అధికారంలో ఉన్నవాడు ఏం చేసినా అనుమానించాలి, ఖండించాలి, వ్యతిరేకించాలి, ఆడిపోసుకోవాలి, అడ్డుకోవాలి….. ఈ దిక్కుమాలిన రాజకీయమే ఈ దేశానికి ప్రధాన శాపం… చిన్న డిస్‌క్లెయిమర్ ఏమిటంటే… బీజేపీ ఏమీ శుద్ధపూస కాదు…!! ప్రతి అంశాన్ని బీజేపీ కోణంలోనే చూసి, మోడీ వ్యతిరేక కోణంలో మాత్రమే ఆలోచించి, ఆర్ఎస్ఎస్ నిర్ణయంగానే ముద్రవేసి, హిందుత్వ-మనువాద ధోరణి అని తేల్చేసి, ప్రజావ్యతిరేకం అని తీర్పు చెప్పేయాలా..? నవీన్ పట్నాయక్ వంటి ఒకరిద్దరు న్యూట్రల్ రాజనీతిజ్ఞులు మినహా ప్రతి సీఎం అలాగే ఉన్నాడు, ప్రతి పార్టీ అలాగే ఉంది… జీఎస్టీకి పునాదులు వేసి, తనే అమలు చేయాలనుకున్న కాంగ్రెస్‌కు అదే జీఎస్టీ మోడీ ప్రవేశపెట్టేసరికి ప్రజావ్యతిరేకంగా కనిపిస్తుంది… బీజేపీ ప్రభుత్వ నిర్ణయం కాబట్టి పౌరసత్వచట్టం దుర్మార్గం అయిపోతుంది, ఎన్ఆర్సీ ప్రమాదపోకడ అనిపిస్తుంది… ప్రత్యేకించి సరిహద్దు రాష్ట్రాల్లోని మమత, అఖిలేష్ వంటి నేతలు ఎప్పుడూ ప్రాబ్లమాటికే… తాజాగా మమత అసెంబ్లీలో ఓ తీర్మానం పాస్ చేయించింది… ఏమిటంటే..? దేశ సరిహద్దుల్లో కేంద్రం బీఎస్ఎఫ్ అధికార పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచింది, దాన్ని వ్యతిరేకిస్తున్నాం… ఇదీ తీర్మానం…
టీఎంసీ వాదన ఏమిటో తెలుసా..? ఇది రాష్ట్రాల హక్కుల్ని హరించడం అట… ఫెడరల్ స్పూర్తిపై దాడి అట… బీజేపీ ప్రయోజనాలు దాగి ఉన్నాయట… ఎవరి నోటికి ఎంతొస్తే అంత… సేమ్, ఇలాంటి తీర్మానాన్నే పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసింది… అక్కడా ఇదే వాదన… (రాజస్థాన్‌లో కూడా ఇలాంటి తీర్మానమే చేయబోతున్నారేమో…) పంజాబ్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి విలేకరులతో మాట్లాడుతూ నిజానికి పోలీసు యంత్రాంగం బోర్డర్‌ను బీఎస్ఎఫ్‌కన్నా సమర్థంగా కాపాడగలదు అన్నాడు… హహహ… అసలు ఫెడరల్ స్పిరిట్ అనేదే ఓ భ్రమాత్మకం, బ్రహ్మపదార్థం… ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వమే అత్యంత బలశాలి, ఆర్టికల్ 356 దగ్గర్నుంచి అనేక సెక్షన్లు, ఆర్టికల్స్ చెప్పేది అదే… అన్నింటికన్నా కీలకమైంది, ప్రధానమైంది బోర్డర్ రక్షణ, దేశభద్రత, సమగ్రత… అబ్బే, కాంగ్రెస్, టీఎంసీలు చెప్పేదే కరెక్టు… బీజేపీ ప్రయోజనాలు ఏవో ఉండే ఉంటయ్ అంటారా..?
Ads
పంజాబ్ వదిలేయండి, బెంగాల్ వదిలేయండి… మరి బోర్డర్‌లో బీజేపీ పాలిత రాష్ట్రాలు లేవా..? చైనా, పాకిిస్థాన్ సరిహద్దుల్లోని పెద్ద రాష్ట్రం యూపీ మాటేమిటి..? ఉత్తరాఖండ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో బీజేపీయే కదా అధికారంలో ఉంది… మమత వాదనే నిజమైతే, ఆ బీజేపీ పాలిత రాష్ట్రాల హక్కుల మీద కూడా కేంద్రంలోని బీజేపీ దాడి చేస్తున్నట్టు భావించాలా..? సరే, ఇవీ వదిలేస్తే… బీఎస్ఎఫ్‌కు ఎక్కువ అధికార పరిధి ఇస్తే కేంద్రంలోని బీజేపీకి వచ్చే ఫాయిదా ఏమిటి..? తమ పరిధిలో అనుమానిత వ్యక్తులను తనిఖీ చేయడం, ప్రశ్నించడం, అక్రమ చొరబాట్లను మరింత కఠినంగా అరికట్టడం, నిఘా వేయడం తప్ప బీఎస్ఎఫ్ ఆ అధికారాన్ని ఏం చేసుకుంటుంది..? అది బీజేపీకి ఏం ఉపయోగపడుతుంది..? సరిహద్దుల్లో రాజకీయాలకు బాగా ప్రభావితమయ్యే స్థానిక పోలీసులకన్నా బీఎస్ఎఫ్ ప్రమాదకారా..? పోనీ, ఇలాంటి తీర్మానాలతో టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలకు వచ్చే ప్రయోజనం ఎంత..? బీజేపీ మీద గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శించుకోవడం తప్ప..!!
Share this Article