.
ప్రస్తుతం తెలుగు వీక్లీ, మంత్లీ మ్యాగజైన్లు ఏమీ లేవు కదా మార్కెట్‌లో… స్వాతి వంటి ఒకటీ అరా తప్ప… దాంతో దినపత్రికల సండే ఎడిషన్లు లేదంటే డిజిటల్ ప్లాట్‌ఫారాలను ఆశ్రయించాల్సి వస్తోంది రచయితలు…
Ads
పబ్లిషింగ్ హౌజులు కూడా పెరిగిన పుస్తక ప్రచురణ వ్యయం, తగ్గిపోయిన విక్రయాల నేపథ్యంలో గరిష్టంగా పుస్తకాల ముద్రణను తగ్గించుకున్నాయి… ఈ స్థితిలో కొందరు రచయితలు సొంతంగా పుస్తకాలు పబ్లిష్ చేసుకుంటున్నారు…
వాళ్ల కష్టాలపై మిత్రుడు ప్రభాకర్ జైనీ రాసిన పోస్టు ఒకటి… పరిస్థితికి అద్దం పడుతోంది… అది ఇలా…
కొన్ని పబ్లిషింగ్ హౌజులు, మనం ప్రచురించిన పుస్తకాలు తీసుకుంటాయి. కానీ ధరలో 40% డిస్కౌంట్ ఇవ్వాలి. వాటికి మిగిలిన 60% డబ్బులు కూడా వెంటనే ఇవ్వరు. ఓ ఆర్నెల్లకో, సంవత్సరానికో, ఐదు సంవత్సరాలకో ఇస్తారు.
మొత్తానికే ఎగ్గొట్టే వారు ఎందరో! {ఇవన్నీ నా స్వీయ అనుభవాలే} ఇక పుస్తకాలను మనమే తీసుకుపోయి ఆయా షాపుల్లో ఇవ్వాలి. దానికి కొంత ఖర్చు. మిగిలిపోయి, మురిగిపోయి, అట్టలూడిపోయిన పుస్తకాలను మనమే రిటర్న్ తీసుకోవాలి. దానికి కొంత ఖర్చు.
ఉదాహరణకు సుమారు రెండు వందల పేజీల ఒక పుస్తకం ప్రచురణకు, 300 కాపీలకి, లేటెస్ట్‌గా, అంటే ఏప్రిల్ లో పబ్లిష్ చేసిన పుస్తకానికి, 42 వేలు ఖర్చయింది నాకు. అంటే, ఒక పుస్తకం ప్రింటింగ్ ఖర్చు 140 రూపాయలు పడింది. కవర్ పేజీ నేను స్వంతంగా డిజైన్ చేసుకుంటేనే. లేకపోతే దానికో ఐదారువేలు అదనపు ఖర్చు.
అది మనింటికి చేరే వరకు ప్యాకేజింగ్ ట్రాన్స్పోర్టు, ఆ పుస్తకాలను మళ్ళీ పబ్లిషర్ కు చేర్చడానికి, ఓ పది రూపాయలు వేసుకుంటే, ఒక పుస్తకానికయ్యే ఖర్చు 150 రూపాయలు. 200 పేజీల పుస్తకానికి వెల 200 పెట్టాలా 250 పెట్టాలా అని ఆలోచించి 250 పెట్టామనుకోండి.
పబ్లిషర్ మనకు 250 x 40% డిస్కౌంట్ కట్ చేసి 150 కి బిల్లు ఇస్తాడు. ఆ మొత్తం కూడా ఆరు నెలలో, సంవత్సరానికో ఓ పది కాపీలు అమ్ముడుపోయాయని, ఓ వెయ్యో, రెండు వేలో చేతుల్లో పెడతాడు.
ఇక డైరెక్టుగా రచయిత దగ్గర నుండి కొనే పాఠకులు, డిస్కౌంట్ లేనిదే కొనరు. వారికి ఒక 20% అంటే యాభై రూపాయలు డిస్కౌంట్ ఇస్తే 200 రూపాయలు పంపిస్తారు. దానికి స్పీడ్ పోస్ట్ ఖర్చు, ప్యాకింగ్, ఒక మనిషి వెళ్ళి పోస్ట్ చేయడం – మానవ శ్రమ, పోస్టేజి, పుస్తక ప్రచురణ ఖర్చు – అన్నీ కలిపి యాభై రూపాయల పైనే అవుతాయి. అంటే ఎలా చూసినా స్వంతంగా పుస్తకాలను ప్రచురించుకున్న రచయితకు నష్టమే…
Share this Article