Bharadwaja Rangavajhala….. పడవ పాటలు… తెలుగు సాహిత్యంలోనూ జానపద సంగీతంలోనూ చాలా పాపులర్ జాలర్ల పాటలు. పడవ నడిపేటప్పుడూ చేపలు పట్టేటప్పుడూ ఇలా పడవ మీద పనిచేసే ప్రతి సందర్భంలోనూ జాలర్లు పాటలు పాడుతూనే ఉంటారు. శ్రమ మరచిపోయేటట్టు చేసేదే పాట. శ్రమైక జీవన సౌందర్యమే పాట.
పడవ పాట అనగానే ఠక్కున గుర్తొచ్చేది సంపూర్ణ రామాయణంలో ఘంటసాల వారు గానం చేసిన కొసరాజు సాహిత్యం. రామయ్య తండ్రీ అంటూ గుహుడు పాడతాడీ గీతాన్ని.. కొసరాజు రాఘవయ్య చౌదరి రాసిన గుహుడి పాట మామ మహదేవన్ స్వరకల్పనలో విన్నాం. అలాంటిది దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు రాస్తే ఎలా ఉంటుంది? అదీ పెండ్యాల వారి సంగీత దర్శకత్వంలో.
ఒడిదుడుకుల సంసారపు
Ads
కడలులకే తారకుడవు
నీకు గుహుడు కావాలా
ఈ కొద్దిపాటి ఏరు దాట….. అంటారు దేవులపల్లి.
నువ్వు దాట లేక కాదులే రామయ్య తండ్రీ నన్ను తరియింపక వచ్చావు రామయ్య తండ్రీ అంటారు కొసరాజు. అదీ తేడా … ఆ పాట ఏమిటి అంటే…
ఈ గంగకెంత దిగులో … సినిమా పేరు శ్రీ రామ పట్టాభిషేకం..
సినిమాకు సంబంధించి మనకు పడవ పాట అనగానే గుర్తొచ్చే మరో గీతం భీష్మ సినిమాలో సాలూరి రాజేశ్వరరావు కల్పించిన గీతం. ఆరుద్ర రాసిన ఈ గీతం అప్పుడే కాదు ఇప్పడూ హిట్టే. జమునారాణి గానం చేసిన ఆ గీతం కాస్త కవ్వింపు తరహాలోనే సాగుతుంది. హైలో హైలేసా … హంస కదా నా పడవ… భీష్మ…
ఆరుద్రే రాసిన మరో పడవ గీతం బుద్దిమంతుడులో వినిపిస్తుంది. మామ మహదేవన్ స్వరం కట్టిన ఈ పడవ గీతం కూడా ఘంటసాల వారే పాడారు.
హీరో పడవ నడిపే వాడి వేషంలో హీరోయిన్ ను ఉడికిస్తూ పాడతాడీ గీతాన్ని. ఒక రకంగా ఏమిటి.. టీజింగ్ సాంగ్ అది. టక్కుల టక్కరి పిట్ట పడవ ఎక్కెరా అంటూ సాగుతుంది ఆరుద్ర రచన. హవ్వారే హవ్వా… బుద్దిమంతుడు …
అందాల రాముడు చిత్రం ఆద్యంతం రెండు పడవల మీద సాగే కధే. బాపుగారు గోదావరి మీద తీసిన ఈ సినిమా మొదటిసారి విడుదలయినప్పుడు ఆడియన్స్ పెద్దగా స్పందించలేదుగానీ రెండోసారి విడుదలైనప్పుడు మాత్రం బానే చూసారు. అందులో ఓ పడవ గీతం రాయించుకున్నారు బాపు. కురిసే ఎన్నెల్లో మెరిసే గోదారిలా …
వేదాంత భావనలు చెప్పడానికి కూడా పడవ పాటలు అద్భుతంగా ఉపయోగపడ్డాయి. తల్లితండ్రి అతడే నీ ఇల్లు వాకిలి అతడే … ఆ పాండురంగడున్నాడురా… అంటూ భక్త తుకారాంలో దాశరధి ఓ పడవ పాట రాశారు. శ్యామసుందరా అంటూ సాగే పాటలో వచ్చే బిట్ ఇది.
అయినప్పటికీ జనం నాలుకల మీద నిలచిపోయిన పాట. తుకారాం నిర్మాత ఆదినారాయణరావే సంగీతం అందించారు. పడవెళ్లిపోతోంది రో …. భక్త తుకారం
సూర్యుడు, చంద్రుడు, తారలు, దిక్కులు, నువ్వు, నేను, రేవు, నావ … ఇవి బెస్తవానికి ఠక్కున గుర్తొచ్చే పదాలు. ఇవన్నీ కూడా సముద్రంలో చేపలలాంటివే అని చెబుతున్నాడు. అంటే, సృష్టిలోని సమస్తమూ సముద్రమేనని చెప్పటం కనిపిస్తుంది. ఇక్కడ సముద్రమన్నది సకల చరాచర జగత్తుతో పోలికగా చెప్పిన మాట – ఈ వ్యాఖ్యానం నాది కాదు ఎక్కడో చదివా…
బెస్తల జీవితంలోని భావోద్వేగాలన్నిటినీ తనలో యిముడ్చుకున్న విస్తృతిని శుభసంకల్పం చిత్రం కోసం మన ముందు ఆవిష్కరిస్తారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. నీలాల కన్నుల్లో సంద్రమే… జాలరి పాటలు ఎక్కడైనా ఒకేలా సాగుతాయి. సంప్రదాయ శాస్త్రీయ సంగీతంలాగానే జానపద సంగీతం కూడా దాదాపు ప్రతి ప్రాంతంలోనూ ఒకే తరహాలో సాగుతుంది.
శ్యామల్ మిత్రా అమానుష్ కోసం ఓ జాలరి గీతాన్ని కంపోజ్ చేసి తనే గానం చేశారు. దాన్నే తెలుగులో పునర్నిర్మించినప్పుడు టైటిల్స్ లో వచ్చే గీతాన్ని యధాతథంగా ఉంచేశారు సంగీత దర్శకుడు సత్యం. శ్యామల్ మిత్రా గాత్రాన్ని అనుకరిస్తూనే వేటూరి సాహిత్యాన్ని గానం చేశారు బాలసుబ్రహ్మణ్యం. గోదారి వరదల్లో రాదారి పడవల్లే … ఎదురీత…
తెలుగు వారికి పడవ పాట అనగానే గుర్తొచ్చే ఇంకో ప్రముఖ గీతం మాయాబజార్ మూవీలో వినిపిస్తుంది. పింగళి నాగేంద్రరావు సాహిత్యానికి సాలూరి రాజేశ్వరరావు కూర్చిన సంగీతం. ఘంటసాల గాత్రంలో వినిపించే ఈ పాట స్వరరచన కూడా ఆయన పేరుతోనే ప్రచారంలో ఉంది. పండు వెన్నెల్లో మూడు జంటలతో నౌకావిహారం చేయిస్తారు దర్శకుడు కె.వి.రెడ్డి. అయితే ఈ పాటకు సంబంధించిన విశేషం ఏమిటంటే ఈ పాట మిట్ట మధ్యాహ్నం చిత్రీకరించారట.
అయితే ఘంటసాల కూడా ఒక అపురూపమైన పడవ గీతాన్ని స్వరపరచారు. మర్మయోగి చిత్రం కోసం ఆరుద్ర రాసిన పాటది. నవ్వులనదిలో పువ్వుల పడవ అంటూ జిక్కితో కలసి ఘంటసాల గానం చేశారు. ఘంటసాల మార్క్ రిథమ్ లోనే నడుస్తుందీ పాట. బహుశా ట్యూనుకు రాసిన సాహిత్యం కావచ్చు.
యేసేయ్ చాపబార్సెయ్ నావవార్సెయ్ వాలుగా …చుక్కానే చూపుగాబ్రతుకుతెరువెదురీతేగా….అంటూ సాగుతుంది గోదావరిలో వేటూరి వారి పడవ పాట.పడవ మీద మానవజీవిత సారాన్ని ఆరబోయడం అనే టెక్నిక్కు బాపు రమణలు అందాలరాముడులో చేస్తే … శేఖర్ కమ్ముల గోదావరితో చేశారు.గోదావరికీ భద్రాద్రి రాముడికీ బంధం పెనవేసి ఆరుద్ర తరహాలోనే మరింత విస్తారంగా రాశారు వేటూరి. ఉప్పొంగెలే గోదావరి …ఊగిందిలే చేలో వరి…
Share this Article