మందు… మెడిసిన్ కాదు, మద్యం… తాగితే వ్యసనం… నాలుక ఊరుకోదు, టైమయితే చాలు ఎప్పుడెప్పుడు అంటూ నాలుక పిడచకట్టుకుపోతుంది… అలవాటు చేశావు కదా, ఏదీ పెగ్గు, రానియ్ రానియ్ అని గోలపెడుతుంది కాలేయం… ఆత్మారాముడు ఆవురావురు అంటుంటాడు…
అప్పోసప్పో చేసెయ్, సీసా మూత తీసెయ్… వచ్చిన జీతం అధికశాతం బారులోనే హరీమంటుంది… పైగా రకరకాల వింత వింత పేర్లతో ప్రభుత్వమే ఎంకరేజ్ చేసే చీపెస్ట్ లిక్కర్, అనగా రంగుసారా… రిస్క్ చేస్తే కిక్కేమిటో గానీ కక్కు గ్యారంటీ, పక్క రాష్ట్రం వెళ్లి బ్రాండెడ్ మద్యం తాగేవాడు లక్కీ…
మాట తడబడి, అడుగులు తొట్రుపడి, కళ్లు గిరగిరా.,. గెట్‌టుగెదర్లు కాస్తా మాటామాటా పెరిగి తన్నుకునే సీన్లు కూడా… మరి అన్నీ సక్కగా ఉండటానికి అదేమైనా ఫ్రూట్ జ్యూసా..? ఇన్ని రిస్కులున్నా సరే, ఒక్కసారి దేహానికి పెగ్గు అలవాటైతే సరి, మనసు మాట వినదు… ఆల్కహాల్ కోసం అరుస్తుంది… గోల చేస్తుంది… సరే, ఇంత కథ ఉంది కదా… అసలు చుక్క నోట్లో పోయకుండానే మనకు తాగినట్టు ఫీలింగ్ ఉంటే..?
Ads
అబ్బో, ఎంత మజా.., పర్సు ఖాళీ చేసే పనిలేదు, డ్రంకెన్ డ్రైవ్ గొట్టాల్లేవు, పెనాల్టీలు లేవు, కౌన్సిలింగుల్లేవు, జైలుశిక్షల్లేవు… ఇంటికెళ్లాక చీపురు దెబ్బలు అసలే లేవు… కదా… అవును కదా… కానీ అదెలా సాధ్యం అంటారా..? అదొక వ్యాధి… వింత రోగం… దాని పేరు జీఎఫ్ఎస్… గట్ ఫర్మంటేషన్ సిండ్రోమ్.,. ఇది బార్ భాష కాదండీ బాబు, మెడికల్ టర్ననాలజీయే… మరో పేరూ ఉంది… ఆటో బ్రూవరీ సిండ్రోమ్… అంటే దానంతటదే దేహమే బ్రూవరీలాగా మారిపోవడం అంటే, దానంతటదే ఆల్కహాల్ ఉత్పత్తికి ఫ్యాక్టీరీలాగా మారిపోవడం…
హబ్బ, నాకూ ఆ వ్యాధి వస్తే ఎంత బాగుండు అని ఆశపడకండి… చాలా అరుదైన వ్యాధి… ఈమధ్య బెల్జియంలో ఒకాయన కారులో వెళ్తుంటే గొట్టం పెట్టారు, డ్రంకెన్ డ్రైవ్ అని కేసు పెట్టేసి, అరెస్టు చేశారు… అంతే, వాళ్లూ మన హైదరాబాద్ పోలీసులంత స్ట్రిక్టు… భారీగా జరిమానా కూడా వేశారు… ఆయనకు చిర్రెత్తుకొచ్చింది… అరె, నేను చుక్క వేసుకోలేదు, ఈ కేసేమిటి అని కోర్టుకెక్కాడు…
అవును, మాకు ఆల్కహాల్ లక్షణాలు కనిపించాయి, ల్యాబ్ టెస్ట్ చేస్తే ఆల్కహాల్ పర్సంటేజీ తేలింది అంటారు పోలీసులు, తీరా సమగ్ర పరీక్షలు మళ్లీ చేయిస్తే తేలిందేమిటయ్యా అంటే… ఆయనకు ఈ అరుదైన సిండ్రోమ్ ఉందని… ఈ వ్యాధి ఉంటే జీర్ణాశయం తరువాత పేగుల్లో కార్బోహైడ్రేట్స్ ఫర్మెంటేషన్ ద్వారా ఆల్కహాల్‌గా మార్చబడతాయట… మరీ డేంజర్ ప్రమాదం కాదు గానీ, ఓ మెడికల్ డిజార్డర్…
మరి ట్రీట్‌మెంట్ లేదా అంటారా..? ఉంది, ఎందుకు లేదు..? ప్రమాదమేమీ లేకపోతే ఇదిలాగే ఉండనివ్వండి డాక్టర్ సాబ్ అంటారేమో…!! అసలు మన బాడీయే బ్రూవరీ అయిపోతే, ఎప్పుడూ మందు తాగిన ఫీలింగే ఉంటే… ఇంకేం కావాలి..? ఈమధ్య రకరకాల మెడికల్, మెంటల్ డిజార్డర్ల మీద సినిమాలు తీస్తున్నారు కదా… ఇదీ మంచి స్టోరీ లైన్ అవుతుందేమో..!! (స్టోరీ సోర్స్ :: దిశ)
Share this Article