Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజమండ్రి టు భద్రాచలం… గోదావరి మీద లాంచీ ప్రయాణం జ్ఞాపకాలు…

April 1, 2023 by M S R

ట్రావెలాగ్ రాయాలంటే ముందుగా ఆ అనుభూతిని మనసు నిండా నింపుకుని, తాపీగా అక్షరబద్ధం చేయాలి… అప్పుడే అందులో లైఫ్ ఉంటుంది… మన ఫీలింగ్స్‌ను షేర్ చేసుకోవడానికి ఇప్పుడు సోషల్ మీడియా ఉంది… మది నిండా అల్లిబిల్లిగా కదలాడే అనుభూతుల్ని కాస్త క్రమపద్ధతిలో రాస్తూ పోతే… ఇదుగో ఇలాంటి పోస్ట్ అవుతుంది… గోదావరి ప్రయాణాలు అనుభవమున్నవాళ్లు కనెక్టవుతారు… ఓ మిత్రుడు 1988లో రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లిన లాంచీ ప్రయాణం కథాకమామిషు ఇదుగో… యథాతథంగా…



Mallareddy Desireddy…..   ” గోదారమ్మ ఒడిలో భద్రాద్రి ప్రయాణం “

■

Ads

కర్ణాటక రాష్ట్రంలో మైసూరులోని శారదా

విలాస్ లా కాలేజీలో చేరిన తర్వాత, కొద్ది

కాలానికి ఇక అక్కడ నుండి TC తీసుకొన్న

తర్వాత , ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా “లా”

కాలేజీలో చేరేద్దామనే సందిగ్ధ సమయంలో,

పనిపాట లేకుండా ,గోళ్లు గిల్లుకుంటూ

ఖాళీగా వున్న నేను నరసరావుపేట స్టేషన్

రోడ్డులోనున్న పాత కోమలా విలాస్ హోటల్

ఎదురు వినాయక టైలర్ షాపులో బేవార్స్ గా

కూర్చోని, ఇటు బాంబే శేఖర్ టీ స్టాల్ లోనో,

అటు అభిమానులకు పెద్ద అడ్డా అయినా

రసూల్ టీ స్టాల్ లోనో సమూహ టీలు తాగి,

శ్వేత కాష్టం నోట్లో ఎట్టి తగలేసి,దూమపొగని

మేఘాలలోకి పంపే ప్రయత్నాలు ఎన్నిమార్లు

చేస్తున్నా ఎందుకో ఫలించలేదు,అయితేనేం

పట్టువదలని విక్రమార్కుడిలా గాల్లోకి సగం

రింగులను వదులుతూ,రెండు చేతులను

జేబులో పెట్టుకోకుండా గాలికి తిరుగుతున్న,

ఒకానొక సమయంలో నా కళ్ళకు RDO

ఆఫీసు గోడ మీద అందాల పోస్టర్ నేడే

విడుదల సెప్టెంబర్ 11తేదీన 1987 వ

సంవత్సరం అంటూ ANR నటించిన

అందాలరాముడు సినిమా పోస్టర్ చూశా,

అది రెండోసారి విడుదల అనుకుంటా,

మొదటి రీలీజ్ ఎప్పుడో నాకు తెలియదు.

ఇంటికి వెళ్లి వెంటనే భోజనం చేసి,వెంటనే

సినిమా హల్లోకి దూరిపోయి, సినిమాలో

లీనమైపోయి చూశాను.సినిమా నిజంగా

అద్భుతమైన దృశ్య కావ్యం.బాపు స్టూడియో

అంటే ప్రకృతి, ముళ్ళపూడి మాటలంటే

వికృతి,అంటే గిడుగు కి బుడుగు అనే మాట

ఈ సినిమా ద్వారా పుట్టినదే , తర్వాత

బాస్ కి అబ్బాస్ వేరే సినిమాలో సృష్టించిన

గొప్ప వ్యక్తి. ఇక సినిమా ఆద్యంతం ఎంతో

మనోహరంగా, రమణీయంగా, ఆనందంగా

సాగుతూ…మనిషికి అహం ఉండకూడదు

అనే ఒక పాయింట్ సున్నితంగా చెప్పారు

బాపు.రాజమండ్రిలో పంచవటి అనే ఒకే

కాలనీలో అద్దెకుండే కొంతమంది కలిసి

ఒక లాంచీలో భద్రాద్రి చేరడంతో ఇక ఆ

సినిమాకి శుభం కార్డు పడిపోతుంది.

ఈ సినిమా చూసిన రోజు సాయంత్రం

పూట రసూల్ టీ స్టాల్ లో టీ తాగుతూ,

నేను నా మనసులో అనుకున్నాను నేను,

ఒక్కసారైనా అలాంటి లాంచీలో ప్రయాణం

చెయ్యాలి అని, ఎలాగా తీరాలి నా కోరిక

అని నేను అనుకుంటూ వుంటే , పక్కనే

టేపు రికార్డర్ లో పెద్దగా శోభన్ బాబుతో

తీరాలంటే దారులు వున్నాయి అంటూ

కొనసాగి అలాగా తీరాలి అనే సుజాతమ్మ

పాడిన పాట వినిపిస్తోంది…..బహుశా

అందుకేనేమో నేను మైసూరులో ఎగిరితే

ఏలూరులో వచ్చి వాలిపోయాను . కొన్ని

గంటలు బండిలోనో,బస్సులోనో,రైలులోనో,

విమానంలోనో ప్రయాణం చేసి అక్కడికి చేరి

ఒక ఆహ్లదకరమైన ప్రదేశం చూడటం వేరు,

ఒక ప్రయాణంలోనే ఎన్నో ఆహ్లదకరమైన

ప్రదేశాలను చూడటం వేరు……

BOTH ARE NOT THE SAME.

ఏలూరు సి. ఆర్ .రెడ్డి లా కాలేజిలో చేరిన

తర్వాత రచయిత వేటూరి గారు అన్నట్లుగా

నూనూగు మీసాల నూత్న యవ్వనమున

ఏలూరు సి ఆర్ రెడ్డి కళాశాలలో…

ఓ రాణీ ప్రేమ పురాణం…ఆ ముచ్చటకైన

ఖర్చులు…రోజంతా గంట షికార్లు…

ఊరంతా ఉత్త పుకార్లు మరపురావు కాలేజి

రోజులు ఒన్స్ మోర్ మరపురావు కాలేజి

రోజులు వహ క్యా బాత్ హై…లాంచీని

రేవు మీద చూసినది లాగాయిత్…

నేను ట్రావెల్యోగా మారినది లాగాయిత్…..

ఎట్టకేలకు ఏలూరు లా కాలేజీలో చేరిన

తర్వాత పరిచయమైన కొంతమంది మా

స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుతున్న

సందర్భంలో వాళ్లతో అరె ఒక్కసారి నాకు

లాంచీ ఎక్కాలని వుందిరా అని అడిగితే,

భలే కోరిక రా నీది రెడ్డిగా అని అంటూ, సరే

వెళ్దాంలే అని, శుభముహూర్తం నిశ్చయుంచి

ఓరోజు కొల్లేరు సరస్సుకి తీసుకొని పోయి

లాంచీ ఎక్కించి నా పెద్ద కోరికను తీర్చారు.

చిన్న పిల్లాడికి చాక్లెట్ ఇచ్చి చాలా అంటే

వాడు ఉరుకొంటాడా, అలా నన్ను రెడ్డిగా

తీరిందా నీ కోరిక అని అంటే వీడు (నేను)

ఉరుకొంటాడా అంటే లేదురా లాంచీలో

భద్రాచలం వెళ్లి రాములోరిని దర్శనం

చేసుకోవాలని అని అంటే సర్లే రా వెళ్దాం

అని అందరూ కొల్లేరు ప్రమాణాలు చేశారు.

ఇది జరిగిన తర్వాత 1988 సంవత్సరంలో

exams రాసిన రోజు ఆనాటి సాయంకాల

సమావేశాలలో టీలు తాగుతూ, సిగరెట్లు

వెలిగిస్తూ నిర్వహించిన పిదప,రాత్రికి

సత్రంపాడు నేనుండే రూమ్ లో గ్లాసుల

సమావేశంకి ఆహ్వానం అందుకున్న

అందరూ సరేనంటూ వెళ్లి తిరిగి రాత్రి

సమావేశంకి వచ్చారు,ఇక సమావేశంలో

భద్రాచలం లాంచీలో ప్రయాణం సబ్జెక్ట్

గురించి డిస్కషన్ వచ్చింది…..అరె రెడ్డిగా

నేను నా రాజమండ్రి మిత్రుడిని ఒకడిని

అడిగా దానికి వాడు ఏమన్నాడంటే వాడు

డిగ్రీలో వుండగా 1984 లో రాజమండ్రి

నుండి భద్రాద్రికి తారు రోడ్డు వేయటం

ప్రారంభించి వాడి డిగ్రీ పూర్తి అయిన

తర్వాత అంటే 1987లో రోడ్డు పూర్తిగా

పూర్తయ్యింది హాయిగా బస్ లోగాని ,

సుమోలో గాని వెళ్ళండి అని వాడు

అన్నాడురా అని మా JV గాడు అని మా

మిత్రుడు కి.శే J. వెంకటేశ్వరరావు తణుకు

న్యాయవాది అంటే దానికి నేను మాత్రం

ససేమిరా ఒప్పుకోలేదు, దానికి JV గాడు

సరేలేరా వాడి ఫోన్ తీసుకున్నాను ,రేపే

వాడి ఫోన్ కి ట్రాంకాల్ బుక్ చేసి నేను

అడుగుతా అన్నాడు JV . తాగుబోతు

ప్రమాణాలా అన్నాను నేను. ఎట్టకేలకు

JV మరుసటి రోజే వాడి ఫ్రెండ్ తో ఫోనులో

మాట్లాడటం రేట్లు, అన్ని పూర్తి వివరాలు

కనుక్కోవడం అయిపోయింది.లాంచీలు

రాజమండ్రిలో ప్రతిరోజూ ఉదయం 5

గంటలకు బయలుదేరతాయంట,అక్కడ

లాంచీలు బయలుదేరి దేవీపట్నం దగ్గర

కొండమొదలుకి మధ్యాహ్నం 12 గం లకి

అక్కడి నుంచి భద్రాచలానికి సాయంత్రం

6 గంటలకు చేరుకుంటాయట, టిక్కెట్

మనిషికి రూ.100 అంట, ఇంకోటి ఏమో

3 రోజులు పగలు ప్రయాణం 3 రాత్రుళ్ళు

రేవులలో నిద్ర అంట, స్పెషల్ ప్యాకేజీ రేటు

800 రూపాయలట, టిఫెన్ ,కాఫీ, భోజన

ఖర్చులు వేరే అంట అని అంటూ, ఒక

రోజు ట్రిప్ మరియు 3 రోజుల ట్రిప్ రేట్ల

గురించి సత్రంపాడు నాయుడు హోటల్లో

నేను టిఫిన్ చేస్తుంటే JV వచ్చి చెప్పాడు ,

నేను ఇక ఆలస్యం ఎందుకురా ఎల్లుండే

వెళదాం, మనవాళ్ళందరికి వెళ్లి నువ్వు

చెప్పు 3 రోజులకి సరిపోయేందుకుగాను

ప్యాంట్లు , షర్ట్స్ తెచ్చుకోండి అంటూ 3

రోజుల ట్రిప్ ఖాయం చేశా. ఆ విధంగా

రాజమహేంద్రవరంకి బయలుదేరి, రాత్రి

బస చేయడానికి రాజమహేంద్రవరంలో

రేవుకు దగ్గరలో లాడ్జిలో 2 రూములును

తీసుకొని, రూమ్ తాళంచెవులు తీసుకొని

మేం పైకెక్కే లోపు, హోటేలోడు ఆగండి

సార్లు అంటూ, ఆయ్ మా లాడ్జికి పవర్

జనరేటర్ లేదు అంటూ…..రాత్రికి ఎవడి

కావాల్సినంత గాలి వాడే ఇసురు కోండి

అంటూ ఇసురు కొనేందుకు హోటేలోడు

మా చేతికి ఇచ్చిన విసనకర్రలు చేతిలోకి

తీసుకొని,మెట్లెక్కి వెళ్లి పైన రూముల్లో

దూరి స్నానాలు ముగించేలోపు తలా

మూడు వేలు ఇవ్వండి అని JV గాడు

అడగటం,అందరూ ఇవ్వడం, అరగంట

తర్వాత ఇంకో 3 రోజులకి సరిపడా 12

ద్రవ పదార్థాల గాజు సీసా కుండీలతో

పాటు ఆనాటి రాత్రి జరిగే విస్తృత స్థాయి

సమావేశంకి అవసరమైన పూజా సామగ్రి

తెచ్చి పెట్టి,ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ఫైల్

తెచ్చే బ్యాగ్ మాదిరి ఓ బ్యాగ్ లో వాటి

ఖర్చుల వివరాలు నింపాడు JV గాడు.

కొన్ని ప్రయాణాల వలన కలిగిన కొన్ని

అనుభూతులు ఎప్పటికి మదిలో నుండి

చెరిగిపోవు, ఆ అనుభూతుల తాలూకా

జ్ఞాపకాలు జ్ఞాపకాల దొంతరలలో నిక్షిప్తమై

తిరిగి అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాయి.

అలాంటి ప్రయాణాలలో నాకు అత్యంత

అపురూపమైన ప్రయాణం గోదారి తల్లి

ఒడిలో ( నీటి మీద ) లాంచీలో ప్రయాణం.

లాడ్జిలో నిద్ర పట్టలేదు, ఇక పొద్దున్నే లేచి

స్నానాలు ముగించి, రేవు దగ్గరకి చేరాం,

అక్కడ పక్కనే వున్న హోటల్ లాంటి

పాకలో చేరి వేడి వేడి ఇడ్లీలు, నేలట్లను

లాగించి రేవులో లాంచీ దగ్గరకెళ్ళాం,

లాంచీల రేవులో గోదారి తల్లికి పుత్రుడు

రైస్ బౌల్ జిల్లాలైన తూగో… పగో జిల్లా

వాసుల పాలిటి అపర భగీరథుడు,వారు

దేవుడుని కొలిచే తీరులో ఇప్పటికి అక్కడి

ప్రజలుచే కొలవబడే గొప్ప వ్యక్తి సర్ ఆర్థర్

కాటన్ పేరుతోనున్న కాటన్ లాంచీ, దాని

పక్కనే”ఝాన్సీరాణి లాంచీ” నా కంటికి

కనపడింది, అదే మేం ఎక్కి ప్రయాణం

చేయబోయేది అని, ఝాన్సీ రాణి లాంచీని

తదేకంగా చూడసాగాను,వాటితో పాటు

విక్టోరియా లాంచీ, అలెగ్జాండ్రియా లాంచీ,

తిసిల్ లాంచీ, శ్రీలక్ష్మి లాంచీ, కిన్నెరసాని

లాంచీ, మహాలక్ష్మి లాంచీ, శ్రీరాములు

లాంచీ, సీతారామాంజనేయ లాంచీ,

రుద్రమదేవి లాంచీ, సీతాదేవి లాంచీ,

గోదారి లాంచీ, రాజహంస లాంచీ

గోపాలశెట్టి బ్రదర్స్ లాంచీ, మురళీకృష్ణ

లాంచీ, ముద్దు కృష్ణ లాంచీ, గోపాలకృష్ణ

లాంచీ, హరేకృష్ణ లాంచీ, శ్రీ రాజేశ్వరి

లాంచీలతో పాటు లంగర్లు వేసినవి

ఇంకో 50 లాంచీలు అక్కడ వున్నాయి.

మేమెక్కపోయే ఝాన్సీ రాణి వైపు చూశా,

లాంచీకి అటూఇటూ రెండు చిన్నపాటి

మైకులు, పైన రెపరెపలాడుతూనున్న

కాషాయ రంగు జెండా,జెండాపై గదతో

ఆంజనేయ స్వామి వారి బొమ్మ, మైకులో

నుంచి రాములోరి పాటలు వస్తున్నాయి,

నా రెండు చేతులతో ఆప్యాయంగా తాకి

గోదారితల్లిని మూడు సార్లు నా తలపై

చిలకరించి లాంచీ ఎక్కేసి కూర్చొగానే ఇక

సందడి సందడిగా వుంది.నాకు గోదారమ్మ

తల్లిని చూడగానే ఎదో తెలియని ఉద్వేగం

గోదారి మీదుగా ఆ పాపికొండల గాలి సోకిన

వారికి ఎవరికైన,’కొండగాలి తిరిగింది గుండె

ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక

చెలరేగింది” అని పాట గుర్తుకురాకుండా

పాడుకోకుండా ఎలా వుండగలుగుతారు.

ఇంకా ‘గోదారి గట్టుంది గట్టుమీద చెట్టుంది

చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో

ఏముందీ’, ‘తల్లీ గోదారి తుళ్ళితుళ్ళి

పారేటి పల్లెపల్లె పచ్చాని పందిరి నిండూ

నూరేళ్లు పండుముత్తైదు వల్లెవుండు

పంటళ్లకేమి సందడి’,’వెల్లువచ్చి గోదారమ్మా

వెల్లాకిలా పడ్డాదమ్మ’ , ‘గోదారి నవ్వింది

తుమ్మెదా నిండుగోదారి నవ్వింది తుమ్మెదా’

‘వయ్యారీగోదారమ్మా వళ్లంతా ఎందుకమ్మా

కలవరం కడలి వడిలో కలసిపోతే కలవరం’

‘గోదారివరదల్లో.. రాదారిపడవల్లే..

నీ దారి నీదేనన్నా ఉయ్యాలలూగే

ఈజగమంతా ఊహాలకందని వింతా,

ఈ లాహిరిలో నీరెంత’

‘నిండూ గోదారి కదా ఈ ప్రేమా’

‘గోదారల్లె యెన్నెల్లో గోదారల్లే, గోదారల్లె

యెల్లువా గోదారల్లే’ ‘గోదావరీ పయ్యదా,

కృష్ణమ్మా నీ వాల్జెడా నిండారా తెలుగింటి

అందాలె వెలిగించే నండూరి వారెంకిలా’

‘వెన్నెల్లో గోదారి అందం ,నది కన్నుల్లో

కన్నీటి దీపం’ ఇలా ఎన్ని పాటలు గోదావరిని

కలవరిస్తూ కవులు తమ కలాన్ని పరుగులు

పెట్టించారో అలాంటి పాటలు మనసులో

రీళ్లు చుట్టేస్తాయి,అలా గోదారి మీద పాటల

గురించి ఆలోచిస్తూ గోదావరి దరిచేరుతాం.

అలా తల్లి గోదారి నా శరీరాన్ని,మనసుని

ప్రేమతో ఆవాహన చేసుకుంది.మన గోదారి

తల్లిది భారత దేశంలో వున్న పెద్ద నదుల్లో

రెండో స్థానం మన గోదారి తల్లిది..ఎక్కడో

మహారాష్ట్రలో నాసిక్ లో త్రయంబక్ దగ్గర

పుట్టిన గోదారితల్లి తను ఏమాత్రం సేద

తీరకుండానే ప్రవహించుచూ ఎన్నో లక్షల

గొంతుల తడార్పుతూ, అలాగే ఎన్నో లక్షల

భూములకు సేద్య తడార్పుతూ 3 రాష్ట్రాలు

దాటుకుంటా,ప్రవహిస్తూ తన ఉపనదులైన

మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి,

శబరిలను తనలో ఐక్యం చేసుకుంటా, ఒకటై

అందాల పాపికొండల్లోనుంచి ప్రశాంతంగా

ప్రవహిస్తూ రాజమండ్రిని దాటిన తర్వాత

దిగువన గౌతమి, వశిష్టలుగా విడిపోయి,

తిరిగి ప్రవహించే గోదారమ్మ తల్లి అలా అలా

చివరాకరుకు బంగాళాఖాత సముద్రంలో

కలిసిపోతుంది…..లాంచీ బయలుదేరే

ముందు ఎవరో ఒక 60 ఏళ్ల వ్యక్తి వచ్చి,

లోకరాజు అంటూ పిలిస్తే మైకుతో వెళ్లి,

మాట్లాడి ,ఆయనకు డబ్బులు ఇవ్వడం,

తిరిగి ఆయన సదరు లోకరాజుకి కొద్దిగా

డబ్బులు ఇవ్వడం, ఆయన కొబ్బరికాయ

కొట్టడంతో లాంచీ ఇంజన్ స్టార్ట్ చేశాడు

డ్రైవర్, లోకరాజు గుమస్తా @ మేనేజర్ @

గైడ్@టేప్ రికార్డర్ ఆపరేటర్ అని గ్రహించిన

నేను,లోకరాజన్న పాత పాటలు పెట్టన్నా

అంటూ 100 రూ లు చేతిలో పెడితే,ఆయ్

ఎందుకండీ అంటూ ,ఆయ్ అలాగేనండీ,

అక్కినేనోరి పాటలు వున్నాయి అండీ అవి

వేస్తాను సారు అంటూ,ఆయ్ తమరి పేరేటీ

సారు అంటే, చెప్పేసి , అందరం కూర్చోగానే,

లాంచీ గోదారి ఎడం పక్కనుండి బయలుదేరి

11.30 కి కుమారదేవం రేవు పక్కన ఆపేశారు,

నిద్రగన్నేరు చెట్టు పక్కన లంగర్ వేసి లాంచీకి

మోకు తాడు కట్టేసారు, లోకరాజు మీ అందరకీ

భోజనాలు ఆ చెట్టు కిందే అని చెప్పి, ఆ చెట్టునే

కుమారదేవం సినిమా చెట్టు అంటారు అని

చెట్టు నాటిన వ్యక్తి తాతబ్బాయి గారని ,అందుకే

ఇప్పటికి కూడా ఈ చెట్టును తాతబ్బాయి గారి

చెట్టు @ సినిమా చెట్టు అంటారని దీని కింద

పాడిపంటలు , దేవత ,వంశవృక్షం లాంటి

సినిమాలు ,షుమారుగా 30 కి పైగా

సినిమాల షూటింగ్ జరిగిందిక్కడేనని చెప్పాడు,

నిజం చెప్పాలంటే సినీ ఫోటోగ్రాఫర్ తన

కెమేరాను తీసుకొచ్చి చెట్టు కింద పెడితే ఫ్రేమ్

దానంతటదే తన్నుకొని వచ్చేలా వుంది ప్రకృతి .

1.30 ని.లకే ఘుమఘుమలాడే పూర్తి

బ్రాహ్మణ తరహా మరియు క్షత్రియ తరహా

భోజనాలు రెడీ అయ్యాయి , ప్రయాణికుల

భోజనాలసందడయ్యేకా కొద్దిగా నిదానంగా

బయల్దేరింది లాంచీ. అలా మా లాంచీ

అడుగులో అడుగేసుకుంటా నెమ్మది

నెమ్మదిగా కన్నెపిల్లలా వయ్యారంగా

వెళుతున్న లాంచీ పట్టిసీమ, పోలవరం,

దేవీపట్నం రేవులు దాటుకుంటూ పోయి

అందమైన సింగన్నపల్లి రేవుకి మా లాంచీ

చేరేటప్పటికి సూర్యాస్తమయమైపోయింది.

ఒడ్డుకి లాగి లంగర్లేస్తుంటే ఓపక్క దిగుతున్న

జనానికి లోకరాజు మైక్ లో రాత్రి మకాం

ఈ రేవులోనే అంటూ చెప్పడంతో కిందికి దిగి

గోదారి ఇసకలో కలతిరిగేస్తా కాసేపు గడిపాం.

కొంతమంది కుర్రోళ్ళయితే చాటుగా వెళ్లి

దమ్ము లాగే పనిలో పడిపోయారు, కొంత

మంది ఆ నీళ్ళలో తిరుగుతున్నారు.

రాత్రికి లాంచీపైనే నిద్రపోతాం అన్న అని

లోకరాజుని అడిగితే, ఆయ్ అప్పుడే

తొంగుంటారా సారు, ఆయ్ భోజనాలు

సెయ్యరా సారు అని అడిగాడు, లేదన్న

పూజ పూర్తి చేసి,తర్వాత భోజనం చేసి

నిద్రపోతాం, ఆయ్ పూజ ఎటండీ అని

అన్నాడు,నేను నా వేలుతో చూపిస్తూ నీకు

అలవాటు వుందా లోకరాజు అన్న అని

అడిగా, దానికి ఆయ్ అప్పుడప్పుడు

ఉందండీ అని అన్నాడు, మరిరా మాతో

పాటు నువ్వు వచ్చి కూర్చో అంటే,ఆయ్

ప్యాసింజర్లకి భోజనాలు ఎట్టేసి నేను బేగి

వచ్చేస్తానండీ అంటూ వెళ్లి, కొంతసేపటి

తర్వాత వచ్చాడు,లోకరాజు అన్నా నీకు

పిల్లలు ఎంతమంది అంటే నాకు మనువే

కాలేదండీ,ఎనుక ముందు నాకు ఎవ్వరూ

లేరండీ, సిన్నతనం నుంచి మా ఓనర్ గారి

దగ్గరే వుంటున్నాను,ఆయన పేరేంటని

అడిగితే మా ఓనర్ గారి పేరు పొడిపిరెడ్డి

వీరస్వామి అంటూఅన్న తీర్థ ప్రసాదాలు

ముగించి, మాతో పాటే నిద్రపోయాడు,

పొద్దున్నే టిఫిన్ రెడీ అయ్యింది, మెత్తటి

ఆవిరి కుడుములు, ప్రత్యేకంగా వేసిన

దోసెలు, వాటిల్లోకి పుట్నాల చెట్నీ వావ్

సూపర్ లాగించేసి లాంచీ ఎక్కేశాం.లాంచీ

బయలుదేరి కొత్తూరు రేవు చేరింది,లోకరాజు

చెప్పాడు ఆయ్ రెడ్డిగారు ఇక్కడేనండీ మన

అక్కినేనోరి వారి సినిమా అందాలరాముడు

తీశారని చెప్పాడు,రాజహంస అని వేరే వాళ్ల

లాంచీలో తీశారు అని చెపుతుంటే ,నేను

అడిగా మరి మీ లాంచీలో ఏమైనా సినిమా

తీశారా అని అడిగితే ఎందుకు తీయలేదండీ

మన విశ్వనాధ్ గారి శంకరాభరణం సినిమా

మొత్తం మా లాంచీ వుంటుంది అని ఎంతో

గర్వంగా చెప్పుకొచ్చాడు.లాంచీ వెళ్తూ

మాంధాపురం దాటి, వంటకి కోండ్రుకోట

రేవులో ఆపేశారు, భోజనాల తర్వాత

లాంచీ వాడపల్లి, తూటిగుంటా రేవులు

దాటి సాయంత్రం 5 గంటలకి టేకూరు

చేరింది ,రాత్రికి హల్ట్ ఈ రేవులోనేనండీ

అన్నాడు లోకరాజు .మర్నాడు పొద్దున్నే

అచ్చం బియ్యపు పిండితో చేసిన నేలట్లు,

పచ్చి మిర్చితో అల్లం చెట్నీ ,పూరీలు

ఎంచక్కా లాగించేసాం.లాంచీ బయలుదేరి

కొరుటూరూ దాటి పాపికొండల మధ్యలో

నుంచి నెమ్మదిగా వెళ్తుంటే చల్లటి గాలి,

వాతావరణం, పచ్చదనం, ఆహ్లదకరం,

అద్భుతం, ఆలా లాంచీ కొల్లూరు దాటి,

కొండేపూడి, పాపికొండల్ని దాటే సరికి

సాయంత్రం అయ్యింది పోచవరం రేవులో

హాల్టు. తిరుగు ప్రయాణం మా లాంచీలో

వస్తారా అని అడిగాడు…..లేదన్న అని

చెప్పాను.అన్న ఎదో ఫీల్ అయ్యాడు.

పొద్దున్నే చపాతీలు తిని,లాంచీ ఎక్కేసాం.

లాంచీ కూనవరం చేరింది, లాంచీ చిన్నగా

కూనవరం రేవులో ఆగిందో లేదో అప్పటికే

హీరో రజనీకాంత్ సినిమాకు హడావుడి

చేసే ఫ్యాన్స్ మాదిరి, భద్రాచలం నుంచి

వచ్చిన బసుల ,ఆటోల,కార్ల డ్రైవర్లు వచ్చి

వున్నారు….లోకరాజు సార్ ఇక్కడే మీరు

దిగాలండీ ఆయ్ అన్నాడు. మా బ్యాచ్

అందరం కలిసి 5 వందలు రూపాయలను

లోకరాజు అన్న చేతికి ఇస్తే ,తను ఆ క్షణంలో

ప్రేమగా చూసిన చూపు ఇప్పటికి నాకు గుర్తే.

“ముగింపు”

●●●●●●●●

ది అల్కెమిస్ట్ పుస్తకం మీలో చాలామంది

చదివి వుంటారు ,పుస్తకం గురించి క్లుప్తంగా

ఒక వాక్యంలో చెప్పాలంటే నేను చెప్పేది

మాత్రం ఒక్కటే వాక్యం అది ఏమిటంటే

“Chase your dreams to find your

destiny” అని మాత్రం చెప్పుకోవచ్చు.

కొన్ని ప్రయాణాలు మనల్ని మనకు కొత్తగా

పరిచయం చేస్తాయి. ప్రయాణం మనిషి

జీవితానికి కావలసిన కొత్త శక్తిని ఇస్తుంది.

కొత్త ప్రదేశం వెళ్లడం అంటే నువ్వొక చోటు

నుంచి ఇంకో చోటుకు వెళ్లడం కాదు..

నీలోనే ఒక కోణం నుంచి ఇంకో కోణం కి

మారడం…కొత్తప్రదేశాలు చూడడం కాదు,

నీలోనే ఓ కొత్తని చూడ్డం,నువ్వు ప్రయాణం

చేయట్లేదు అంటే అర్థం ఉన్న చోట అక్కడే

ఉన్నావని కాదు.. అదే ఆలోచనల్లో నువ్వు

ఆగిపోయావని…ప్రయాణం చెయ్….

నిన్ను నువ్వు వెతికేయ్…..భద్రాచలం

రాములోరిని దర్శించాలంటే నల్లని నునుపైన

తారురోడ్డు మీద బస్సులు, కార్లు, వ్యాన్లలో

గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లిపోయి

చూడటమే చాలామందికి తెలుసు. ఏదో

వెళ్లాం వచ్చాం అన్నట్టే తప్ప..అటువంటి

ప్రయాణం పూర్తి ఆనందాన్నిస్తుందని నేను

చెప్పలేను . కానీ అదే ప్రయాణం మంద్రంగా

వీచే గాలి తరగలు మన తనువును కొంచెం

సుతారంగా స్పృశిస్తుండగా గోదారి అలల

మీద తూగుటుయ్యాలపై లాహిరి లాహిరి

లాహిరిలో అంటూ మన కళ్ళను కట్టిపడేసే

ప్రకృతి అందాల నడుమ హాయి హాయిగా

సాగితే….. ఆ మరచిపోలేని అనుభూతి

మదిలో ఎప్పటికీ పదిలమే.

మీమల్లారెడ్డి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions