Bharadwaja Rangavajhala …… బిఎన్ కొండారెడ్డి . వాహినీ బ్యానర్ లో వచ్చిన కొన్ని సినిమాలకు కెమేరామెన్ గా పనిచేశారు బి.ఎన్ . కొండారెడ్డి . ఈయన స్వయాన బి.ఎన్.రెడ్డిగారి తమ్ముడే. వాహినీలో పోతన అంతకు ముందు వచ్చిన సినిమాలకూ రామనాథ్ గారు పనిచేశారు.
వాహినీ బ్యానర్ ప్రారంభకుల్లో రామనాథ్ గారు ఒకరు కదా.. ఆయన స్క్రీన్ ప్లే రాసేవారు. అలాగే … ఎడిటింగ్ వ్యవహారాలు కూడా చూసుకునేవారు.
ఆర్ట్ డైరక్టర్ శేఖర్ కూడా వాహినీ ప్రారంభకుల్లో ఉన్నారు. నిజానికి అప్పట్లో వాహినీ అని బ్యానర్ లోగో పడ్డ తర్వాత బి.ఎన్.రెడ్డి, రామనాథ్, శేఖర్ ల నిర్మాణము అని ఓ లైన్ పడేది.
Ads
ఈ బంధం ఎక్కడో చెడిందనీ చెప్తారు … పోతన టైమ్ కో అంతకన్నా ముందేనో మూలా నారాయణస్వామి గారు వచ్చారు. పోతన టైటిల్స్ లో మూలా నారాయణ స్వామి సమర్పించు అనే పడుతుంది. ఆ తర్వాత ఆయన వాటాలే నాగిరెడ్డి గారు కొని స్టూడియోలో భాగస్వామి అయి విజయా వాహినీగా మార్చారు.
ఈ గొడవ పక్కన పెట్టేస్తే .. బిఎన్ రెడ్డిగారి ఒక తమ్ముడు నాగిరెడ్డి ప్రింటింగ్ ప్రెస్ యజమానిగా పబ్లిషర్ గా వ్యవహరిస్తూ సినిమాల్లోకి నిర్మాతగా ప్రవేశించారు. అయితే వారి ప్రెస్ కు బిఎన్కె ప్రెస్ అనే పేరుండేది మరి … బి.ఎన్ మరో తమ్ముడు కొండారెడ్డి గారు కెమేరా విభాగంలో పన్జేశారు.
మల్లీశ్వరికి ఇరానీ డీవోపీగా పన్జేశారు. అయితే కెమేరామెన్ మాత్రం కొండారెడ్డిగారే.
కె.వి తీసిన మరో వాహినీ చిత్రం గుణసుందది కథ కు మార్కస్ భార్ట్ లే డీవోపీగా పన్జేశారు. కెమేరామెన్ కొండారెడ్డి గారే . వాహినీ బ్యానర్ లో కె.వి తీసిన పెద్దమనుషులు సినిమాకు మాత్రం కొండారెడ్డే డీవోపీ. ఆ తర్వాత బిఎన్ తీసిన బంగారు పాప, భాగ్యరేఖ, రాజమకుటం చిత్రాలకు పనిచేశారు.
అయితే … పూజాఫలం సినిమాకు మాత్రం రాజగోపాల్ కెమేరా బాధ్యతలు చూశారు. రంగులరాట్రానికీ రాజగోపాలే కొనసాగారు. బిఎన్ చివరి చిత్రం బంగారు పంజరంకు మళ్లీ కొండారెడ్డి గారు డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ చేశారు. అయితే .. ఆ సిన్మాకు ఆయనతో పాటు మణి, మాధవ్ బుల్ బులే కూడా పనిచేశారు…
ఆయన నిర్మాతగా కూడా సినిమాలు తీశారనే విషయం ప్రపంచానికి తెలీదు. మళయాళంలో ప్రేమనజీర్, ఎల్.విజయలక్ష్మి నటించిన లైలా మజ్నూ సినిమా నిర్మాతల్లో కొండారెడ్డి గారు కూడా ఒకరు. కెమేరామెన్ కావడంతో ఆయన అభిరుచి వీరికి భిన్నం కావడం వల్ల కావచ్చు ..
ఆయన ఇతర మిత్రులతో కల్సి పరభాషల్లో ఇలాంటి ఒకటో రెండో ప్రయోగాలు చేశారని నా భావన.
విజయా వారి విజయచిత్రలో చాలా మంది కెమేరా దర్శకుల ఇంటర్యూలు తగిలాయి గానీ కొండారెడ్డి గారి ఇంటర్యూ తగల్లేదు. నేను పొరపడి ఉండవచ్చా అసలు వేయలేదా? జస్ట్ అనుమానమే … నాకైతే పెద్దమనుషులులో కెమేరా పనితనమూ నచ్చుతుంది. అలాగే బంగారు పాప కూడా. తాథిమి తకథిమి తోల్ బొమ్మా దీని తమాస చూడవే పాటా .. కోరా మీసపు కుర్రవాడా పాటా భలే తీశారాయన.
Share this Article