ఏదేని ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు… కరోనా వంటి వ్యాధులు ప్రబలినప్పుడు వ్యాపారసంస్థలు మూసేయడం సహజం… సినిమా కూడా వ్యాపారమే కాబట్టి థియేటర్లు కూడా మూసివేతకు గురవుతాయి… పైగా ఇదేమీ నిత్యావసరం కాదు… కానీ ప్రేక్షకులు రావడం లేదని బాగా పేరున్న పెద్ద థియేటర్లు కూడా మూసుకుంటున్నారంటే… అది ఖచ్చితంగా ఓ ప్రమాదసంకేతం… ప్రేక్షకులు థియేటర్ల వైపే రావడం లేదు దేనికి..? చాలా పెద్ద ప్రశ్న… ప్రస్తుతానికి థియేటర్ల వద్ద కూడా జవాబు లేదు… ఏడుపు తప్ప…
తెలుగు థియేటర్లను కాసేపు వదిలేయండి, మనం చెప్పుకునేది నార్త్ ఇండియాలోని హిందీ బెల్ట్ థియేటర్ల గురించి… మొన్న మనం చెప్పుకున్నాం కదా… విజయ్ దేవరకొండ వెళ్లి ముంబైలోని మరాఠామందిర్, గైటీ, గెలాక్సీ థియేటర్ల ఓనర్ మనోజ్ దేశాయ్ కాళ్లు మొక్కాడు గుర్తుంది కదా… అంతకుముందు ఆయన లైగర్ సినిమాను బూతులు తిట్టాడు… మమ్మల్ని ముంచేశారు కదరా అంటూ తిట్టిపోశాడు… చాలా పేరున్న థియేటర్లు అవి… ఇప్పుడేమైంది..? అలాంటి థియేటర్లకూ తాత్కాలికంగా మూసేశారు…
‘‘మరేం చేయమంటారయ్యా… ప్రేక్షకులు రావడం లేదు… లాల్‌సింగ్‌చద్దా, రక్షాబంధన్ సినిమాలతోనే దెబ్బతిన్నాం, లైగర్ కాస్త ఆదుకుంటుందీ అనుకుంటే అదీ దెబ్బతీసింది… కొత్త సినిమాలేమీ లేవు ఇప్పుడు… అయిదారు టికెట్లు తెగితే, ఆ షో రద్దు చేస్తే పంచాయితీ… మినిమం మెయింటెనెన్స్ కూడా రావడం లేదు..’’ అని చెబుతున్నాడాయన… నిజానికి తెలుగు థియేటర్లను ఎప్పటికప్పుడు ఏదో ఒక పెద్ద సినిమా ఆదుకుంటోంది… లేకపోతే మన థియేటర్ల గతి కూడా అంతే…
Ads
విక్రమ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ తరువాత థియేటర్లన్నీ ఖాళీ… బింబిసార, సీతారామం, కార్తికేయ వచ్చి ఆదుకున్నాయి… జనం కాస్తోకూస్తో థియేటర్ల వద్ద కనిపిస్తున్నారు… కానీ హిందీ బెల్టులో ప్రస్తుతం కార్తికేయ తప్ప మరో సినిమా నడవడం లేదు… చాలా థియేటర్లను టెంపరరీగా మూసేయడమో, మార్నింగ్ షోలనే రద్దు చేయడమో కామన్ అయిపోయింది… ఈ స్థితిలో అందరి దృష్టీ బ్రహ్మాస్త్ర మీద పడింది… ఆ సినిమాయే ప్రస్తుతానికి థియేటర్లను ఆదుకోవాలని ఆశపడుతున్నారు…
ఆ సినిమా కూడా తన్నేస్తే… బాలీవుడ్ అనూహ్య సంక్షోభంలో పడబోతోందీ అని అర్థం… కార్తికేయ, అఖండ తరహాలో బ్రహ్మాస్త్ర కూడా కాస్త దేవుడు, మహత్తులు, పురాణాలు, లీలల చుట్టూ తిరుగుతుందట… ప్రత్యేకించి దివ్యాస్త్రాల చర్చ, వర్తమానంతో లింక్ ఉంటుందట… ష్, దురదృష్టం కొద్దీ దీనికి కూడా కరణ్ జోహార్ నిర్మాత… ఇందులో అమితాబ్, రణబీర్‌కపూర్, ఆలియాభట్ తదితరులతోపాటు మన నాగార్జున కూడా ఉన్నాడు… 300 నుంచి 500 కోట్ల నిర్మాణవ్యయం అని చెబుతున్న ఈ సినిమాకు ఇప్పుడు 9న విడుదల కాబోయేది ఫస్ట్ పార్ట్…
నిజానికి పూరీ ఏమాత్రం ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా తీసి ఉంటే… కాస్త బాగున్నా సరే… లైగర్‌కు కాసులు కురిసి ఉండేవి… ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్క చూడబుల్ సినిమా కూడా లేదు… కానీ నాణేనికి మరోవైపు ఏమిటంటే..? నిజంగానే సినిమాలు బాగాలేక ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారా..? లేక థియేటర్లంటేనే భయపడుతున్నారా..? ఎప్పుడూ మంచి సినిమాలే రావాలనేముంది..? కానీ ఈ స్థాయి ప్రేక్షక తిరస్కరణ మునుపెన్నడూ లేదు… దానికి జవాబు వెతుక్కోకపోతే థియేటర్లు మరిన్ని కష్టాల్లో పడటం ఖాయం..!!
Share this Article