#BodyCavitySearch…… ‘నిరీక్షణ’ సినిమా చూశారా? అందులో భానుచందర్‌ని జైలు లోపలికి తీసుకువెళ్ళినప్పుడు బట్టలన్నీ విప్పించి చూసి పరీక్ష చేస్తారు. మొదటిసారి ఈ సన్నివేశం చూసినప్పుడు చాలా అమానవీయంగా అనిపించింది. అదేమీ వింత కాదనీ, ఏళ్లుగా జైల్లో జరుగుతున్నదేనని తర్వాత్తర్వాత అర్థమైంది. జైలుకు వెళ్లే ప్రతి ‘సామాన్య’ వ్యక్తినీ అలా సోదా చేసి లోపలికి పంపుతారు. దాన్ని ఒక నిబంధనలా పాటిస్తారు. దీన్ని Body Cavity Search అంటారు. ఈ టెస్ట్‌కీ లింగభేదం ఏమీ లేదు.
అసలిది ఎందుకు చేస్తారు? రెండు కారణాలు. డ్రగ్స్, విషం, సైనెడ్, నిషేధిత వస్తువులు.. లాంటివి జైలులోకి తీసుకురాకుండా చూడటం. వారి శరీరంలో అప్పటికే తగిలిన గాయాలు ఉన్నాయా అని పరీక్షించడం. వారిని ఒక చీకటి గదిలో నిల్చోబెట్టి టార్చ్ వేసి ప్రతి అవయవాన్ని (పునరుత్పత్తి అవయవాలతో సహా) చూస్తారు. దాన్ని ఒక రికార్డుగా రాసుకుంటారు. చాలా సార్లు నిందితుల వెంట డ్రగ్స్, మత్తు మందు, కండోమ్స్ లాంటివి గుర్తించారు. ఈ కారణంగా Cavity Searchని మరింత తప్పనిసరి చేశారు. మొదటిసారి ఇలా మరొకరి ముందు నగ్నంగా నిలబడటం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది.
ఈ సెర్చ్ జరిగేటప్పుడు ఒకోసారి మొకాళ్ళ మీద కూర్చోమని కూడా ఆదేశిస్తారు. దగ్గమంటారు. దగ్గితే కడపులో, నోట్లో ఉన్న వస్తువులు బయటికి వస్తాయని అలా చేయమంటారు. ఇలా నగ్నంగా నిలబడే పరీక్ష నచ్చకపోతే? చాలా సార్లు నిరోధించడం కష్టం. పైగా నిషేధిత వస్తువేదో నిందితుడి దగ్గర ఉంది అన్న అనుమానం పోలీసుల్లో మరింత బలపడుతుంది. అందుకే చాలా మంది ఈ పరీక్షను అడ్డుకోకుండా సైలెంట్‌గా ఉండిపోతారు.
Ads
మానవ హక్కుల సంఘాలు ఈ అంశం మీద చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇవి జైళ్లలోకి స్మగ్లింగ్ ఆపడం మాట ఎలా ఉన్నా, ఒక వ్యక్తిని మానసికంగా హింసిస్తాయని వాదించాయి. పైగా కొండనాలుక దగ్గర, పొత్తి కడుపులో దాచుకున్న వస్తువులు ఈ పరీక్ష ద్వారా బయట పడవు. Individual Right and Privacyకి భంగం కలిగించే ఇలాంటి పరీక్షలు ఆపాలని చాలా సార్లు వాదించాయి. అయినా పరిస్థితి మారినట్టు లేదు. అమెరికాలో అన్ని కేసుల్లోని నిందితులనూ ఇలా పరీక్ష చేయరు. ప్రత్యేక కారణాలు ఉంటేనే ఇటువంటి తనిఖీలు చేయాలని కోర్టు ఆదేశించింది. యూకేలోనూ సాధారణ తనిఖీలే తప్ప ఇలా నగ్న పరీక్షలు లేవు. పాకిస్థాన్‌లోనూ ఈ తనిఖీలు ఆపేయడమే కాకుండా, ఇలాంటివి చేశారని తెలిస్తే ఆఫీసర్లకు జరిమానా విధించొచ్చని తీర్పు ఇచ్చింది. భారతదేశంలో దీని మీద ఎలాంటి ఆదేశాలు ఉన్నాయన్న విషయం తెలియదు.
మన దగ్గర అన్నిచోట్లా ఇలాంటి పరీక్షలు జరుగుతున్నాయా అనేది తెలియదు. 2010లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక అమానవీయ సంఘటన జరిగింది. ‘నార్త్ 24 పరగణా’ జిల్లాలోని జైల్లో జైలర్ కృపామయ్ నంది ఆరుగురు ఖైదీలను నగ్నంగా నిలబెట్టి, వారి చేత పరేడ్ చేయించాడు. శిక్షలో భాగంగా అలా చేయించానని సమర్థించుకున్నా, ఆ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో విషయాన్ని వారు సీరియస్‌గా పరిగణించారు. ఈ అంశాన్ని విచారించి ఆయన మీద చర్యలు తీసుకున్నారు.
సినిమాల్లో చూపించినట్టు జైళ్లలో హీరో ఇంట్రడక్షన్, కామెడీ సీన్స్, పై అధికారిణితో లవ్ ఎఫైర్ లాంటివేమీ నిజజీవితంలో ఉండవు. చాలా వరకు మనకు అక్కడి రూల్స్ తెలియవు. తెలియజెప్పేంత పకడ్బందీగా సినిమాలు కూడా ఉండవు. చదివి తెలుసుకోవాలంతే! తెలుగు సినిమాలనే పూర్తిగా నిజాలని నమ్మితే కష్టమే… – విశీ
Share this Article