.
పోలీస్_రాసిన_నవ్వుల_కథలు!
పాత సినిమాల్లో ఓ పాపులర్ సీన్ ఉంటది. హీరో ఫ్రెండు జగ్గయ్యనో, కథానాయకుడి బాబాయి గుమ్మడినో విలన్ గ్రూపువాళ్లు కత్తిపోటు పొడిచి పారిపోతుంటారు. ఫైట్‌లో వాళ్లను చెల్లాచెదురు చేసేసి, ‘భా…భా…య్హ్’ అంటూ అరుస్తూ ఆ పడిపోయినవాణ్ణి చేతుల్లోకి తీసేసుకుంటాడు హీరో. సరిగ్గా సదరు కత్తిని లాగేసే టైమ్‌కు ఠంచనుగా వచ్చేసే పోలీసులు అతడితో అనే మాట ‘యువార్ అండర్ అరెస్ట్’ అని.
Ads
ఏం… మా గోపిరెడ్డి మాత్రం పోలీస్ కాదా? ఆమాత్రం డైలాగ్ చెప్పలేడా? అలా ఆయన నోట వచ్చిన మాట… ‘‘దెన్ యూవార్ మై ఆత్మీయవాక్యం రైటర్’!’’ అని. సరిగ్గా కత్తి లాగేసే అమాయకుడు పోలీసులకు దొరికిపోయినట్టుగా నేనూ మా గోపిరెడ్డికి దొరకడానికి కారణం… ‘‘నీ బుక్కులో మంచీ మ్యాటరుందీ, హ్యూమరుందీ’’ అంటూ చెప్పిన ఎక్స్‌టెన్షన్ వాక్యం!!
దాంతో పోలిస్ చురుకు చూపుల్తో గోపిరెడ్డి నోటి నుంచి వచ్చిన మాట… ‘‘అయితే ఆ ఆత్మీయవాక్యమేదో నువ్వే రాయి’’ అని. ‘మ్యాటరూ, హ్యూమరూ’ అంటూ ప్రాస మాటలు నేను ఎందుకన్నానంటే… పోలీసుల్తో మనకెందుకు అనే స్కీము కింద మా గోపిరెడ్డి రాసిన ఆ నిరుపమాన హాస్యకావ్యాన్ని చదవకముందే ‘అద్భుతం’ అని అనేశా. నేను బాగా చదివాకే అద్భుతం అనే మాట అన్నాననే నమ్మకాన్ని గోపిరెడ్డికి కల్పించడం కోసం ఆ ఎక్స్‌ట్రా వాగుడు వాగేశా.
* * * * *
మొదట ‘అద్భుతం’ అనే ఓ మాటను పడేసి… ఆ తర్వాత మెల్లగా ‘నలుగురితో పాటూ ఎమ్మెస్ నారాయణా… నందమూరి రామా… సూపర్‌స్టార్ కృష్ణా’ అనుకుంటూ నింపాదిగా బుక్కు చదువుదాంలే అనుకున్నా. కానీ గోపిరెడ్డి ఆత్మీయవాక్యం రాయమన్నాక మొదట్లో ఏదో మొహమాటానికి అన్నట్టు ధ్వనించేలా ‘ఎందుకులే బావా’ అనేశా.
అలా అనడానికీ ఓ కారణముంది. తెలిసినవాళ్ల గురించి ఏదైనా రాయాలంటే బోల్డంత తంటా. మా గోపిరెడ్డి గురించి ఏదైనా కాస్త మంచిగా రాశాననుకోండి. ‘‘వాళ్లూ వాళ్లూ పరిచయస్తులు కాబట్టి… ప్రీ రిలీజ్ వేదిక మీద హీరోలూ, డవిరెట్టర్లూ పరస్పరం పొగుడుకున్నట్టుగా గోళ్లు పెంచుకుని మరీ గోక్కుంటారు ఒకరి వీపులు మరొకరు. ఇదంతా ఓ క్విడ్–ప్రో–కొక్కరకో యవ్వార’’మంటూ వీపు వెనకే వెక్కిరించే ప్రమాదం ఉంది. అందుకే మొదట నేనంతగా మొగ్గుచూపలేదు.
అన్నట్టు… పుస్తకం చదవకముందు అతితెలివితో నేనో పని చేద్దామనుకున్నా. అదేమిటంటే… పెదవులు రెండూ సాగదీసి, రెండువైపులా చెవులకు అంటించే ఫెవికాల్ ఏదైనా రాసుకుని, ఓ సెల్ఫీ తీసుకుని గోపిరెడ్డికి పంపుదామనుకున్నా. సెల్ఫీ ఎందుకంటే కోర్టు రూములో కామెడీ కుట్రల అల్లూ రామలింగయ్యలాంటి సాక్ష్యంలా… ఈ బుక్కు నేను చదివానన్న ఎవిడెన్సు కోసం.
అతితెలివితో నేను చేద్దామనుకున్న ప్రతి పనీ బెడిసి కొడుతుంది. ఒక్క నాకేమిటి… ఎందరో మహానుభావులు అందరికీ అవమానాలు. అంతే.! మహామహా మిస్టర్ బీన్‌లూ, బ్రహ్మానందాలూ తెగ బోల్డెంత చాలా అతితెలివితో మాంచిమాంచి ప్లాన్లు వేస్తారు. మరుక్షణం అది బెడిసికొడుతుంది. బొక్కబోర్లా పడతారు.
ఎట్టకేలకు బుక్కు చదవక తప్పలేదు. కానీ… ఈసారి చదివాక మనస్ఫూర్తిగా అంటున్న మాట కూడా ‘అద్భుతం’ అనే.
పుస్తకం మొదలుపెట్టాక మీరైనా నేనైనా నవ్వకుండా ఆపుకోలేకపోవడం అన్నది మన తప్పు కానే కాదు. ఎందుకంటే… ఈ గ్రంథపు గనిలో రెండు పెదవులకూ సరిపోనన్ని నవ్వుల నిధులున్నాయి!!
* * * * *
ఈ పుస్తకపు కా‘మె(డీ)నీమెనీ’ చుడువాలోని శాంపిల్ హ్యూ‘మరమరా’ల్లాంటి కొన్ని ఉదాహరణలివి…
‘సన్మాన సౌరభం’ అనే కథనంలో… ఒక కోటీశ్వరుడి ఆలోచనల లోతెంతో కొలవడానికి తన రచనా స్కేలుతో బయల్దేరిన గోపిరెడ్డి రాసిన మాట.. ‘ఆయన ఆలోచనలు బిగ్‌బజార్ లాంటివి గానీ, రాజకీయాలు మాత్రం కిరాణ కొట్టు స్థాయి దాటలేదు’’ అని.
అదే ఐటమ్‌లో సభాధ్యక్షత వహించేవారి ధోరణికి పేరడీగా… ఎవ్వరు మాట్లాడినా, స్టేజీ ఎక్కినవాడు అసలేదీ మాట్లాడకపోయినా సదరు సభాధ్యక్షుడు సాంబయ్య చెప్పే ముక్తాయింపు స్టాక్ వర్డు… ‘‘థ్యాంక్యూ ఫలానా గారూ… మీరేదైతే చెప్పారో అది పాటిస్తామండీ’’ అని.
ఒక మొగుడూ–పెళ్లాల పంచాయతీకి ‘‘జాతి వైరం’’ అనే పదాన్ని కాయిన్ చేయడమైతే జాతీయాంతర్జాతీయ అవార్డులకు అర్హమైన మాట.
‘టామ్ అండ్ జెర్రీ’ కథలో పాఠకుడికి తెలిసివస్తుంది… ప్రతి ఎలుకా తప్పనిసరిగా ఓ పిల్లినే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనీ… ఆ పెళ్లిళ్లకు పీనల్ కోడ్‌లతో రూల్‌బుక్ అయిన ‘వివాహ వివాద శిక్షార్హ నిబంధనా సంహిత’ అనే ఓ ఉద్గ్రంథముంటుందనీ, అందులోని 498 (ఎ) నిబంధన… ‘ముందుకంటే వేధింపులు మితిమీరును’ అనే రూలును కలిగియుండి, రూల్ పొజిషన్‌ను తెలియజేస్తుందనీ!
అఖిల ప్రపంచపు అనాది ఆనవాయితీయ యూనివర్సల్ ట్రూత్త్‌ను ఔపోసన పట్టేసి, కాసివడపోసి, సారం పిండాక వెలువడిన ఓ సత్యపు మాట… ‘ఈలోకంలో ఏ ఎలుకైనా చివరికి పెళ్లి చేసుకోవాల్సింది పిల్లినే!’ అట.
ఇక పెళ్లయ్యాక ఆ క్యాటండ్ మౌస్ తాలూకు ‘టామండ్ జెర్రీ’ గేములోని మొగుడి జర్నీ తాలూకు డెస్టినేషన్‌ను వర్ణిస్తూ రచయిత రాత సొగసును ఓసారి పరికించి చూడండి.
భార్య పిల్లిగారు భర్త ఎలకను రోడ్డు మీదికి విసిరేశాక సదరు దాని దీనహస్బెండేం చేస్తాడంటే…‘‘నల్లనిరోడ్డు మీద చిందరవందరగా చిల్లిపడిన ఆత్మాభిమానాన్ని ఏరుకొని ఎవరూ చూడ్డంలేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత మెల్లగా లేస్తాట్ట’’ ఆ ఎలకమహాశయుడు! ఇక అందులోంచే రచయిత విసురుతూ పోలిక చెబుతున్న కింకర కంకర గుళిక… ‘‘రాళ్ల వానకు గురైన కారులాగా ఉంద’’ట భర్తగారి బానెట్ వీపు!!
ఫ్రాయిడ్ ఉపన్యాస కార్యక్రమంతో మొదలయ్యే ‘నాలో నేను’ అనే కథలో ‘అ ఆ ఇ ఈ’లను పరమ తార్కికంగా చెబుతాడు రచయిత. అంటే… అధివాస్తవిక ధోరణిలో… ‘అంతరాత్మ యొక్క ‘ఆ’బ్‌స్ట్రాక్టి‘విట్టీ’ ‘ఇ’జమ్ తాలూకు ‘ఈ’తిబాధలే ఈ ‘అఆఇఈలు’.
‘పార్టీ పెట్టి చూపిస్తా’ అనే కథలోని న్యూస్‌పేపర్ల పేర్లయిన… ‘నేనే జనం’, ‘నిక్కచ్చి’, ‘నిజాలూ–నిష్టూరాలు’, ‘నిర్దయ’, ‘దమ్ముందా’… ఇత్యాది పత్రికల పేర్లను అచ్చం అసలు సిసలు పత్రికల పేర్లు లాగే అనుకరిస్తూ… తన సున్నితపు తరాజుతో నిశితంగా తూచినట్టూ, కోణమానితో కొలిచినట్టుగా పేర్లు పెడతాడీ రచయిత. ఇటు పత్రికలనే కాదు… పార్టీల ధోరణినీ ఎండగడతాడీ కథలోనే… ‘పార్టీ పెరుగుదల అంటేనే అధ్యక్షుడి ఎదుగుదల’ వంటి తన పదునైన వాక్యాలతో.
రాసిన గ్రంథాలకు ముందుమాటలు ఎవ్వడైనా రాయగలడు… కానీ రచయిత మిత్రులు ఎంతటి మగానుబావులంటే… వారంతా ‘రాయని గ్రంథానికీ ముందుమాట’లు అలవోగ్గా రాయగలరు. కాయని సొరకాయకు ఒడుపుగా కత్తికోతలు’ పెట్టగలరు. అలాంటి ఆణిముత్యాలూ, జాతిరత్నాలూ గోపిరెడ్డికి స్నేహితులుగా ఉండటం ఆయన అదృష్టం… అంతటి గొప్పపీసులు రాసి కూడా వాళ్లలో బీరకాయపీసంత గర్వం కూడా లేకపోవడం వాళ్ల నిరాడంబరతకు చిహ్నం.
పోలీసు రాసే కథలు కాబట్టి… ఇందులో గమ్మత్తు ‘దొంగ’లుంటారు. గ్లాసులూ, కప్పులూ కొట్టేసే కరోడా కూతుళ్లుంటారు. పోలీసు మర్యాదలను చవిచూసి మ్రాన్పడి మనసును మాను చేసుకున్న కాకుమాను శ్రీనివాసరావులాంటి స్నేహితులుంటారు. స్టేషన్ బెయిళ్లూ, బెంచి క్లర్కులూ ఇత్యాది పర్సనాలిటీలతో పాటు సొంతకూతుళ్ల థెఫ్ట్ కేసులు విచారించే ఆనరబుల్ జడ్జీలుంటార్యువరానర్!
ఇగ ఇందులోని ‘సినీ’మా లోకం పేరున్న స్ఫూఫు కథ హాస్యనటి శ్రీలక్ష్మిలా ఎంతమాత్రమూ కామెడీ పేరడీ కాదు. అరుంధతీ అనుష్కశెట్టికి జేజమ్మలాంటి సిల్వర్‌జూబ్లీ కథ ఇది. దీన్లోని ట్విస్టుల్తో సహా నిజంగానే తీస్తే నేరుగా ఓ హిట్టును తప్పక హిట్టొచ్చు. ఓ కెటాస్ట్రఫిక్ క్లైమాక్స్ బ్యాంగుతో ఏకంగా బ్లాక్‌బస్టరే కొట్టగలిగేంత కంటెంటు సమృద్ధిగా ఉన్నదీ కథలో.
‘హాస్టలా గీస్టలా’ అన్న కథలో నేటి విద్యావ్యవస్థపై రచయిత ఇసిరే రాయి… ‘చైనా’ బ్యాచి స్కూళ్లూ, కాలేజీల్నీ, వాటిల్లోకి కోరికోరి తమ పిల్లల్ని చేర్చే తల్లిదండ్రుల ఆలోచనల్ని నలగ్గొట్టే ‘ఇసుర్రాయి’!
ఇక క్రికెట్టు ఆట స్ఫూఫులో ఆ ప్రశ్నలూ, వాటికి సమాధానాలూ అచ్చం అదే వరవడికి పేరడీ. ఇక… వెలుగు చుట్టూ నీడలా హ్యూమర్ చూట్టూ ఆర్ద్రతా ఉండాలి. ఆ ఆర్ద్రత గుండెని తడి చేయాలి. నవ్వుతూ నవ్వుతూ అలాగే ఉండిపోకండి… కంటినీ తడిచేసుకుని, గుండెలోనూ కాస్త తడిని నింపుకోండని చెబుతూ… దీపం చుట్టూ ఆవరించి ఉన్న అందమైన కీనీడలాంటి హృదంతరాళాలను తట్టేవే… ‘దెయ్యాల మర్రి’ ‘ఎంకులయ్య తాతా’, ‘ఎలుగ్గొడ్డు పరార్’ కథలు. ఎంకులయ్య తాత తన మనవల్ని ‘ఏయ్ తాతలూ’ అని ఆప్యాయంగా పిలుస్తూ పోసే కల్లు టేస్టు గుండెకు తెలుస్తుంది.
చివరగా… పోలీస్ రాసినవే అయినప్పటికీ… ఈ కథల్లోని హ్యూమరంతా ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ లేదా అలీబాబా అరడజను దొంగలు సినిమాల్లో కామెడీ రాజేంద్రప్రసాద్‌లా మరీ అల్లరి చిల్లరగా ఉండవు సరికదా… హీరో అమితాబ్ బచ్చన్‌లా లేదంటే సూర్యా ‘సింగం’లా, విక్రమ్‌రాథోడ్ రవితేజలా, దూకుడు మహేశ్‌బాబులా హుందాగా ఉండే పోలీసాఫీసర్లలాంటి స్టైలిష్ కామెడీతో ధీరహ్యూమర్గంభీరంగా సోబర్‌గా, సూపర్‌గా తమలోని హాస్యాన్ని చిద్విలాసంగా చిందిస్తుంటాయ్.
మీరు తెలిసిన ‘ఆ నలుగురూ’ హాయిగా నవ్వుతూ ఉండాలని మీరనుకుంటే ఈ కథల పుస్తకాన్ని నేరుగా బహుమతిగా ఇవ్వొచ్చు. లేదా అమ్మాయిలకెవరికైనా ఇవ్వాలనుకుంటే ‘ఓ చక్కటి మెత్తటి పింక్ టర్కీ టవల్’లో చుట్టి గిఫ్ట్‌గా ఇస్తే… ‘ఈ పుస్తకంలో ఏదో పవరుంది. ఇందులో మాంచి వైబ్రేషనిచ్చే హ్యూమరుంది’ అనే కాంప్లిమెంట్‌తో మీపట్ల సాఫ్ట్ కార్నరూ పెరగొచ్చు. అందుకే ఆలోచించకండి. ముందు కొనేయండి.
* * * * *
#విష్_క్లైమర్ : మామూలుగానైతే పుస్తకాలకు ముందో వెనకో ఇది ఎవరినీ ఉద్దేశించిన రాసిన పుస్తకం కాదనీ, ఇందులోని పాత్రలూ, పాత్రధారులూ కేవలం కల్పితమనీ, ఏ సంఘనటతో గానీ లేదా వ్యక్తితో గానీ పోలికలు కనబడితే అది కేవలం కాకతాళీయమనీ… ఇలా డిస్‌క్లైమర్లుంటాయి.
కానీ నిజానికి ఈ పుస్తకం పూర్తిగా కొందరిని ఉద్దేశించి రాసింది. ఇందులోని చాలా సంఘటనలు ఖల్పితాలు ఖాదు… ఫఛ్ఛివాస్తవాలు. ఇందులోని పాత్రధారులు మరెవరో కాదు… దురదృష్టవశాత్తూ ఈ రచయిత దోస్తులమైన మేమే. ఇందులోని సంఘటనలన్నీ మావే. మాకే సొంతమైన ఈ సంఘటనలను చదివి ఎవరైనా భుజాలూ, మోకాళ్లూ తడుముకోదలిస్తే సదరు క్లెయిముదారులంతా ఆ లావాదేవీలన్నింటినీ ఖైరతాబాద్ పరిధిలోని ప్రెస్‌క్లబ్‌లో గానీ, గోపిరెడ్డి తరచూ విజిట్ చేస్తుండే హుసేన్‌సాగర్ పరిధిలోని బోట్స్ క్లబ్‌లోగానీ లేదా రచయిత సూచించే మరేదైనా ప్రదేశంలో ‘కూర్చుని’ సెటిల్ చేసుకోవచ్చు.
అయితే ఇందుకయ్యే ఖర్చులన్నీ సదరు క్లెయిముదారులే భరించాల్సి ఉంటుందని, మా గుట్టుల్నీ, ఇంటిగుట్లనూ బయటపెట్టిన తీవ్రమైన ఆవేదనలో మా స్నేహితులందరమూ కలిసి చేస్తున్న ఉమ్మడి ప్రకటన ఇది. అలాగే ఇందులో ఉన్నవన్నీ మా కథలే అయినందున ఈ పుస్తకం సూపర్‌హిట్ కావాలని విష్ చేస్తూ వెలువరిస్తున్నదే ఈ ‘విష్ క్లైమర్’!! ఇట్లు…….. ఈ పుస్తకంలోని పోలీస్ గోపిరెడ్డి మిత్రబృందమందరి తరఫునా… – యాసీన్
Share this Article