.
ఖమ్మం జిల్లా అడవులలో నీలిరంగు పుట్టగొడుగులు… నిజమే, మీరు చదివింది… నీలిరంగు పుట్టగొడుగులు…
మన అడవుల్లో కనిపించే సంపన్న జీవవైవిధ్యం ఇది… తెలంగాణలో పలుచోట్ల పుట్టగొడుగులను పుట్టకొక్కులు అనీ అంటారు… సాధారణంగా తెల్లగా లేదా గోధుమ రంగులో ఉంటాయి కదా… కొన్ని విషపూరితం… కొన్ని సురక్షితం…
Ads
పెంటకుప్పల మీద, ఎక్కడ పడితే అక్కడ పెరిగే వీటిని తినడానికి చాలామంది ఇష్టపడరు… ఇప్పుడంటే వ్యవసాయంలాగే పుట్టగొడుగులను పెంచుతున్నారు… అవి సేఫ్, మన రెస్టారెంట్లలో పాపులర్ డిషెస్ దొరుకుతున్నాయి కూడా…
కొందరేమో దీన్ని మాంసాహారంగా భావించి దూరంగా ఉంటారు… కానీ నిజం ఏమిటంటే..? పుట్టగొడుగులు వృక్షజాతి కాదు, జంతుజాతి కూడా కాదు… ఫంగి, శిలీంధ్రజాతి… సృష్టిలోని జీవ కేటగిరీల్లో ఇది మూడో కేటగిరీ… ఇవి నిజానికి పుట్టగొడుగులు కాదు, పోషకాలపుట్టలు… జంతుజాతి కాదు, మాంసం కాదు…
తాజాగా ఖమ్మం అడవుల్లో కనిపించాయి నీలి పుట్టగొడుగులు కానీ గతంలో ఆదిలాబాద్ అడవుల్లోనూ కనిపించినట్టు వార్తలున్నాయి… బ్లూ పింక్ గిల్ లేదా స్కై బ్లూ మష్రూమ్…
ఈ పుట్టగొడుగుల శాస్త్రీయ నామం ఎంటోలోమా హోచ్‌స్టెట్టెరి (Entoloma hochstetteri). ఇవి ముఖ్యంగా న్యూజిలాండ్‌లో ఎక్కువగా కనిపిస్తాయి… అయితే, ఇప్పుడు తెలంగాణలోని అడవుల్లో కూడా వీటిని గుర్తించడం విశేషం…
ఈ పుట్టగొడుగులకు సాధారణ పుట్టగొడుగుల మాదిరిగా కాకుండా, గులాబీ లేదా ఊదా రంగులో మొప్పలు (gills) ఉంటాయి… వాటి కాండం, టోపీ కూడా అందమైన నీలి రంగులో మెరుస్తాయి. ఈ అరుదైన రంగు కారణంగానే ఇవి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి…
నిజానికి ఎంటోలోమా జాతికి చెందిన చాలా పుట్టగొడుగులు విషపూరితమైనవి… అందుకే, ఈ నీలి రంగు పుట్టగొడుగులు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, వాటిని తినడానికి ప్రయత్నించకూడదని పోషకాహార నిపుణుల, అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు…
చూసి ఆనందించడమే… తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది… న్యూజిలాండ్‌లోని మవోరీ తెగ ప్రజలు ఈ పుట్టగొడుగులను తమ సంస్కృతిలో భాగంగా భావిస్తారు… న్యూజిలాండ్ కరెన్సీ $ 50 నోటుపై కూడా ఈ పుట్టగొడుగు బొమ్మ ఉంటుంది…
Share this Article