.
Bhavanarayana Thota …. పాశర్లపూడి నుంచి మలికిపురం దాకా…
కోనసీమ జిల్లా మలికిపురంలో మరో బ్లో ఔట్ పెను సంచలనానికి దారితీసింది. కానీ బ్లో ఔట్ అనగానే మూడు దశాబ్దాల నాటి ప్రమాదం గుర్తుకొస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని రోజుల్లో అక్కడి ప్రజలకు 65 రోజుల తరువాత గాని ఉపశమనం కలగలేదు. ఇంకో మూడు రోజులు గడిస్తే ఆనాటి పాశర్లపూడి బ్లో ఔట్ కు 31 ఏళ్ళు నిండుతాయి.
Ads
1995 జనవరి 8 వ తేదీ….
ఆకుపచ్చటి దుప్పటి కప్పుకున్నట్టు కనిపించే కోనసీమలో మామిడి కుదురు మండలం పాశర్లపూడిలో ఓఎన్జీసీ వాళ్ళ చమురు అన్వేషణలో భాగంగా డ్రిల్లింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో 19 వ సెక్టార్ లో జరిగిన చిన్న పొరపాటు భారీ ప్రమాదమై కూర్చుంది.
ఉదయాన్నే నిద్ర లేచి మంచు ఇంకా తగ్గలేదనుకుంటూనే పనుల్లోకి దిగిన కోనసీమ జనం ఒక భారీ శబ్దంతో ఉలిక్కిపడ్డారు. ఆ టైమ్ లో ఆ శబ్దమేంటో అర్థం కాక అయోమయంగా ఆకాశం వైపు చూస్తున్న జనానికి పైకెగసిన మంట కనిపించింది. మంటకూ శబ్దానికీ సంబంధం ఉండి ఉంటుందన్న అంచనాలో ఉండగానే బిగ్గరగా సైరన్ మోగింది.
ప్రమాదం ముంచుకొస్తున్నదని గుర్తించిన ప్రజలు వణికిపోయారు. బ్లూ ఔట్ అన్నదే కోనసీమ ప్రజలకు ఒక కొత్త అనుభవం. అంతకు ముందెన్నడూ కనీవినీ ఎరగరు.
అలా భయం భయంగా చూస్తూ ఉండగానే ఆ మంట తాకిడికి కొబ్బరి చెట్లు అంటుకొని క్షణాల్లో మాడి మసై పోతున్నాయి. బ్లో ఔట్ జరిగిన ప్రదేశం చుట్టూ ఇదే పరిస్థితి. చుట్టుపక్కల జనం ఇళ్ళు వదిలి పారిపోయారు. ఊళ్ళకు ఊళ్ళు తరలించాల్సి వచ్చింది. రాత్రి పూట కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్ళకు కూడా ఆ అగ్ని కీలలు కనబడుతూ భయపెట్టేవి.
ఓఎన్జీసీ నిపుణులు ఈ బ్లో ఔట్ ను ఆర్పటానికి శతవిధాలా ప్రయత్నించి చేతులెత్తేశారు. ఇక లాభం లేదని విదేశాల నుంచి నిపుణులను రప్పించారు. అలా 65 రోజుల తరువాత గాని బ్లోఔట్ ను పూర్తిగా ఆర్పలేకపోయారు. అంటే మార్చి 15 కు గాని పరిస్థితి అదుపులోకి రాలేదు.
ఈలోపు ఆ మంటల్ని చూడటానికి జనం పెద్ద ఎత్తున తరలిరావటంతో అదొక జాతరలా మారింది. సరదాగా చూడటానికి వచ్చేవాళ్ళ తాకిడి చూసి ‘ఎద్దు పుండు కాకికి ముద్దు’ అన్నట్టు తయారైందని అప్పట్లో అక్కడి బాధితులు అనుకుంటూ ఉండేవారు.
ఇళ్ళు ఖాళీ చేసి వచ్చినవాళ్ళు మళ్ళీ ఎప్పుడెప్పుడు ఇళ్ళకు వెళతామా అని ఎదురు చూస్తూ ఉండేవారు. పత్రికలు రోజూ ఎప్పటికప్పుడు కథనాలు అందిస్తూ ఉండేవి. అప్పటికి తెలుగు శాటిలైట్ చానల్స్ మొదలుకాలేదు.
కానీ చానల్స్ మొదలుపెట్టటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జెమినీ టీవీ ప్రారంభమయ్యే తేదీ ప్రకటించింది. ఈటీవీ మాత్రం ప్రణాళికాబద్ధంగా సినిమాల హక్కుల కొనుగోలులాంటి పనుల్లో బిజీగా ఉంది. ఆ విధంగా బ్లో ఔట్ నాటికి శాటిలైట్ చానల్స్ మొదలుకాలేదు.
కానీ, ఫిబ్రవరిలో ఆ చానల్ మొదలయ్యేనాటికి బ్లో ఔట్ ఇంకా ఆగలేదు. చానల్ లో కేవలం మూడు గంటలపాటు వినోద కార్యక్రమాలు మాత్రమే ప్రసారమవుతూ వస్తున్నాయి. సాయంత్రం 6 నుంచి 9 దాకా జెమినీ ప్రసారాలు వచ్చేవి.
పాటలు. సినిమా సమాచారమే ప్రధాన కార్యక్రమాలు. దర్శకుడు జయంత్ సి పరాంజి ఆధ్వర్యంలో ‘సంతూర్ టాప్ టెన్ ‘( కవిత, ఝాన్సీ, అనితా ఆప్టే) యాంకర్లు గాను, పద్మిని అగర్ బత్తీల వారి ‘సప్తస్వరాలు’ పేరుతో సినీనటి రాశి యాంకర్ గా మరో కార్యక్రమం, డైరెక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ‘డయల్ యువర్ సాంగ్ ‘ అనే కార్యక్రమం అప్పట్లో బాగానే ఆకట్టుకున్నాయి.
‘రంగుల రాట్నం’ పేరుతో నిర్మాణంలో ఉన్న సినిమాల సమాచారంతో స్టుడియో రౌండప్, విడుదలైన సినిమాల మీద సమీక్షలా ప్రేక్షకుల అభిప్రాయాలతోకూడిన ‘స్పందన’ ప్రసారమయ్యేవి.
ఈ ఎంటర్టైన్మెంట్ హడావిడి మధ్యనే బ్లో ఔట్ వీడియో కూడా తీయించి ప్రసారం చేయాలనిపించింది జెమినీ వాళ్ళకి. షూట్ చేయించి తీసుకురావటానికి న్యూస్ సెన్స్ ఉన్నవాళ్ళు కావాలి. అప్పటికే జెమినీలో చేరిన సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ జీకే మోహన్, గీత, అనూరాధ ఇచ్చిన సలహా మీద అఖిలేశ్వరి గారిని సంప్రదించారు.
ఆమె అప్పటికే దాదాపు రెండు దశాబ్దాలపాటు అధ్యాపకురాలిగా, జర్నలిస్టుగా, పరిశోధకురాలిగా పనిచేసి ఉన్నారు. సోవియెట్ యూనియన్ పతనమవుతున్న దశలో అక్కడి పరిణామాలను కవర్ చేసిన జర్నలిస్టులలో ఒకరు. ఆమె భర్త ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు ఈ ముగ్గురికీ బాగా తెలిసినవారు కావటం కూడా అఖిలేశ్వరి గారి ఎంపికకు కారణమై ఉంటుంది.
మొత్తానికి అఖిలేశ్వరి గారిని, ఒక కెమెరామన్ ను రాజమండ్రి పంపారు. అక్కడే ఒక హోటల్ లో బస ఏర్పటు చేశారు. అప్పటికి జెమినీ వాళ్ళ ఆనంద్ రెజెన్సీ హోటల్ మొదలైందో లేదో గుర్తు లేదు. అలా వెళ్ళిన వాళ్ళు నాలుగు రోజులైనా వీడియో కాసెట్ వెనక్కి పంపలేదు. నింపాదిగా రోజూ ఉదయాన్నే పాశర్లపూడి వెళ్ళటం, కొన్ని విజువల్స్ తీసుకోవటం, కొంతమంది ఇంజనీర్లతో, స్థానికులతో మాట్లాడటం, మళ్ళీ హోటల్ రూమ్ కు రావటమే.
నాలుగో రోజు కూడా చూశాక జెమినీ ఆఫీసు నుంచి ఫోన్ చేసి వచ్చేయమని చెప్పాల్సి వచ్చింది. అలా తీసుకువచ్చిన విజువల్స్ అరగంట డాక్యుమెంటరీలా ఎడిట్ చేసి ఆ కాసెట్ మద్రాసుకు, అక్కడి నుంచి సింగపూర్ కి పంపి టెలికాస్ట్ అయ్యేట్టు చూశారు.
ఇక ఈనాడు వాళ్ళది ఇంకో కథ. ఆగస్టు 27 న గాని చానల్ మొదలు కాలేదు. అందువలన అప్పటికప్పుడు టెలికాస్ట్ చేసే వీల్లేదు. అయినాసరే, ఆ వీడియో లైబ్రరీలో ఉండాలన్నది రామోజీ రావు దూరదృష్టి. అందుకే ఆ దృశ్యాలు షూట్ చేసి తీసుకురమ్మని ఆదేశించారు. అప్పటికే ఉషాకిరణ్ సంస్థ ద్వారా సినిమా రంగంలో ప్రవేశించిన రామోజీరావు దగ్గర అలాంటి ఏర్పాట్లకేమీ కొదవలేదు.
ఏకంగా ఒక సినిమాటోగ్రాఫర్ వెళ్ళి షూట్ చేసుకొని వచ్చాడు. తిరిగి వచ్చాక అదే విషయం రామోజీరావుకు చెప్పారు. ఆయన కోపానికి అంతులేదు. టీవీ కెమెరాలో షూట్ చేయటానికి బదులు సినిమా కెమెరాలో షూట్ చేసి తెచ్చారు మరి.
“దీని ప్రాసెసింగ్ ఖర్చెంతో తెలుసా? నిన్ను సినిమా తీయమని చెప్పలేదు. టీవీ కెమెరా తీసుకెళ్ళాలని కూడా తెలియదా? అని విసుక్కున్నారట. ఆ విధంగా ఆ ముడి ఫిలిం అలాగే మిగిలిపోయింది.
కోనసీమ గుండెల మీద చెరిగిపోని చేదు జ్ఞాపకంగా ఇప్పటికీ పాశర్లపూడి బ్లో అవుట్ గురించి చెప్పుకుంటూనే ఉన్నారు. అది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లో అవుట్ గా రికార్డులకెక్కింది. కానీ ఆ వీడియోలు మాత్రం లేవు.
ఇప్పుడైతే మలికిపురం బ్లో ఔట్ ను 24 గంటల శాటిలైట్ న్యూస్ చానల్స్ లైవ్ కవరేజ్ ఇస్తున్నాయి. అందరూ ఎప్పటికప్పుడు అక్కడేం జరుగుతున్నదో తెలుసుకోగలుగుతున్నారు. మూడు దశాబ్దాల్లో ఎంత మార్పు! – తోట భావనారాయణ
Share this Article