదును నగదుగా వాడడం బ్లాక్; బ్యాంకులు ఇతర వ్యవహారాల్లో లెక్కల్లో చూపేది వైట్ అని ఇప్పుడు పాలుతాగే పసిపిల్లలకు కూడా తెలుసు. దీనికి ఈ అర్థవ్యాప్తి మొదట ఎవరు కలిగించారో కానీ…నిత్యం వాడే పారిభాషిక పదాల్లో బ్లాక్ అండ్ వైట్ కు అగ్రస్థానం దక్కింది.

రియలెస్టేట్లో మొదట వినపడేది బ్లాక్ ఎంత? వైట్ ఎంత? అనే. వైట్లో కూడా పన్నులు ఎగ్గొట్టడానికి మళ్ళీ అంతర్గత బ్లాక్ వ్యవహారాలుంటాయి మరీ అంత లోతైన ఆర్థిక విషయాలు ఇక్కడ అనవసరం!

అవినీతి వ్యవహారాలు ఎక్కువగా బ్లాక్ లో కొండొకచో వైట్లో కూడా జరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు వేసుకునేది వైట్ డ్రస్సే కానీ… రాజకీయానికి బ్లాక్ అత్యంత ఇష్టమైన రంగు!

బ్లాక్ అండ్ వైట్లో మొదలైన సినిమాల్లో పేమెంట్లు కూడా బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటాయి. ఈస్ట్ మన్ కలర్ దాటి ఫుల్ 8కె హెచ్ డి కలర్లోకి వచ్చినా పూర్వపు అభిరుచి అయిన బ్లాక్ అండ్ వైట్ పోలేదు!

పెళ్ళిసంబంధాల్లో నలుపు అంటరానిది. కానీ కట్నకానుకల్లో మాత్రం తెలుపు అంటరానిది!

కారు నలుపు ఎలుగుతోలు తెచ్చి ఏడాది ఉతికినా… నలుపు నలుపేగాని తెలుపు కాదన్నాడు వేమన. ఆయన కాలం నాటికి అది నిజమే కావచ్చు. ఇప్పుడు నలుపును తెలుపు (బ్లాక్ ను వైట్ చేసుకోవడానికి) అనేక ఆర్థిక విధానాలున్నాయి. మార్కెట్లో అనేక క్రీములు కూడా ఉన్నాయి. కాబట్టి వేమన చెప్పిన అభిదార్థం; మనం వ్యాప్తి చేసిన లక్ష్యార్థ, వ్యంగ్య ధ్వని అర్థాలన్నీ కూడా నలుపు ముందు తెల్లబోవాల్సిందే!

black money

అన్నట్లు-
“సంక్రాంతికి మేమొస్తున్నాం” అని అనిల్ రావిపూడి అంటే “మేమూ వస్తున్నాం” అని సంక్రాంతికే ఆదాయప్పన్నువారు కూడా వచ్చారట. “నా రెమ్యునరేషన్ తక్కువ. నాదంతా వైటే” అని నీళ్ళు నమలకుండా బహిరంగ వేదికమీదే స్పష్టంగా చెప్పినందుకు నటుడు వెంకటేష్ ను అభినందించాలి.

“రాజు పెద్ద భార్య మంచిది…” అంటే రెండో భార్య మంచిది కాదని ధ్వని. వెంకటేష్ నాదంతా వైట్ అంటే…మిగతావారిది ఏ రంగు? అన్నది భాషలో ధ్వని చూసుకోవాల్సిన పని! మనకెందుకు?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ఇంకేదో కావాలనే’ మోజు, ఆకర్షణల ముందు పాతివ్రత్యాలు బలాదూర్…
  • ఒక తమిళ కణ్ణదాసన్…. ఒక తెలుగు వేటూరి… వేరే పోల్చలేను సారీ…
  • ఇడ్లీ నూడుల్స్ కాదు… అసలు ఇడ్లీ రకమే కాదు…. పక్కా ఇడియప్పం…
  • ఎక్కడిదో ఈ దుఃఖ మేఘం, ఆగకుండా వెక్కి వెక్కి కురుస్తోంది… కానీ..?
  • పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?
  • పెను విధ్వంసం సృష్టించగల ఓ భారీ విపత్తు వేగంగా సమీపిస్తోంది..!!
  • ఆ కేన్సర్ స్పెషలిస్టు… రిటైరయ్యాక సిద్ధవైద్యంలోకి..! ఎందుకు, ఎవరు..?!
  • ఆమెపై హానీట్రాప్… పడిపోయింది… మన రహస్యాలన్నీ చెప్పేసింది…
  • పురూలియా…! అదొక పెద్ద మిస్టరీ… జవాబుల్లేవు… ఆశించడమూ వేస్ట్..!!
  • అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions