Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మహల్లో కోయిల… ఇది వంశీ రాసిన కథ కాదు… వేరే… ‘కోటలో రాణి’…

August 18, 2025 by M S R

.

Bharadwaja Rangavajhala …. బూబు డాబా …… కృష్ణా జిల్లాలో కృష్ణా నది ఒడ్డును ఆనుకుని ఉండే ఆ ఊర్లో బూబు డాబా అనేది ఓ లాండ్ మార్కు.

బస్టాండు దగ్గర నుంచీ రిక్షా మాట్లాడుకునేవాళ్లు దిగేందుకు చెప్పే లాండ్ మార్కుల్లో బూబు డాబాకి చోటు ఉండేది. అంత పాపులర్. బూబును చూసిన వాళ్లు మహా ఉంటే ఓ పది మంది ఉంటారేమో ఆ ఊరి మొత్తం మీద.
బూబు డాబా తలుపులు ఎప్పుడూ మూసే ఉండేవి.

Ads

బూబు డాబాకి పెద్ద పెద్ద అరుగులు ఉండేవి. ఆ ఏరియా పిల్లలు ఆ అరుగుల మీద ఆడుకునేవారు. ఈ గోల లోపలికి వినిపించేది … పిల్లలు బాగా ఉన్నారు అనేది రూఢీ అయిన తర్వాత బూబు డాబా తలుపులు మెల్లగా తెరుచుకునేవి.
ఓ పనమ్మాయి బయటకు వచ్చి పిల్లలకు లడ్డూలు పెట్టి మళ్లీ లోపలికి వెళ్లిపోయేది. అప్పుడు తలుపు సందుల్లోంచీ రెండు కళ్లు కనిపించేవి … అవి బూబు కళ్లే అని జనం మాట్లాడుకునేవారు. ఆ కళ్లు రహస్యంగా చూసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. బహిరంగంగా చూసే ధైర్యం ఎవరూ చేయలేదు.ఇదంతా ఓ అరవై ఏళ్ల నాటి కథ …

బూబుది ఏ ఊరో ఎవరికీ తెలియదు. తెలంగాణ ప్రాంతం నుంచీ వచ్చింది అనేది మాత్రం జనాలకు తెల్సు. బూబు అందాలను గురించి కథలుకథలుగా చెప్పుకునేవారు.
వినడం ఆ విన్నదాన్ని ఇంకొంత సాగ్గొట్టి ఇంకోళ్లకు చెప్పడం ఇలా చూసింది గోరంత అయితే బూబు గురించి ప్రచారంలో ఉన్న విశేషాలు పర్వతం అంత.
బూబు చాలా మంచిది దయకలది అని కూడా ఊళ్లో ప్రచారం ఉంది.

పనివాళ్ల ద్వారా ఊళ్లో పల్లె గూడెం జనాల కష్టాలు తెల్సుకునే సందర్భంలో బూబు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి పంపి బాధితులను ఆదుకున్నట్టు దాఖలాలు ఉన్నాయి. అసలు బూబు ఆ ఊరికి ఎలా చేరిందంటే….

ఆ ఊరి దొర తెలంగాణ ప్రాంతంలో కాంట్రాక్టులు చేసే రోజుల్లో ఓ పల్లెటూర్లో బూబు కనిపించిందట. అంతే మనసు పడ్డారు.
అసలు బూబుని చూసి మనసు పడకుండా ఎలా ఉంటారు? ఎవరైనా అని బూబును చూసినోళ్ల మాట ..
అలా దొర మనసు పడి బూబును తనతో పాటు తెచ్చేసుకున్నాడు. గత్యంతరం లేక తనూ వచ్చేసింది ….

బూబును తెచ్చుకుని ఈ డాబా కట్టించి అందులో ఉంచాడు ఆ ఊరి దొర.
ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఆ బూబు అని పిలవబడే మహిళ బైటకు వచ్చింది తక్కువే. వచ్చినా రహస్యంగానే.
ఎప్పుడైనా దగ్గర్లో టౌనుకు సినిమాకి వెళ్లినా … అంతా పరదాపద్దతిలోనే నడిచేది. ఘోషా అమల్లో ఉండేది.
బూబు ఇంట్లోంచీ కారులోకి వచ్చే వరకూ పరదాలు కట్టేసేవారు. బూబును చూడ్డానికి కొందరు యువకులు దొంగదారిలో ప్రయత్నాలు చేసి దొరికిపోయి దెబ్బలు తిన్నారు కూడా.

ఇలా ఉండగా …
బూబు ఊళ్లోకి వచ్చిన ముప్పై సంవత్సరాల తర్వాత … ఓ రోజు పొద్దున్నే … దొర ఆకస్మాత్తుగా కన్నుమూశాడు.
అప్పటికి దొరకి ఎనభై ఏళ్లు … బూబుకి యాభై ఏళ్లు.
ఊళ్లో పుకారు షికారు చేసింది.
అయిపోయింది బూబు పని … దాన్ని బయటకు లాగి ఊర్నించీ గెంటేస్తారింక అని బ్రాహ్మణ, కమ్మ తదితర అగ్రకులాల పెద్దలు అరుగుల మీద పంచాయితీల్లో విస్తృతంగా మాట్లాడేసుకున్నారు పాపం.

దొర మీద కోపం ఎలా వెళ్లగక్కాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయిన ఈ పెద్దలందరూ బూబును దొర కొడుకులు ఈడ్చి రోడ్డున పడేస్తారని బలంగా నమ్మారు. దొర పెళ్లాం కూడా ఈ పని అయ్యేదాకా సిగ ముడి వెయ్యదు అని వీళ్లల్లో వీరే ఫిక్స్ అయిపోయారు. కానీ జరిగింది ఇంకొకటి. దొర పెద్ద కొడుకు బూబు డాబాకి వచ్చి … ప్రహరీ దాటి గుమ్మంలో నిలబడి లోపల బూబుకి వినిపించేలా … చెప్పాడు …

అమ్మా … నాన్నగారు వెళ్లిపోయారు. మీరు ఎంత బాధ పడుతున్నారో నాకు తెలియనిది కాదు … అయితే ఈ ఇల్లు మీ పేరుతో నాన్నగారు రాసిన పత్రాలను మీకు అందచేయడం నా బాధ్యత కనుక వచ్చాను. అలాగే … మీ ఇంటి ఖర్చు నిమిత్తం నెలకు ఎంత పంపాలో నాన్నగారు తన వీలునామాలో స్పష్టంగా రాశారు.
ఆ రొక్కం మీకు నెలనెలా కరణం గారు తెచ్చి ఇచ్చేస్తారు.
మీరు హాయిగా ఆనందంగా ఇక్కడే ఉండాలి అనేది నాన్నగారి కోరిక … వారి కోరిక మీరు తప్పక తీరుస్తారని నా నమ్మకం ఇలా మాట్లాడేసి, కాయితాలు ఇచ్చి ఓ రెండు నెల్ల ఖర్చు అని ఆ రోజుల్లోనే నాలుగు వేల రూపాయలు కరణం చేతుల్లో పెట్టి వెళ్లాడు.

అరుగుల మీద పెద్దలు అవాక్కయ్యారు.
దొరని దొర కొడుకునీ రహస్యంగా తిట్టుకున్నారు.
అప్పటి నుంచీ బూబు పూర్తిగా డాబాకే పరిమితం అయిపోయింది. ఎప్పుడైనా వంట్లో బాగోకపోతే డాక్టర్ గారిని ఇంటికే రప్పించుకోవడం జరిగేది. తాను విడిగా … బయటకు వెళ్లడం అనేది పూర్తిగా మానేసింది…

రెండు మూడు సార్లు … దొర చిన్న కొడుకు వచ్చి కాస్త గాలి మారితే మంచిది అని … ఎటైనా యాత్రలకు వెళ్తారా, ఏర్పాట్లు చేస్తాం అని అడిగాడు… అది అతనికి అనిపించి వచ్చి అడిగిన మాట కాదు దొరసాని అడిగిరమ్మంటే అడగడానికి వచ్చాడు. అడ్డంగా తలూపి … నాకు ఎక్కడకీ వెళ్లాలనిపించడం లేదు అని కబురు పెట్టింది.
విషయం తెల్సిన దొరసానికి స్వయంగా వచ్చి ఓదార్చాలనిపించింది. ఇంటికి పిలిపించేసుకుని కల్సి ఉండాలి అని కూడా అనిపించింది. ఇదే మాట తమ్ముళ్లతో అంటే వద్దు అన్నారు. దీంతో ఆగిపోయింది.

ఇలా ఓ పదేళ్లు జరిగాక ఓ రోజు బూబు డాబా నుంచీ కరణం గారింటికి కబురు వెళ్లింది.
ఆయన పడుతూ లేస్తూ వచ్చాడు. అంత వరకూ బూబు ఎలా ఉంటుందో ఆయనకీ తెలియదు. చూడొచ్చు అనే ఉద్దేశ్యంతోనే వచ్చారు. బూబు తొలిసారి ఆ ఊరి పరాయి పురుషుడికి కనిపించింది. ఆ మూర్తిని చూసి కరణం గారి నోట్లో లాలాజనం ఆవిరైపోయింది. అంత సౌందర్యాన్ని అంతకు ముందెన్నడూ చూడలేదు. దేవతల్లే కనిపించిన బూబును చూసి చేతులెత్తి దణ్ణం పెట్టేశారు.

కరణంగారూ. ఆ రాజు ఎందుకు నన్ను ఇక్కడికి తెచ్చాడో నాకు తెలియదు. వచ్చాక ఇదే నా ఊరూ అనుకున్నాన్నేను.
ఆయన పోయినప్పుడే నేను ఈ ఊరు విడిచి వెడతానని కొందరు అనుకున్నట్టుగా నాకు తెల్సు. పనిమనిషి వస్తుంది కదా … తను తెచ్చే వార్తలే నాకు ప్రపంచం… అలా తెల్సింది… గతం గతం … వదిలేయండి … నేను వీలునామా రాద్దామని మిమ్మల్ని పిలిచాను…

నాకు బ్యాంకులో కొంత డబ్బులున్నాయి. అలాగే ఈ ఇల్లు ఉంది. ఈ రెండూ నా తదనంతరం ఈ ఊరి ఆసుపత్రికి చెందేలా వీలునామా రాద్దామనుకుంటున్నా …
ఈ ఊళ్లో పడక ఆసుపత్రి లేకపోవడంతో చాలా మంది పక్క టౌన్లకు పోతున్నారు వైద్యానికి …
ఆసుపత్రి ఎలాగూ నా ఇంటి పక్కనే కనుక … ఈ డాబా అందులో కలిపిస్తే … హాయిగా పడకల ఆసుపత్రిగా చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం.
డాక్టర్ గారితో ఇప్పటికే మాట్లాడేశాను.
నాకు కాన్సర్ … ఎప్పుడు పోతానో తెలియని పరిస్థితి అని డాక్టర్ చెప్పారు.
అందుకే ఈ హడావిడి … అని ఆపింది బూబు.

ఒక్కసారి దొరగారి పిల్లలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారేమో అనీ అని నసిగారు కరణం గారు …
అక్కర్లేదు …. పత్రాలు నా పేరుతోనే ఉన్నాయి … స్థిరంగా చెప్పింది బూబు గారు …
అవునవును … నాకు తెల్సు … నేనే ఆ పత్రాలు రాసింది కూడా. అందులో సాక్షి సంతకాలు తన పిల్లలతోనే పెట్టించారాయన తెలివిగా … అని వివరించారు కరణం గారు.
ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు బూబు వెళ్లిపోయింది …

డాబా ఉండిపోయింది. బూబు అంతమయాత్ర ఖర్చులన్నీ దొర ఇంటి నుంచే నడిచాయి. దాదాపు తల్లి చనిపోయినంత హడావిడి చేశారు దొర పిల్లలు.
బూబు కోరిక మేరకు డాబా ఆసుపత్రికి ఇచ్చేశారు.
ఇప్పుడు ఆ ఊళ్లో పడకల ఆసుపత్రి వచ్చింది. తన బ్యాంకు అకౌంటులో ఉన్న డబ్బులతోనే బెడ్స్ కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ సెంటర్ పేరు చిన్న మార్పుకు గురైంది.
బూబు ఆసుపత్రి సెంటర్ గా మారింది.
బూబు పేరేంటో కరణం గారికి ఆ వీలునామా రోజే తెల్సింది ….
రుబీనా …. అలా ఆవిడ ఆ ఊళ్లో ఇంకా బతుకుతూనే ఉంది …

మొత్తానికి బూబు భలే పన్జేసిందయ్యా .. ఆసుపత్రికి ఇచ్చేసి … అన్నారు అరుగు మీద కూర్చున్న శాస్త్రి గారు ….
అవునవును … చుట్టూ మన ఇళ్లున్నాయని తెల్సి … బూబు ఇంట్లో నీచు వండేది కాదట తెల్సా? ఆ సంతోషమ్మ చెప్పింది … శాకాహారమే నడిచేదట … ఎప్పుడైనా దొరకి కావాలి అనిపిస్తే … సంతోషమ్మ ఇంట్లో వండించి తెప్పించేదట … ఎన్నదగ్గమనిషే … అని శాస్త్రిగారి మాటకు సమాధానం ఇచ్చారు అవధాని గారు.

పోన్లేండి శాస్త్రి గారూ … జనానికి ఉపయోగపడే పన్జేసి చచ్చింది … మొన్న మా కోడలు ప్రసవం అప్పుడు చూశాను … డాబా చాలా పెద్దగా ఉందయ్యా … అంత ఇంట్లో ఒక్కత్తే ఎలా ఉండేదో … అన్నారు చౌదరి గారు …
ఇలా బూబు గురించిన కథలు ఇంకా అప్పుడప్పుడూ అరుగుల మీద చర్చకు వస్తూనే ఉన్నాయి… బూబు వెళ్లిపోయి కూడా ముప్పై ఏళ్లు అయిపోయింది… అయినా ఇంకా అరుగుల మీద టాపిక్ లోకి వస్తూనే ఉంటుంది…
……

(ముఖచిత్రం కేవలం ప్రతీకాత్మకం మాత్రమే)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మహల్లో కోయిల… ఇది వంశీ రాసిన కథ కాదు… వేరే… ‘కోటలో రాణి’…
  • ఉపరాష్ట్రపతి ఎంపికపైనా ఆర్ఎస్ఎస్ ముద్రపడింది… ఎవరాయన..?!
  • అర్జెంటుగా ఓ దాసరి కావలెను..! ఆ లోటు బాగా కనిపిస్తోంది ఇప్పుడు..!!
  • KTR వింత విమర్శలు… పోలవరం నాణ్యతతో తెలంగాణ పార్టీలకు ఏం పని..?!
  • ఇన్‌సెన్సిబుల్, ఇన్‌సెన్సిటివ్ స్కిట్… ఇందులో విజ్ఞానం ఏముందిర భయ్..?!
  • ట్రంప్ – పుతిన్ భేటీ… తక్షణ ప్రయోజనం ఇండియాకే… ఎలాగంటే..?
  • ట్రంప్- పుతిన్ భేటీ ఉక్రెయిన్ శాంతికై కాదు… అసలు చర్చ ఆర్కిటిక్..!!
  • బారా ఖూన్ మాఫ్..! ఎవరు చేసిన పాపాన వాళ్లే పోతారు… అంతే ఇక..!!
  • చప్పట్లు, శాలువాలు, దండలు, అవార్డులు దక్కాల్సింది రాధికకు కూడా..!!
  • మోహన్‌లాల్ ఖాళీ చేసిన కుర్చీలో… తొలిసారిగా ఓ ఫైర్ బ్రాండ్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions