……. By……. Nancharaiah Merugumala……. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గారి మనవడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐదు కీలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారి ఒక్కగానొక్క కొడుకు హిమాంశు శరీరాకృతిని ఎగతాళి చేసే రీతిలో జర్నలిస్టు, బీజేపీ సభ్యుడు చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న వ్యంగ్యంగా పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. రాజకీయాలతో సంబంధం లేని ఈ టీనేజి బాలుడిని ఆయన తాతదండ్రులపై ఉన్న కోపంతో ‘బాడీ షేమింగ్ ’ చేయడం దుర్మార్గం అంటూ ఎందరెందరో నేతలు, మేధావులు నిప్పులు చెరుగుతున్నారు. (పిల్లలను రాజకీయాల్లోకి లాగడం కూడా కరెక్టు కాదనే వాదన కూడా…) కేటీఆర్ అయితే మల్లన్నపై నేరుగా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకే ఫిర్యాదు చేయడంతో సీఎం కుమారుడిపె సానుభూతి ఏరులై పారుతోంది. బాల్యం నుంచీ బొద్దుగా ఉన్న హిమాంశు ఏడేళ్ల క్రితం చిన్న వయసులో తన తాత తరఫున భద్రాచలం రామయ్యకు తలంబ్రాలు తీసుకెళ్లడం, ఇప్పుడు ఆ బుల్లోడు పెద్దవాడయినా – ఆ పవిత్ర పట్టణంలో సమస్యలు అలాగే ఉండడం గురించి తాను పోస్టు పెట్టానేగాని ఈ కుర్రాడి శరీరాకృతి ప్రస్తావన అందులో లేదని చింతపండు నవీన్ వివరణ ఇచ్చుకున్నాడు. (ఈ వివాదం ప్రకంపనలు ఇంకా ఆగడం లేదు… నిజానికి హిమాంశు హైట్ తనకు పెద్ద అడ్వాంటేజ్…)
ఇంగ్లండ్, అమెరికా వంటి పారిశ్రామిక దేశాలకు పోయి చదువుకుని, ఉన్నతోద్యోగాలు సంపాదించి అక్కడ అత్యధిక సంఖ్యలో స్థిరపడడంలో దేశంలోనే తెలుగువారు ముందున్నారు. కానీ, ఆధునిక నాగరికతకు సంబంధించిన అనేక విషయాలు చాలా ఆలస్యంగా తెలుగోళ్లకు అర్ధమౌతున్నాయి. తానా, ఆటా వంటి సంస్థలు ఇలాంటి విషయాలపై అధ్యయన తరగతులు కూడా పెట్టడం లేదు. మంచి తెలుగు సాహిత్యాన్ని అవి ప్రోత్సహిస్తున్నాయేగానీ సభ్యతా సంస్కారాల విషయంలో అవి దృష్టిపెట్టడం లేదు. సభ్యతగా మాట్లాడడానికి సంబంధించి ఇంగ్లిష్ లో చెప్పే పొలిటికల్ కరెక్ట్నస్, అవాంఛనీయమైన బాడీ షేమింగ్ వంటి విషయాలు ఈ మధ్యనే తెలుగునాట అందరికీ పరిచయమవుతున్నాయి. శరీరాకృతి అందరూ కోరుకున్న రీతిలో లేనప్పుడు అలాంటివారిని–బండోళ్లనో, బక్కోళ్లనో (పొట్టోళ్లు–పొడుగోళ్లు అని కూడా) ఎగతాళి చేయడం తప్పు అని, ఈ దుర్లక్షణానికి బాడీ షేమింగ్ అనే చక్కటి పేరుందనే విషయం కూడా చదువుకున్న తెలుగువారు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు.
బాగా లావుగా ఊబకాయంతో ఉన్న పిల్లలు లేదా పెద్దల గురించి ప్రేమతో లేదా ఇష్టంతో ఆ విషయం తెలిపే మాటలు వాడడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అయితే, శరీరం సైజు, చర్మం రంగు ఆధారంగా వారి గురించి ఎగతాళిగా మాట్లాడడం ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. మన అభిప్రాయాలతో విభేదించేవారిని తిట్టడానికి ఇతరత్రా ఇంకే మాటలూ లేనప్పుడు వారిని కులం, ప్రాంతం పేరుతో తిట్టాక కూడా కొందరు సంతృప్తి చెందరు. అలాంటప్పుడు చివరి అస్త్రంగా తమ ప్రత్యర్థులు, శత్రువులు, వారి సంబంధీకులను వారి శరీరాకృతిలో మనకు విలక్షణంగా కనిపించే అంశాలతో ‘బాడీ షేమింగ్’ చేయడం తెలుగునాట ఎప్పటి నుంచో ఉన్నదే. ముఖ్యంగా మా తరం (1956–62 మధ్య పుట్టినోళ్లు) ఈ బాడీ షేమింగ్ కు బాధితులం. 20 ఏళ్లలోపు ఉన్న కుర్రాళ్లను బాగా సన్నగా ఉంటే–రమణారెడ్డిలా ఉన్నాడు, టీబీ పేషెంటు–అని ఎగతాళి చేసేవారు.
Ads
1972 నాటి హిందీ సినిమా ‘బాంబే టూ గోవా’లోని (అమితాబ్ బచ్చన్–అరుణా ఇరానీ) ఊబకాయం కుర్రాడు పకోడీలు కొనిపెట్టమని తన తల్లిని, ‘అమ్మా, పకోడా’ అని అడిగిన విషయం గుర్తు చేసుకుంటూ, ‘అమ్మా పకోడా’ అని లావుపాటి కుర్రాళ్లు లేదా మగ పిల్లలను చూసి ఎగతాళి చేయడం కూడా గుడివాడ, తెనాలి వంటి చిన్న పట్టణాల్లో ఉండేది. బాగా లావుగా ఉన్న ఆడపిల్ల అయితే, అప్పటి హిందీ హాస్య నటి టున్ టున్ (అసలు పేరు ఉమాదేవీ ఖత్రీ) పేరు గుర్తు చేసుకుని ఆ పేరుతో ఎక్కిరించేవారు. తమకు గిట్టని, ఇష్టంలేని రాజకీయ నాయకులను కూడా బాడీ షేమింగ్ ఫక్కీలో తిట్టడం ఇంకా చూస్తేనే ఉన్నాం. ఏపీ మాజీ సీఎం, టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడును బయట మాటల్లో కాంగ్రెస్, ఇతర పార్టీల వాళ్లు బొల్లిబాబు అనడం ఇంకా మానలేదు. 2009 తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ నేత కేసీఆర్ ఓ రోజు చొక్కా తీసి కనిపించగా (ఆయన బాగా బక్క పలచగా ఉండే విషయం తెలిసిందే) ఆ ఫోటో పత్రికల్లో వచ్చింది. అది చూసిన కర్నూలు జిల్లా కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యే మసాల ఈరన్న, ‘కేసీఆర్ టీబీ పేషెంటులా ఉన్నారు,’ అని అడ్డదిడ్డంగా మాట్లాడినా అప్పుడు ఎవరూ ఎందుకో పట్టించుకోలేదు.
వ్యక్తుల గురించి వర్ణించేటప్పుడు ఇప్పటికీ ఇంగ్లిష్ పత్రికలే సూక్ష్మ వివరాలు సైతం ఇవ్వడంలో ముందుంటాయి. ఈ విషయంలో తెలుగు పత్రికలు చెప్పలేనంత వెనుకబడి ఉన్నాయి. 1982లో తెలుగుదేశం పార్టీని ఎన్.టి. రామారావు స్థాపించినప్పుడు రైల్యే శాఖలో పెద్ద సెక్రెటరీ స్థాయి పదవిలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పోతునూరుకు చెందిన పర్వతనేని ఉపేంద్ర చౌదరి ఉద్యోగానికి రాజీనామా చేశాక, టీడీపీలో చేరి ఏకంగా పార్టీ తొలి ప్రధాన కార్యదర్శి అయ్యారు. అప్పటికే కమ్మ పార్టీగా టీడీపీకి ముద్రవేయడంలో కాంగ్రెస్ నేతలు బాగా ముందుకెళ్లిపోయారు. దీంతో తన పేరు చివరి మూడక్షరాల చౌదరిని తొలగించేసుకున్నారు ఉపేంద్ర. ఇండియా టుడే, సండే వంటి ఇంగ్లిష్ పక్ష, వార పత్రికలు ఆంగ్ల పాత్రికేయ సంప్రదాయానికి అనుగుణంగా ప్రముఖులను వారి శరీరం రంగు ఏంటో చెప్పి వర్ణించేవి. ఈ క్రమంలో ఇంగ్లిష్ పత్రికలు ఉపేంద్రను– The charcoal black general secretary of Telugu Desam Parvataneni Upendra (కారు నలుపు లేదా బొగ్గు నలుపు రంగులోని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి పర్వతనేని ఉపేంద్ర) అని ఇంగ్లిష్ పత్రికలు రాయడం, నేను చదవడం ఇంకా నాకు గుర్తుంది. అప్పటి కల్చర్, పరిస్థితులు కారణంగా తన శరీర ఛాయ గురించి అలా రాయవద్దని ఉపేంద్రగారు రిపోర్టర్లను వేడుకున్నట్టు కూడా మేం వినలేదు.
పార్లమెంటులో మన జైపాల్ రెడ్డి గారికి తప్పని బాడీ షేమింగ్
–––––––––––––––––––––––––––––––––––––––
ఉత్తమ పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకున్న తెలుగు నేత సూదిని జైపాల్ రెడ్డి గారు (చిన్నప్పుడు కాళ్లకు పోలియో సోకి రెండు కర్రల ఊతంతో ఆయన నడవడం ఇంకా కళ్ల ముందు కనిపిస్తోంది) జనతాపార్టీ లోక్ సభ సభ్యునిగా ఉన్నప్పుడు– అదీ బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం అప్పటి కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ గాంధీని కుదిపేస్తున్న 1987–89 మధ్యకాలంలో– పాలకపక్షంపై తన ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యంతో నిప్పులు చెరిగేవారు. పూర్వకాంగ్రెస్ సభ్యుడైన జైపాల్ అవకాశం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టేవారు. నెహ్రూ–గాంధీ కుటుంబ పాలనపై విరుచుకుపడేవారు. గొప్ప ‘లెఫ్ట్ లీనింగ్ లిబరల్’గా పేరుమోసిన జైపాల్ గారికి కూడా లోక్సభలో బాడీ షేమింగ్ తప్పలేదు. పాలక కుటుంబానికి అత్యంత విధేయుడైన బిహార్ కు చెందిన బ్రాహ్మణ కేంద్ర మంత్రి కమలాకాంత (కేకే) తివారీ (ఈ పంతులు గారు కూడా ఎంఏ ఇంగ్లిష్ చదివి కాలేజీలో అధ్యాపకునిగా పనిచేశారు) సహజంగానే జైపాల్ రెడ్డిగారిని అవమానించడానికి బాడీ షేమింగ్ పద్ధతిని ఎంచుకుని, ఓరోజు సభకు వచ్చారు. ఏదో చర్చ సందర్భంగా ఆ రోజు పాలకపక్షంపై జైపాల్ విరుచుకుపడ్డారు. ప్రధాని రాజీవ్ పై ఆరోపణలు చేశారు. దీంతో పట్టరాని కోపం తెచ్చుకున్న కేంద్ర మంత్రి తివారీ, ‘‘మీ కాళ్ల మాదిరిగానే మీ మెదడు కూడా వంకర తిరిగి ఉంది. అందుకే మీ ఆలోచనలు వంకరగా ఉంటున్నాయి,’ అంటూ అడ్డగోలుగా మాట్లాడారు. బాల్యంలో పోలియో వల్ల కాళ్లు మామూలుగా లేని జైపాల్ ను అలా అవమానించేవిధంగా కేకే తివారీ మాట్లాడడం కాంగ్రెస్ సభ్యులకు సైతం నచ్చలేదు. దీంతో కేకే తివారీ తన ‘వక్ర’ మాటలకు క్షమాపణ చెప్పారు.
చీకటిపడ్డాక కేరళ మహిళలు అందంగా ఉంటారన్న కాంగ్రెస్ బిహార్ మంత్రి ఏపీ శర్మ
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
బిహార్ కే చెందిన మరో కాంగ్రెస్ కేంద్ర మంత్రి అనంత్ ప్రసాద్ (ఏపీ) శర్మ 1980ల్లో పర్యాటక శాఖా మంత్రి. పార్లమెంటులో ఓరోజు టూరిజం మంత్రి హోదాలో కేరళలో టూరిజం అభివృద్ధి గురించి ఆయన మాట్లాడుతూ, ‘‘కేరళకు పర్యాటకులను ఆకర్షించే ప్రకృతి వనరులున్నాయి. ఇంకా మలయాళ మహిళలు చీకటిపడ్డాక బాగా అందంగా కనపడతారు’’ అని కాస్త బాడీ షేమింగ్, కొంత కమ్యూనిస్టుల నేల అనే ఎగతాళి కలగలిపి వ్యాఖ్యానించారు. దక్షిణాది సభ్యులు నిరసన తెలపగానే ఈ శర్మగారు కూడా వెంటనే క్షమాపణ చెప్పారు. కేరళ స్త్రీలు రాత్రిపూటే అందంగా కనిపిస్తారంటే– వారిలో ఎక్కువ మంది నల్లగా ఉంటారని, పగలు వారిని చూడలేమనే అర్ధంలో మంత్రి మాట్లాడారనే విషయం చాలా మందికి అర్ధమైంది.
‘నిన్నెవరూ రేప్ చేయర్లే, నీకెందుకు దిగులు?’ అని రాజ్యసభలో నటి నర్గీస్ ప్రశ్న
––––––––––––––––––––––––––––––––––––––––––––––––
పైన చెప్పిన సందర్భం మాదిరిగానే ఈ సంఘటన కూడా పార్లమెంటులో 1980ల్లోనే జరిగింది. బాలీవుడ్ తొలితరం మొగుడూపెళ్లాలైన నర్గీస్–సునీల్ దత్ దంపతులు మొదట్నించీ కాంగ్రెస్ అభిమానులు. సునీల్ దత్ 1984 నుంచి వరుసగా చాలాసార్లు వాయువ్య బొంబాయి నుంచి కాంగ్రెస్ టికెట్ పై ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, ఆయన కంటే ముందే ఆయన భార్య నర్గీస్ ఎంపీ అయ్యారు. 1980 జనవరిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ చివరిసారిగా ప్రధాని అయినప్పుడు, తమకు అనుకూలమైన పాత తరం నటి నర్గీస్ దత్ ను రాజ్యసభకు రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేయించారు. అంటే, 40 ఏళ్ల క్రితం పొలిటికల్ కరెక్ట్నస్, స్త్రీలతో కనీస మర్యాదతో మాట్లాడాలి, వ్యక్తుల శరీరాకృతిని బట్టి ఎవరినీ ఎగతాళి చేయకూడదనే సామాజిక చైతన్యం లేని రోజులవి. వీటిని సూత్రప్రాయంగా కూడా అందరూ అంగీకరించడం సంగతి దేవుడెరుగు, ఈ మాటలే చాలా మంది చదువుకున్నోళ్లకు తెలియని కాలమది.
నర్గీస్ తో పాటే ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత, ఇందిర చిన్న కొడుకు సంజయ్ అభిమాని అయిన కుష్వంత్ సింగ్ ను కూడా రాజ్యసభకు ఇందిరమ్మ నామినేట్ చేయించారు. ఈ ఇద్దరు సెలబ్రిటీలూ సభలో ఉండగా 1980లో ఓ రోజు, ఒక ఉత్తరాది రాష్ట్రంలో జరిగిన మూకుమ్మడి బలాత్కారం (గ్యాంగ్ రేప్ )పై రాజ్యసభలో వాడివేడి చర్చ జరుగుతోంది. (అత్యాచారం అనే మాట నచ్చదు. హిందీలో బలాత్కార్ అనే పదం వాడతారు) ప్రతిపక్ష సభ్యులు కాంగ్రెస్ పాలనను పరుష పదజాలంతో విమర్శిస్తున్నారు. ముఖ్యంగా బిహార్ కు చెందిన ప్రతిపక్ష సభ్యురాలు (బహుశా ఎస్సీ అనుకుంటా) ఒకామె ఈ గ్యాంగ్ రేప్ ను ఖండిస్తూ, ఇందిర సర్కారుపై విరుచుకుపడ్డారు. అవకాశమొచ్చినప్పుడల్లా ఇందిరమ్మపై భక్తి ప్రదర్శించే 41 సంవత్సరాల నర్గీస్ గారికి కోపం వచ్చింది. ఆవేశంతో లేచి, ‘‘నీకెందుకు అంత దిగులు? భయం దేనికి? ఎప్పటికీ నిన్నెవరూ రేప్ చేయరు లే,’’ అని నర్గీస్ గట్టిగా అరుస్తూ మాట్లాడారు. వెంటనే మిగిలిన సభ్యులు నవ్వారేగాని ఈ మాజీ నటి నోట నుంచి వచ్చిన దుర్మార్గపు మాటలను తప్పుపట్టలేదు. తర్వాత స్పృహలోకి వచ్చి వారు తప్పు తెలుసుకున్నారు.
బాగా పొట్టిగా, లావుగా, నల్లటి రంగులో ఉన్న ఆ ప్రతిపక్ష దళిత సభ్యురాలైతే– నటి నర్గీస్ మాటలకు షాకయి, నోట మాటలేకుండా అయిపోయారు. ఈ సభ్యురాలి ఉన్న శరీరాకృతి చూసి ఏ మగాడూ ఆమెను రేప్ చేయడనే అర్ధంలో నర్గీస్ మాట్లాడడం అప్పుడు బొంబాయిలోగాని, రాజధాని దిల్లీలో గాని తీవ్ర జుగుప్స కలిగించకపోవడం ఇప్పుడు ఆలోచిస్తే దిగ్భాంత్రికరం. 1980 నాటి ఈ ఘటన గురించి కుష్వంత్ సింగ్ 2007లో ఓ ఆంగ్ల దినపత్రికలో రాసిన తన కాలమ్ లో వివరించారు. ఇలాంటి బాడీ షేమింగ్ పార్లమెంటులో ఈ రోజుల్లో కనిపించకపోవచ్చుగాని, సమాజం నుంచి ఇది మాయం కావడానికి ఇంకా చాలా కాలం పడుతుందో లేక మనుషులున్నంత కాలం ఉంటుందో సామాజిక శాస్త్రవేత్తలైనా చెప్పగలరో, లేదో మరి. అయితే, మళ్లీ జైపాల్ రెడ్డి గారి మాటలనే గుర్తుచేసుకుంటే ఆయన తనమీదే ఎలా జోకులేసుకునేవారో అర్ధమౌతుంది. 2009లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి మరణం తర్వాత వచ్చిన కొణిజేటి రోశయ్యను తప్పించిన సందర్భంలో దిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్ పేరు కూడా సీఎం పదవికి ఆశావహుల లిస్టులో వినిపించింది. దీనిపై ఆయన స్పందిస్తూ, ‘‘సీఎం రేసులో జైపాల్ ఉన్నాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. నాకు కాళ్లే లేవు, మరి రేసులో ఎలా ఉంటాను?’’ అని చమత్కరించారు…
Share this Article