గతంలో ఏమో గానీ… ఈమధ్య కన్నడ సినిమా కూడా కథాప్రయోగాలు చేస్తోంది… రొటీన్ ఫార్ములా సినిమాలు గాకుండా కాస్త డిఫరెంట్ కథల్ని ఎంచుకుని రిస్క్ తీసుకుంటున్నారు… రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి ఎట్సెట్రా రీసెంట్ పాపులర్ శెట్టిలలాగే ఇప్పుడు దీక్షిత్ శెట్టి… అదేనండీ నాని హీరోగా చేసిన దసరా సినిమాలో ఓ కీలకపాత్ర చేశాడు, కీర్తి సురేష్ ప్రేమికుడి పాత్ర…
అదుగో తను హీరోగా చేసిన బ్లింక్ అనే సినిమా ఇప్పుడు ఓటీటీలో ఉంది… అమెజాన్ ప్రైమ్… ఏముంది ఇందులో విశేషం అనేయకండి హఠాత్తుగా… ఇది టైమ్ ట్రావెల్ జానర్… దాన్ని కన్విన్సింగుగా ప్రేక్షకుడికి చెప్పడం ఓ టాస్క్… రొటీన్ కథలదేముంది..? రెండు ఫైట్లు, రెండు పాటలు, రెండు కామెడీ బిట్లు, పగలు, ప్రతీకారాలతో లాగించొచ్చు… కానీ సైన్స్, ఫిక్షన్, టైమ్ ట్రావెల్, ఫాంటసీ కలగలిపి కథ రాసుకుంటే, దాన్ని అర్థమయ్యేలా చెప్పగలగడం ఓ సాము గరిడీ…
బ్లింక్… అంటే కనురెప్ప కొట్టుకోవడం… అసంకల్పితంగా, కునుకు పట్టినప్పుడు తప్ప, మెలకువతో ఉన్నంతసేపూ కనురెప్పలు కొట్టుకుంటూనే ఉంటాయి, ఉండాలి, అది కంటికి రక్ష… రెప్పపాటు అంటే కనురెప్ప కొట్టుకునే గ్యాప్… ఈ రెప్పల్లేవ్, పాట్లులేవ్ దేవతలకు, అనగా అనిమేషులకు… అనిమేషులు అంటేనే అర్థం అది… దెయ్యాలకూ ఈ రెప్ప‘పాట్లు’ ఉండవంటారు మరి…
Ads
కథలోకి వస్తే… హీరోకు నువ్వు వెంటవెంటనే రెప్పలు కొట్టుకోకుండా చాలాసేపు ఆపి ఉంచగలవు, అది అరుదైన లక్షణం, నువ్వు నాకు సహకరించు, టైమ్ ట్రావెల్ ప్రయోగాల్లో ఉన్నాను, నీకేం అపాయం ఉండదు, డబ్బులిస్తాను అని ఆఫర్ ఇస్తాడు ఓ వ్యక్తి… హీరో చిన్నాచితకా జాబుల వేటలో ఉండి, ఆర్థిక కష్టాల్లో ఉండి, అప్పుడప్పుడూ ప్రియురాలు చేసే డబ్బు సర్దుబాట్లతో కథ నడిపిస్తూ ఉంటాడు… ఐనాసరే, ఆ వ్యక్తి ఆఫర్‌కు ఒప్పుకోడు, భయం…
నువ్వు నమ్మడం లేదు కదా అంటూ కొన్ని నిజాలు చెబుతాడు ఆ వ్యక్తి, అంతేకాదు, నువ్వు మరణించాడనుకున్న నీ తండ్రి బతికే ఉన్నాడంటాడు… ఈలోపు అచ్చం హీరోలాగే ఉండే మరొకరు వచ్చి, పొరపాటున కూడా వాడి మాటలు నమ్మకు అని హెచ్చరిస్తుంటాడు… అసలు ఎవరు వీళ్లంతా..? ఏంటి రహస్యం..? టైమ్ ట్రావెల్, టైమ్ మిషన్ల గోలేమిటి..? ఇదీ కథ… ఇంట్రస్టింగు కదా…
ప్రజెంట్‌కూ పాస్ట్‌కూ నడుమ కథ అటూఇటూ తిరుగుతూ, ట్విస్టులకు గురవుతూ ప్రేక్షకుడిని కూడా వెంటనే అర్థమయ్యేలా ఉండదు… ఇక్కడే థియేటర్‌కూ ఓటీటీకి నడుమ తేడా… థియేటర్‌లో చూసేస్తే పలుచోట్ల మనకు గ్యాప్ కనిపిస్తుంది… వెనక్కి వెళ్లి చూడలేం కదా… ఈ సినిమాలో ఓటీటీలో ఉంది… ఒకటికి నాలుగుసార్లు రీవైండ్ చేసుకుని చూడాల్సి ఉంటుంది… ఇది ఒకరకంగా థియేటర్‌కు మైనస్… సినిమా చివరి అరగంట ట్విస్టులే ట్విస్టులు… ఓపట్టాన ఎక్కవు… తరువాత మైండ్ బ్లాంక్, అదే బ్లింక్… అవి చూస్తున్నప్పుడు మనం బ్లింక్ (రెప్పలు కొట్టకుండా) ఆపేస్తాం… దాన్ని ‘కళ్లప్పగించి’ అనాలేమో…
డిఫరెంట్, కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే… సస్పెన్స్ ఉంది, ఎమోషన్ ఉంది… కాకపోతే ఇంకాస్త పేరున్న తారాగణం, కాస్త ఎక్కువ బడ్జెట్ ఉండి ఉంటే… ఇంకాస్త బాగుండేదేమో… వీఎఫ్ఎక్స్ సీన్స్ కాస్త నాసిరకంగా ఉంటాయి… ఐతేనేం, కథలో లీనమైతే ఏవీ గుర్తుకురావు… దర్శకుడు అలా లాక్కెళ్తాడు… గుడ్…!!
Share this Article