బంధం నిలబడాలంటే బేడీలు పడాల్సిందే!
——————-
“తెలిసితే మోక్షము తెలియకున్న బంధము
కలవంటిది బదుకు ఘనునికిని”
పదకవితా పితామహుడు అన్నమయ్య ముప్పయ్ రెండువేల సంకీర్తనలు ముప్పయ్ రెండు వేల గ్రంథాలతో సమానం. అన్నమయ్య, పోతన, రామదాసు, త్యాగయ్య లాంటి పదిమంది కారణజన్ముల వల్ల తెలుగుకు ఆయుష్షు పెరిగింది.
Ads
తెలిస్తే మోక్షం- తెలియకుంటే బంధమట. అన్నమయ్య భక్తి జ్ఞాన వైరాగ్యాల కోణంలో చెప్పి ఉంటాడు. ఉక్రెయిన్ లో ఎప్పుడూ గొడవలుపడుతూ, విడిపోతూ, మళ్లీ గొడవలు పడడానికి కలిసే ఒక జంట బంధ- మోక్షాలను మరో రకంగా అర్థం చేసుకుంది. వారికి కలిగిన జ్ఞానంతో వారు పడుతున్న పాట-
తెలిసితే బంధము;
తెలియకున్న కబంధము;
కలిసితే బంధము;
కలవకున్న అబంధము- అని. (కబంధము, అబంధము మాటలు లేవు!)
ఒక పూటయినా గొడవపడకుండా ఉండలేకపోవడంతో వారిమీద వారికే విసుగు, జాలి పుట్టి; అది పశ్చాత్తాపంగా మారి; ఆ పశ్చాత్తాపంలో నుండి ప్రాయశ్చిత్తంగా ఒక ఐడియా వచ్చింది. ఆమె ఎడమ చేతికి, అతడి కుడి చేతికి బేడీలు వేసి తాళాలు బయటివారికి ఇచ్చి మూడు నెలల తరువాత రమ్మన్నారు. కాలపరిమితి త్వరగా ముగిసి, బేడీలు విప్పిన తరువాత కూడా వారు కలిసి ఉండాలని కోరుకుందాం. మరో ముప్పయ్ ఏళ్లు బేడీలు కొనసాగించాల్సిన అవసరం వారికి రాకూడదని ఆశిద్దాం.
——————
ఫ్యామిలీ కోర్టులకు, సైకాలజిస్టులకు రాని ఒక వినూత్నమయిన ఐడియా వీరికి వచ్చింది. తిట్టుకుంటూ, కొట్టుకుంటూ కలహాలతో కల్లోల కాపురాలు చేస్తున్న వారికి వీరు కొత్త పాఠం చెబుతున్నారు.
1 . గొడవ పెద్దది అవుతుంటే వెంటనే బేడీలు కొనుక్కుని- ఒకరికొకరు దూరం కాకుండా లాక్ చేసుకోండి.
2 . బేడీలు బయట మార్కెట్లో దొరకకపోతే కనీసం తుప్పు పట్టిన నాసిరకానివయినా దగ్గర్లో పోలీస్ స్టేషన్లో దొరకకపోవు.
3. బేడీలు వేసుకున్న తరువాత జీవితాన్ని ఊహించకూడదు. ఎవరికి వారు అనుభవించాల్సిందే.
4. మెడలో వేస్తే పసుపు తాడు. బంధం నిలవడానికి, నిలిచి గట్టిపడడానికి చేతులకు వేసే వాటికి బేడీలు అంటే అమర్యాద. అశుభం. అమంగళం. ఈ బేడీలకు మంగళ బేడీలు, బేడీ బంధన్, బేడీ సూత్రం, స్వర్ణ బేడీ, రజత బేడీ, ఇనుప బేడీ, అల్యూమినియం బేడీ…ఇలా పేర్లు పెట్టి సమాజంలో ఎవరి స్థాయికి తగ్గట్టు వారు కొనడానికి వీలుగా మార్కెట్లో అందుబాటులో ఉంచాలి.
5. విడిపోయే బ్రేకప్ పార్టీలే ఊరి బయట ఫామ్ హౌస్ లో పెళ్లికంటే ఘనంగా జరుగుతున్నప్పుడు- బేడీల లాకప్ పార్టీలు కూడా మేళతాళాలతో, బాజా బంత్రీలతో ధూమ్ ధామ్ గా జరగాలి.
6 . లాకప్ మూడు నెలల సి సి టి వి ఫుటేజ్ ను ప్రాంతీయ టీ వీ చానెళ్లు బిగ్ బాస్ ఎపిసోడ్లలా టెలిక్యాస్ట్ చేయడానికి సమాచార ప్రసార శాఖ అనుమతించాలి.
7. లాకప్ బేడీల్లో వాడే లోహం నాసిరకానిదయితే త్వరగా తెగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి- ఐ ఎస్ ఐ ప్రమాణాలు పాటించాలి.
8. నేరాలు, ఘోరాలు చేసినవారికి వేసే బేడీలకు- విడిపోకుండా కలిసి ఉండడానికి వేసుకునే బేడీలకు రంగు భేదం పాటించాలి. లేకపోతే చేయకూడని నేరమేదో చేస్తే జంటకు బేడీలు వేశారని లోకం అపార్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది.
9 . మూడు నెలల బేడీ బంధం అలవాటయ్యాక- జీవితాంతం బేడీలు అలాగే ఉంచుకుంటామనే జంటలకు ఆ అవకాశం కల్పించాలి….. By…… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article