.
ఒక జంట… బాలీవుడ్‌లో ప్రస్తుతం పాపులర్… విశ్లేషణల్లో బహుళ చర్చనీయాంశం ఈ జంట మెరిట్… భర్త పేరు ఆదిత్య ధర్… భార్య పేరు యామీ గౌతమ్… ఒక ధురందర్, ఒక హఖ్… ఈ సినిమాలు ఇప్పుడు ఈ జంటను అమాంతం ఆకాశానికెత్తాయి…
కంట్రాస్టు ఏమిటంటే..? ధురందర్ బాలీవుడ్‌లో కొత్త రికార్డులు లిఖించుకుంది… 1200 కోట్ల వసూళ్లు అంటే మాటలు కాదు… ఇంకా నడుస్తోంది కూడా… ఇది సాదాసీదా కమర్షియల్ బాలీవుడ్ మార్క్ స్పై థ్రిల్లర్ కాదు… అనేకానేక ఉగ్ర సంఘటనల నేపథ్యాన్ని వివరించే సరికొత్త కథ… పలు దేశాల్లో నిషేధించినా సరే, సగటు ఇండియన్ ప్రేక్షకుడు మాత్రం బ్రహ్మరథం పట్టాడు… దీనికి దర్శకుడు ఆదిత్య ధర్…
Ads

అంతకు ముందు ఉరి సినిమా తీశాడు… తరువాత ఇదే… (ఆర్టికల్ 370 సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత కూడా… కానీ దర్శకుడు వేరే…) రెండే సినిమాలతో ఎక్కడికో వెళ్లిపోయాడు ఈ కశ్మీరీ పండిట్… తను నిర్మాత, దర్శకుడు, రచయిత మాత్రమే కాదు, గీత రచయిత కూడా..!
ఉరి సినిమాతో పరిచయం కావచ్చు… యామీ గౌతమ్ అందులో నటించింది… తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు… ఇప్పుడు హఖ్ అనే సినిమా చేసింది ఆమె… దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి ఆమె నటనకు… 1990 లలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబానో కేసు నేపథ్యంతో తీసిన కోర్ట్ రూమ్ డ్రామా ఈ సినిమా…

హిందీ, ఉర్దూ తెలిసిన వారికి ఈ సినిమా సంభాషణలలోని పదును, లోతు, గూడార్థం అవగాహనకు వస్తుంది… సుప్రీంకోర్టులో తనే స్వయంగా వాదించినప్పుడు యామీ గౌతమ్ నటన శిఖరాగ్రానికి చేరింది…
అటు భర్త దర్శకత్వం వహించిన ధురందర్ 1200 కోట్లతో ఇండస్ట్రీ హిట్ కొడితే… ఈమె నటించిన హఖ్ మాత్రం కమర్షియల్‌గా ఫ్లాప్… 40 కోట్లు ఖర్చు పెడితే 25-26 కోట్లు వచ్చినట్టున్నాయి… కానీ నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం దుమ్మురేపుతోంది…

ఫెయిర్ అండ్ లవ్లీ మోడల్‌గా అందరికీ తెలిసిన ఈ పంజాబీ పండిట్… వెబ్, టీవీ, ఓటీటీ, ఫిల్మ్, మోడలింగ్… అన్నింట్లోనూ తన ముద్ర ఉంది… కాకపోతే ఉరి సినిమాతో ఒక్కసారిగా పాపులరైంది… తరువాత ఆర్టికల్ 370తో మరింత… OMG2తో మరికాస్త… ఇప్పుడు హఖ్‌తో ఇంకాస్త…
మన తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే… నువ్విలా, గౌరవం, కొరియర్ బాయ్ కల్యాణ్ సినిమాల్లో ఆమే హీరోయిన్… కానీ తెలుగు, తమిళం సినిమాల్లో పెద్దగా పేరు రాలేదు… బాలీవుడ్ సినిమాలే ఆమె గమ్యం… అక్కడే ఆమెకు చప్పట్లు, బహుళ ప్రశంసలు… ఈమె సినిమా కుటుంబం నుంచీ వచ్చింది… పంజాబీ చిత్రదర్శకుడు ముఖేష్ గౌతమ్ కూతురు… 2021లో పెళ్లి చేసుకున్నారు ఆదిత్య, యామీ… ఒక కొడుకు, పేరు వేదవిద్..!!

Share this Article